29, మార్చి 2021, సోమవారం

ఓ తుపాను ముచ్చట – భండారు శ్రీనివాసరావు

 ఏదైనా సాపేక్షమే, కష్టమైనా, సుఖమైనా!

దివి తుపాను సంగతి చాలామందికి తెలిసిన సంగతే. నేనైతే అప్పటికే యాక్టివ్ రిపోర్టింగ్ లోనే వున్నాను.

ఈ తుపాను అదికాదు. దివి సీమ తుపానుకు  చాలా ఏళ్ళ ముందు నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక తుపాను వచ్చింది. అప్పటికి వార్తా ప్రచార సాధన సంపత్తి లేకపోవడం వల్ల ఆ తుపాను సంగతి ఎవరికీ తెలియలేదు. 

ఓసారి వేసవి సెలవులకు మా వూరు వెళ్ళాము. మామూలుగా సెలవులు ఇవ్వగానే ఖమ్మం నుంచి, రెబ్బారం నుంచి పక్కనే ఉన్న పెనుగంచిపోలు నుంచి మా అక్కయ్యల పిల్లలు అందరూ కంభంపాడు చేరడం ఆనవాయితీ. ఆసారి మరో ప్రత్యేకత ఏమిటంటే మా ఇంటి చిన్న అల్లుళ్ళు ఇద్దరూ కుటుంబాలతో వచ్చారు. ఇల్లంతా పిల్లల ఆటపాటలతో, పెద్దవాళ్ళ చతుర్ముఖ పారాయణాలతో, అమ్మలక్కల పచ్చీసు ఆటలతో  హడావిడిగా వుంటే వంటింట్లో మా అమ్మ కట్టెల పొయ్యి ముందు కూర్చుని ఇంతమందికీ వండి వారుస్తుండేది. 

ఒకరోజు ఉన్నట్టుండి మబ్బులు కమ్మి వర్షం మొదలైంది. వేసవి వాన కావడం కారణంగా అందరం సంతోషపడ్డాము. సాయంత్రం అయినా తగ్గలేదు. కరెంటు పోయింది. ఎప్పుడు వస్తుందో తెలవదు. మా అక్కయ్యలు ఇంట్లో ఓ  మూలన పడేసిన లాంతర్లు, బుడ్లు బయటకు తీసి శుభ్రం చేసి దీపాలు వెలిగించారు. ఆ వెలుగులోనే అన్నాలు. ఆరాత్రి గడిచింది. కానీ వాన తెరిపివ్వలేదు. వంటింట్లో నుంచి యధాప్రకారం కాఫీలు, టిఫిన్లు. సాయంత్రమయింది. పొద్దుగూకింది. అయినా వర్షం ఆగలేదు. ఆడవాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. విచారిస్తే తెలిసింది ఏమిటంటే వంటింట్లో పొయ్యి పైకి వున్నాయి. పొయ్యిలో పెట్టడానికే కట్టెలు తడిసిపోయాయి. ఎల్లా! ఆ పూటకి కొంత కిరసనాయిలు వాడి పొయ్యి వెలిగించారు. ఆ పూట ఎలాగో గడిచింది. మర్నాడు కూడా ముసురు తగ్గలేదు. పెరట్లో కూరగాయలు అయిపోయాయి. మూడు పాడి బర్రెల్లో ఒకటి ఇవ్వలేదు, మేత సరిగాలేక కావచ్చు. 

తుపాను కష్టాలు మెల్లిమెల్లిగా అర్ధం అవుతున్నాయి. ఇంట్లో సరుకులు నిండుకుంటున్నాయి. పంచదార పరవాలేదు కానీ కాఫీ పొడుముకు కటకట. అల్లుళ్ళు ఇద్దరికీ సరిపోతే చాలు మిగిలినవాళ్ళు వాళ్ళే సర్దుకుంటారు అని తీర్మానించారు.

అలా పగలూ రాత్రీ తెలవకుండా వర్షం ధారాపాతంగా కురుస్తూనే వుంది. ఐదో రోజున కాస్త తెరిపి ఇచ్చింది.

వాన వెలిసిన తర్వాత దాని బీభత్సం కొద్దికొద్దిగా తెలుస్తూ వచ్చింది. మధిర రైల్వే వంతెన వరదల్లో కొట్టుకు పోయింది. హైదరాబాదు బెజవాడ మధ్య రైళ్ళ రాకపోకలు నిలిచి పోయాయి. బెజవాడ దగ్గరలో ఒక పాసింజరు రైలు పట్టాలమీద నిలిచిపోయింది. వాళ్లకు ఆహార పానీయాలు లేవు. రైలు ఎప్పుడు కదులుతుందో తెలవదు. వాళ్ళంతా బిక్క చచ్చి రైల్లోనే వుండిపోయారు. పక్క వూరి గ్రామస్తులు ఆ కష్ట కాలంలో వాళ్ళని ఆదుకున్నారు. తుపాను హడావిడి తగ్గిన  తర్వాత కేంద్ర రైల్వే శాఖవారు ఒక స్టేషనుకు ఆ ఊరి పేరు పెట్టారు.

మా ఒక్క కుటుంబమే కాదు, మా ఒక్క ఊరే కాదు, అనేక గ్రామాల వాళ్ళు మేము పడ్డ కష్టాలే పడ్డారు. ఏం చేస్తాం మన ఖర్మ అనుకున్నారు. 

తిట్టడానికి గవర్నమెంటు ఒకటుందని అప్పుడు  జనాలకు తెలవదు.

7 వ్యాఖ్యలు:

శ్యామలీయం చెప్పారు...

> తిట్టడానికి గవర్నమెంటు ఒకటుందని అప్పుడు జనాలకు తెలవదు.
ఇప్పుడు తిట్టటానికి గవర్నమెంటు అని ఒకటున్నది అని తెలిసినా తిట్టే ధ్యైర్యం ఎవరికీ లేదు.

Chiru Dreams చెప్పారు...

ఔనండి శ్యామలీయంగారు. చిన్న ట్వీట్ కూడా మోడీ గవర్నమెంట్ తట్టుకోలేకపోతుంది. సదరు ట్వీటరు దేశద్రోహుల జాబితాలో చేరిపోతున్నాడు. బీజేపీ దిగిపొయ్యెంతవరకు మనకీ ఖర్మ తప్పదనుకుంటా.

శ్యామలీయం చెప్పారు...

అప్పుడు కాంగీరేసు గోర్నమెంటొస్తుంది. దాన్ని మన మేతావులు తిట్టనే తిట్టరు. తిట్టేవారిని ప్రజాస్వామ్య కాంగీగోర్నమెంటు బ్రతకనిస్తుందా ఏమిటీ? మోదీ గోర్నమెంటు మీద వేసినంత పాటి విసుర్లూ మీరు వేయలేరండీ.

Chiru Dreams చెప్పారు...

మీలాంటి మేధావులు మాత్రం.. తిరుపతి సాక్షిగా తెలుగోరికి కొట్టిన గుండు గురించి అస్సలు మాట్లాడరు.

ఎంతైనా మీ దృష్టీలో మోధీ 11 వ అవతారం కదా! జనాలు ఎలా చస్తే మీకెందుకు లేండి. రాబోయే గాంకిరేసుని తిట్టూకుంటూ.. అలా ముందుకు పోదాం.

Chiru Dreams చెప్పారు...

>>మోదీ గోర్నమెంటు మీద వేసినంత పాటి విసుర్లూ మీరు వేయలేరండీ.

మీ దగ్గర జ్యొతిష్య పరిజ్ఞానం కూడా ఉందేంటీ? మల్టీ టాలెంటూ.

అజ్ఞాత చెప్పారు...

చిరు డ్రీంస్: పెట్రోల్ 100 రూ దాటింది.

శ్యామలీయం: మోడీ రామ మందిరం కట్టాడు.

చిరు డ్రీంస్: గ్యాస్ 1000 కి చేరువలో వున్సి.

శ్యామలీయం: మోడీ రామ మందిరం కట్టాడు.

చిరు డ్రీంస్: రైతులు ఎనోరోజుల్గుగా ఇల్లూ వాకిలీ వొదులుకోని గిట్టూబాటుకోసం అలమటిస్తున్నారు.

శ్యామలీయం: మోడీ రామ మందిరం కట్టాడు.

చిరు డ్రీంస్: స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పి అంధ్రుల్ని నిలువునా మోసం చేశాడు.


చిరు డ్రీంస్: రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోగా, విశాక ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్ముకుంటున్నాడు.

శ్యామలీయం: మోడీ రామ మందిరం కట్టాడు.

చిరు డ్రీంస్: ఇంకా.....

శ్యామలీయం: మాకేం అవసరంలేదు. మోడీ రామ మందిరం కట్టాడు.

Chiru Dreams చెప్పారు...

LOL...... Good catch