2, మార్చి 2021, మంగళవారం

రాజకీయాల్లో ఇంత డబ్బు ఉందా?

 

“మీరు మహా టీవీకి వెడుతున్నారు. ఖచ్చితంగా అక్కడ బాబు గారికి అనుకూలంగా కొన్ని మాటలు చెబుతారు. నాకు బాగా తెలుసు. మిమ్మల్ని చాలా రోజులుగా టీవీల్లో చూస్తున్నాను. ఈ మధ్య రావడం లేదు. అది వేరే సంగతి”
నాకు వచ్చిన మెసేజ్ ప్రకారం ఆ ఓలా క్యాబ్ డ్రైవర్ పేరు కరుణాకర్.
మూతి గుడ్డ పెట్టుకుని మాట్లాడడం వల్ల ముందు అతనేమంటున్నాడో నాకు అర్ధం కాలేదు. నేను కల్పించుకునే చెప్పేలోగా అతడే ఇంకా ఇలా అన్నాడు.
“మొన్న మిమ్మల్ని సాక్షిలో చూశాను. అక్కడా ఇంతే. జగన్ గారికి కొంత అనుకూలంగా మాట్లాడారు. నేను తప్పు పట్టను. మీలో నాకో సుగుణం కనిపించింది. బాబు అనుకూల ఛానల్లో బాబు వైపు మొగ్గు చూపినా జగన్ గారికి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా నోరు తెరిచి చెప్పరు. అలాగే సాక్షిలో జగన్ గారికి అనుకూలంగా మాట్లాడుతారు కాని బాబు గారికి వ్యతిరేకంగా ఎవరు రెచ్చగొట్టినా మాట్లాడరు. అయినా మీరు నాకు ఎందుకు నచ్చుతారంటే, ఏ టీవీలో మాట్లాడినా మధ్యలో ఎక్కడో వీలు చేసుకుని ఆ ఛానల్ వాళ్లకు ఇష్టం వున్నా లేకపోయినా మీ మనసులో మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. అందుకే ఏ ఛానల్లో కనపడ్డా, యూ ట్యూబ్ లో కనపడ్డా నేను తప్పకుండా చూస్తాను”
అన్నాడు కరుణాకర్.
ఇంతకీ పొగుడుతున్నట్టా, తెగుడుతున్నట్టా! ఏదైనా దాచుకోకుండా మనసులో మాట చెబుతున్నాడు. జనం నాడి తెలుసుకోవడానికి ఇలాంటివాళ్ళే బెటరు.
“రాజకీయాలు అంటే ఇంట్రస్టా” అని అడిగాను ఏదో ఒకటి మాట్లాడాలని.
“నాకొకటి చెప్పండి. వీళ్ళకు ఇంత డబ్బు ఎలా వస్తుందండీ. నాకొక దోస్త్ వున్నాడు. వాడూ ఒకప్పుడు నాలాగే డ్రైవర్. ఒక నాయకుడి దగ్గర చేరి ఎక్కువ కాలం కాలేదు. ఏదో ఎన్నికల్లో మా వాడిని మా ఊరి వార్డు మెంబరు చేశారు. ఇప్పుడు అతడి వైభోగం వేరు. సొంత కారుంది. చిన్న ఇల్లు కట్టాడు. చాలా ఖరీదు చేసే సెల్ ఫోన్లు తరచూ మారుస్తుంటాడు. ఒక వార్డు మెంబరు అయితే ఇంత సంపాదన ఉంటుందా! ఈ లెక్కన బడా బడా నాయకుల రాబడి ఎంత వుంటుందో మరి”
జవాబు చెప్పే వ్యవధానం లేకుండా చేరాల్సిన గమ్యం చేరుకోవడం వల్ల అతడి ప్రశ్నకు బదులు ఇవ్వలేదు. నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలియదు.
(OLACAB : KARNAKAR TS 15UB 3347)

కామెంట్‌లు లేవు: