10, మార్చి 2021, బుధవారం

సీఎమ్ జగన్ తన పదవికి రాజీనామా చేయాలి – భండారు శ్రీనివాసరావు

 సీ ఎం రాజీనామా చేస్తేనే , కేంద్రం విశాఖ ఉక్కు విషయంలో మెట్టు దిగివస్తుందని ఓ నాయకుడు అన్నట్టు టీవీల్లో వస్తోంది. మరి ఆ నాయకుడు కూడా పదవిలేని వాడేమీ కాదు. ముందు తన పదవికి రాజీనామా చేసి మరొకరిని చేయమంటే ఒక పద్దతిగా వుండేది. కానీ అలా చేస్తే రాజకీయం ఎలా అవుతుంది.

రాజీనామాల వల్ల ఫలితం ఉండదా అనే ప్రశ్న ఒకటి వుంది. వుంటుంది. కానీ అందుకు దీర్ఘకాలిక పోరాటం అవసరమవుతుంది. పుష్కర కాలం పైగా సాగిన తెలంగాణా పోరాటంలో ఉద్యమ నాయకులు ఎన్నిసార్లు రాజీనామాలు చేసారో, ఎన్ని ఉప ఎన్నికల్లో ప్రజలు తమ అభిలాషను వ్యక్తం చేశారో, ఆ విషయం కేంద్రానికి బోధ పడడానికి ఎంత కాలం పట్టిందో ఆ సంగతులన్నీ ఈనాడు విశాఖ ఉక్కుకోసం రాజీనామాలు డిమాండ్ చేస్తున్న వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. అలా దీర్ఘకాలిక ఉద్యమం చేయగల సత్తా తమకు వుందో లేదో ఒకసారి అంచనా వేసుకోవాలి.
ప్రత్యేక హోదా కోసం ఆనాడు వైసీపీ లోక సభ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అయినా వచ్చిందా! ఇలా రాజీనామా చేయగానే అలా దిగిరావడానికి కేంద్రంలో వున్నది అల్లాటప్పా ప్రభుత్వం కాదు. కొన్ని వాస్తవాలను అవగాహన చేసుకుని ఆచరణాత్మక విధానంతో ముందుకు పోవాలి.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రాంత నాయకులు జరగబోయే వాస్తవాన్ని గమనించకుండా సమైక్య నినాదంతో ముందుకు వెళ్ళడం వల్ల ఎలాంటి నష్టం జరిగిందో ఆలోచించుకోవాలి.
‘రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయింది. మీకేమి కావాలో అడగండి అని నాటి కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు ఆంధ్ర ప్రాంత నాయకులు చేష్టలు ఉడిగి వుండిపోయారు. ఇప్పుడూ అదే విధంగా ఆలోచిస్తున్నారు.
రాజీనామాల వల్ల ఫలితం ఉంటుందని అనుకుంటే చేయండి. కానీ ఇలా ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటూ కాలక్షేపం చేయకండి.
ఎదుటివారి చిత్తశుద్ధిని శంకిస్తూ పదేపదే మాట్లాడే సమస్త రాజకీయ పార్టీల నాయకులు తమతమ పదవులకు ఒక్కుమ్మడిగా రాజీనామా చేయండి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రభుత్వ సంస్థల అధిపతులు, ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ, శాసన మండలి సభ్యులు తమ అధికార పదవులకు, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ జనసేన పార్టీల నాయకులు తమ పార్టీ పదవులకు ఒకేసారి రాజీనామాలు చేయాలి. శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల రాజీనామాలు అధికారికంగా ఆమోదించిన తర్వాత అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ కూడా రాజీనామా చేయాలి. అప్పుడు రాజకీయ పార్టీల చిత్తశుద్ధి ఏమిటన్నది జనాలకు అర్ధం అవుతుంది. వారి పట్టుదల కేంద్రానికి బోధ పడుతుంది. అలా కాకుండా ఈ ఉద్యమం ద్వారా ఏదైనా రాజకీయ లబ్ది చేకూరితే అది తమ ఖాతాలోనే పడాలి, ఇతరులకు రాకూడదు అనుకుంటే అదో రాజకీయ క్రీడ మాత్రమే అవుతుంది. ఉద్యమం అనిపించుకోదు.
కేంద్రం మెడలు వంచగలం అనే నమ్మకం వుంటే ఆ పని చేయండి. అయ్యేపని కాదు అని మీ మనసు మూలల్లో వుంటే, వాస్తవిక దృక్పథంతో వ్యవహరించి విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికుల ఉద్యోగ భద్రత, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, నిరుపయోగంగా వున్న కర్మాగారం భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడం, భూములు కోల్పోయిన వారికి సరైన పరిహారం ఇప్పించేలా చూడడం ఇటువంటి అంశాలపై గట్టి హామీ పొందేలా ప్రయత్నం చేయండి. అలా చేసే ముందు ఒక్క గొంతుకతో కేంద్రాన్ని నిలదీయండి ‘ముందు మా విశాఖ ఉక్కు ఎందుకు, దేశంలో మరో దానితో మీ విధానాల అమలు మొదలు పెట్టండని’
ఔషధం చేదుగా వున్నా పనిచేస్తుంది. అలాగే మంచి సలహా కూడా.
రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించండి. మార్గం మీకే కనపడుతుంది.
(10-03-2021)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ప్రైవేటీకరణ ఎప్పటినుండో ఉంది , అది ఇప్పుడే వచ్చింది కాదు . its good or bad, it does not matter.
జగనే కాదు , వైస్ మళ్ళి పుట్టినా ఇది ఆపలేరు . టీడీపీ , వైస్సార్ వ్యక్తిగత కక్షలు ని కూడా ఇందులో కలిపేస్తున్నాయి .
రాష్ట్రం విడిపోవడం ఖాయమని తెలిసినా కూడా , ఉత్తిత్తి ఉద్యమాలు , రాజీనామాలు అంటూ చేసి , ఉన్నది కూడా ఊడగొట్టుకుని , ఏమి చేతకాని ఈ పార్టీ లు ఉన్నంత కాలం , మన బతుకులు ఇంతే .