తెలుగు దేశం
పార్టీ పుట్టేనాటికి నాకు ముప్పయ్ ఆరేళ్ళు. ఆ పార్టీలో నాడు కొత్తగా చేరినవాళ్ళలో
చాలామంది వయసులో నాకంటే చాలా చాలా చిన్నవాళ్ళు. ఇప్పుడు ఆ పార్టీ వయస్సు నలభయ్ ఎనిమిది.
వాళ్ళ వయసు డెబ్బై దాటి వుంటుంది.
ఆ పార్టీ
ఆవిర్భావం నాటికి నేను రేడియో విలేకరిగా పనిచేస్తున్నాను. మొదట రామకృష్ణా సినీ
స్టూడియోలో విలేకరులను పిలిచి తాను త్వరలో రాజకీయ
పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. పార్టీ స్వరూప స్వభావాలను గురించి గుచ్చి
గుచ్చి ప్రశ్నించినా వాటికి ఆయన నుంచి జవాబు లేదు. ఊహా జనితమైన వేటికీ సమాధానం చెప్పనని చెప్పేశారు.
అయితే చెప్పే
ముహూర్తం త్వరలోనే వచ్చింది. మళ్ళీ విలేకరులకు పిలుపువచ్చింది. ఈసారి ఎమ్మెల్యే
క్వార్టర్స్ లో కలుసుకున్నారు. పెట్టబోయే పార్టీ పేరు
“తెలుగుదేశం పార్టీ” అనగానే అందరూ విస్తుపోయారు. ఒక పార్టీకి, అందులోనా ఒక
ప్రాంతీయ పార్టీకి దేశం అనే పదం జోడించడం ఏమిటని అనుకున్నారు.
ఇక అక్కడనుంచి ఆయన
కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు.
తెలుగువారి
ఆత్మగౌరవాన్ని ఆ పార్టీ ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిందన్నారు. ఒక తాసీలు
ఆఫీసులో గుమాస్తాను బదిలీ చేయాలన్నా ఢిల్లీ అనుమతి కోసం ఎదురుచూపులు చూసే పార్టీ, తెలుగు ప్రజలకు ఏం
ఒరగబెడుతుందని ప్రశ్నించారు. ఇప్పటి కాంగ్రెస్ మహాత్మా గాంధీ కాలం నాటి కాంగ్రెస్
యెంత మాత్రం కాదన్నారు. ఇంగ్లీష్ లో ఎన్ని అక్షరాలు వున్నాయో కాంగ్రెస్ అన్ని
రకాలుగా చీలిపోయిందని ఎద్దేవా చేసారు.
పార్టీ ప్రచారం
కూడా వినూత్న పద్దతిలో సాగింది. ముందు హెలికాప్టర్ పై రాష్ట్రాన్ని చుట్టి రావాలని
అనుకున్నారు. కానీ కేంద్రంలోని ప్రభుత్వం హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వలేదని
కాంగ్రెస్ పైనే నెపం వేసారు. పర్యటనల కోసం తమ ఇంట్లో ఓ గరాజులో మూలపడివున్న, ఎప్పుడో ముచ్చట పడి కొనుక్కున్న నల్ల రంగు వ్యాన్ ని బయటకు తీసి కొత్త
నగిషీలు చెక్కారు. వ్యాను పైకెక్కి ఉపన్యసించడానికి వీలుగా ఏర్పాట్లు చేసారు.
ఎన్టీఆర్ భోజనం, పడక అంతా అందులోనే. ఉదయం పూట రోడ్డుపక్కనే స్నానాలు. అంతవరకూ ఇలాటి ప్రచారం
ఎరుగని వారికి వింతగా అనిపించింది. ఒక్క పత్రిక తప్ప మిగిలిన తెలుగు
దినపత్రికలన్నీ అప్పుడు కాస్తో కూస్తో కాంగ్రెస్ అనుకూల వార్తలు రాసేవి. రామారావు
గారు సాగిస్తున్న ఈ ప్రచారాన్ని చూసి కాంగ్రెస్ నాయకులు ‘డ్రామా రావు’ అని
అపహాస్యంగా మాట్లాడేవాళ్ళు. కాంగ్రెస్ నాయకుడు జీ. వెంకటస్వామి గారు ‘అది తెలుగు
దేశం కాదు, కమ్మ దేశం’ అంటూ నేరుగా ఆ పార్టీకి కులాన్ని ఆపాదిస్తూ ప్రకటన చేసారు.
అప్పుడు కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని విలేకరులం
కలిసి ‘ మీ మామగారి పార్టీలో చేరతారా అని అడిగితే, ‘పార్టీ ఆదేశిస్తే
ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తా’ అని బదులిచ్చారు. ఆ సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో, మరునాడు
పత్రికల్లో ‘మామగారిపై పోటీకి రెడీ అంటున్న చంద్రబాబు’ అంటూ ప్రముఖంగా వార్తలు
వచ్చాయి.
ఎన్టీఆర్ చైతన్య
రధం ఒక గ్రామం చేరే లోగా మరో జీపు ముందుగానే అక్కడికి చేరుకునేది. వేములపల్లి శ్రీ
కృష్ణ రాసిన ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ అనే పాట, శంకరంబాడి సుందరాచారి
రచించిన ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ అనే పాటలను మైకుల్లో వినిపించేవాళ్ళు.
వస్తున్నది రామారావు వంటి సుప్రసిద్ధ నటుడు. వేస్తున్నది ఉర్రూతలూగించే ఈ పాటలు.
జనాలు విరగబడేవాళ్ళు. వాళ్ళను చూడగానే ఎన్టీఆర్ ప్రసంగం మరింత వేడెక్కేది. ఇక ఈలలూ, చప్పట్లతో ఆ ప్రాంతం
మారుమోగిపోయేది.
ప్రచారం ఉధృతం
అవుతున్న కొద్దీ కాంగ్రెస్ నాయకులకు తత్వం బోధపడింది. అపజయం తప్పదేమో అనే సందేహం
పట్టుకుంది. దీనికి తొలి సూచన నంద్యాలలో జరిగిన ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారంలో
కనబడింది. ఆసభలో మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి బొజ్జా వెంకట రెడ్డి ‘
బడుగు బలహీన వర్గాలను కాపుకాసే కాంగ్రెస్ కు ఓటు వేస్తారా, సినిమా వేషాలతో
జిమ్మిక్కులు చేసే తెలుగు దేశం పార్టీకి ఓటేస్తారా’ అని అడిగితే సభకు వచ్చిన
వాళ్ళలో చాలామంది మా ఓటు ఎన్టీఆర్ కే అని చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణులు
నీరసపడిపోయాయి. తిరుపతి ఎన్నికల సభల నాటికి ధ్రువ పడింది.
ఎన్నికలు జరిగాయి.
ఫలితాలు వెలువడుతున్నాయి. షాద్ నగర్ నుంచి మొదటి ఫలితం అధికారికంగా వచ్చింది.
కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ పి. శంకరరావు గెలుపొందారు. అక్కడ రాష్ట్ర చరిత్రలో మొదటి
సారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. అందువల్ల
మిగిలిన అన్ని చోట్లకంటే అక్కడ ఫలితం చాలా ముందుగా వెలువడింది. షాద్ నగర్ నుంచి
నేను పంపిన వార్త మధ్యాన్నం, సాయంత్రం
వార్తల్లోనూ, ఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే ఆరుగంటల ఇంగ్లీష్ వార్తల్లోనూ ప్రముఖంగా
వచ్చింది. తరువాత చాలా సేపటి వరకు ఎటువంటి సమాచారం ఎక్కడి నుంచి లేదు. టీడీపీ
అభ్యర్ధులు చాలా చోట్ల ఆధిక్యతలో వున్నట్టు అనధికారికంగా తెలుస్తున్నా, అప్పటి నిబంధనలు
అనుసరించి ప్రసారం చేయడం సాధ్యపడలేదు. కావాలనే రేడియోలో వార్తలు
తొక్కిపడుతున్నారని ఆ పార్టీ అభిమానుల్లో సందేహాలు కలిగాయి. కొందరు రేడియో స్టేషన్
దగ్గర ఆందోళనకు దిగారు కూడా. విషయం వివరించి చెప్పడంతో శాంతించారు.
అదే రాత్రి
ఫలితాలు చాలావరకు తెలిసిపోయాయి. ప్రభుత్వం స్థాపించడానికి ఏర్పాటు చేసే మెజారిటీ
టీడీపీకి అప్పటికే లభించింది. ఎన్టీఆర్ ని కలిసి ఆయన స్పందన రికార్డు చేయడానికి
స్కూటరు మీద ఆబిడ్స్ నివాసానికి వెళ్లాను. వాకబు చేస్తే ఆయన అప్పటికే నిద్రకు
ఉపక్రమించారని తెలిసింది.
దటీజ్ ఎన్టీఆర్.
రాష్ట్రమంతా సంబరాలు జరుగుతుంటే ఆయన మాత్రం ఆయన అలవాటు ప్రకారం వేళకు నిద్రపోయారు.
మరునాడు అప్పటి
ముఖ్యమంత్రి విజయభాస్కర రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్పందన విచిత్రం అనిపించింది.
“కాంగ్రెస్ పార్టీ
ఎన్నటికీ తుడిచిపెట్టుకునిపోదు. చూస్తుండండి, మళ్ళీ అధికారంలోకి
వస్తుంది”
అప్పుడు భేషజం
అనిపించిన ఆయన మాటలు ఆరేళ్ళ తరువాత నిజమయ్యాయి. 1989 లో కాంగ్రెస్
పార్టీ, టీడీపీని ఓడించి మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టింది.
(14-03-2021)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి