5, మార్చి 2021, శుక్రవారం

రాయని డైరీలో చినిగిన పేజీలు - భండారు శ్రీనివాసరావు

  

జీవించడానికే జీవితం కాదు, నేర్చుకోవడానికి కూడా ఉపకరిస్తుంది. బతుకు బాటలో కనిపించే దృశ్యాల నుంచి కనిపించని వాస్తవాలను చూడగలిగితే, మనిషి జీవితానికి ఒక సార్ధకత లభిస్తుంది. 

పండక్కి పుట్టింటికి వచ్చినట్టుగా  పది పదిహేనేళ్ళకోమారు ......మా ఆవిడకు తప్పని ఆసుపత్రి సందర్శన. పుట్టుకతో గుండెలో ఏర్పడ్డ లోపాన్ని సరిచేయడానికి 1989 లో  ఓ మారు, మళ్ళీ ఇన్నేళ్ళకు మరోమారు గుండె ఆపరేషన్. 

‘నీ గుండె గట్టిదమ్మా! ఇన్నేళ్ళు  తట్టుకుంది’ అన్నారు  డాక్టర్ వెంకటరామ రెడ్డి ఒకసారి మా ఆవిడను చూసి. ఆయనే మొదటి ఆపరేషన్ చేసి పుణ్యం కట్టుకున్న వైద్యులు. అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు. పదిగంటలు పట్టింది. ఆసుపత్రిలో మూడు వారాలు ఉన్నాము. ఇప్పుడు అలా కాదు, ఐదో రోజున ఇంటికి వెళ్ళవచ్చంటున్నారు డాక్టర్  గోపీచంద్.  

ముక్కుచెవులకు అన్నింటికీ ఏడువారాల నగలు పెట్టుకున్నట్టు వొళ్ళంతా ఏవిటేవిటో ఆక్సిజన్ మాస్కులూ, ఈసీజీ వైర్లూ. నిశ్శబ్దాన్ని మరింత భయంకరం చేస్తూ లైఫ్ సేవింగ్ యూనిట్ల చప్పుళ్ళూ. క్షణం పాటు కూడా రెండు కాళ్లు ఒక చోట పెట్టకుండా అటూ ఇటూ తిరుగుతుండే మనిషి నిస్తాణగా ఆస్పత్రి మంచం మీద. చూడలేక, చూడకుండా వుండలేక అదో రకమైన అర్ధం కాని అర్ధం లేని మానసిక స్తితి. లోకంలోని జబ్బు మనుషులందరూ ఒక్క చోట చేరినట్టు వున్న ఐసీయూ నుంచి బయట పడి....

ఆ కార్పొరేట్ ఆసుపత్రి వెయిటింగు రూములో కూర్చున్న అందరి వదనాల్లో ఏదో తెలియని ఆందోళన. ఆత్మీయుల ఆరోగ్యం గురించిన మాటలు వినీ వినపడకుండా. ఎవడయినా సూపర్ మాన్ దుడ్డుకర్ర పట్టుకుని ఈ లోకం నుంచి రోగాలను అన్నింటినీ తరిమి కొడితే ఎంత బాగుంటుందో...

రోగాలు, రోష్టులు తెలియని ఓ చిన్న పాపఅక్కడే ఆడుకుంటోంది. తెలియని అందరి దగ్గరి దగ్గరకు వచ్చి తెలిసిన ఆరిందాలా పలకరిస్తోంది. ఆ పాపాయి నవ్వుతో మనసు కొద్దిగా తేరుకుంటోంది.

ఎవరో నలుగురు వచ్చారు. ఇద్దరు మగా మరో ఇద్దరు ఆడవాళ్ళు. వేసుకున్న దుస్తుల్ని పట్టి చూస్తే అంతా మగవాళ్ళు మాదిరిగా వున్నారు. గలగలా కాకపోయినా కాస్త పెద్దగానే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ రాకతో కొద్దిగా ఎబ్బెట్టుగా మారినట్టయింది అక్కడి వాతావరణం.

ఒకమ్మాయి అడుగుతోంది ఇంగ్లీష్ లో, కాఫీ కావాలా, టీ కావాలా అని. వారేమన్నారో తెలియదు. వారిలో ఫేషన్ గా జుట్టు వెనక్కి దువ్వి ముడి వేసుకున్న ఓ యువకుడు లేచాడు, కాఫీ కౌంటర్ వైపు కదిలాడు. అప్పుడు కనిపించింది. అతడికో కాలు లేదు. ఆ స్థానంలో యంత్రం సాయంతో కదిలించగల స్టీల్ రాడ్. ఒక లిప్త పాటు మనసు అదోలా అయింది. కాలు లేకపోయినా అంత మామూలుగా ఎలా వుండగలుగుతున్నాడు ? కాళ్ళూ చేతులూ వున్న ఓ మామూలు మనిషి లాగానే తోటివారికి కాఫీ తేవడానికి ఎలా లేచాడు ? వెంట వచ్చిన వాళ్ళలో కూడా అతడో అవిటిమనిషి అన్న భావం ఏమాత్రం కానరాలేదు. కాలు లేకపోయినా కాఫీ తెస్తాను అని లేస్తే, అదో సాధారణ విషయం అయినట్టు కిమ్మనలేదు, ‘నువ్వేం తెస్తావు, కూర్చో’ అంటూ లేనిపోని సానుభూతి ఒలకపోయ్యలేదు.

మనిషితో పాటే అవస్థలు పుడతాయి. వాటిని చూసి బెదిరి పోవడం కంటే వాటితో సహజీవనం చెయ్యగలిగితే.....

అర్ధం చేసుకోవాలే కాని, ఆసుపత్రులు కూడా బోధి వృక్షాలే!



1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అతని పట్టుదలని మెచ్చుకోవాలి 👌.
అవిటితనానికి కృంగిపోకుండా పట్టుదలతో జీవితంలో ముందుకు సాగుతున్న మరొక వ్యక్తి కేరళ వనిత జిలుమోళ్ మారియెట్ థామస్. ఈ క్రింది inspiring విడియో చూడండి.

కారు నడుపుతున్న Jilumol Mariet Thomas