12, మార్చి 2021, శుక్రవారం

మంచి పుస్తకం కూడా ప్రాప్తమే – భండారు శ్రీనివాసరావు

 2011. అంటే పదేళ్లు.

మాజీ డీజీ హెచ్.జే. దొర గారు ఎంత హుందాగా ఉంటారో ఆయన రాసినఎన్టీఆర్ తో నేను’ అనే పుస్తకావిష్కరణ కూడా అంత హుందాగా ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఆదివారం (18-12-2011) కావడంతో హైదరాబాదు బుక్ ఎగ్జిబిషన్ కిటకిటలాడింది. అంత జనసందోహంలో కూడా ఆవిష్కరణ సభ చక్కగా నిర్వహించారు. వేదిక మీద గవర్నర్ నరసింహన్ తోపాటు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర రావు, కే.రామచంద్రమూర్తి, మాజీ ఐజీ రావులపాటి సీతారామా రావు, ఎమెస్కో విజయ కుమార్ వుంటే,  సభకు హాజరయిన వారిలో మాజీ డీజీపీలు అరవిందరావు, ఆర్. ప్రభాకర రావు, మాజీ ఐపీఎస్ అధికారులు శివశంకర్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఇంకా అనేకమంది పోలీసు అధికారులు, జర్నలిస్టులు వున్నారు.

గవర్నర్ నరసింహన్ గారి ప్రసంగం ఆత్మీయంగా సాగుతూ భేషజాలు లేని మనసులోని మాటలతో సభికులను ఆసాంతం ఆకట్టుకుంది.

అనంతపురంలో దొర గారు ఎస్పీ గా పనిచేస్తున్నప్పుడు నరసింహన్ గారు ట్రైనీ ఏఎస్పీ గా జాయిన్ అయ్యారట. దొరగారి శ్రీమతి కూడా తనను ఎంతో బాగా చూసుకొనేవారని చెప్పారు. ఓ సారి ఆయన తీవ్రంగా అస్వస్తులు అయినప్పుడు పుట్టపర్తి నుంచి సత్య సాయిబాబా విభూతి తీసుకువచ్చి పెట్టారుట. ఈ మాటలు చెబుతూ గవర్నర్ నరసింహన్ గారు సభలో వున్న దొరగారి శ్రీమతికి వేదికపై నుంచే ప్రత్యేకంగా అభివాదం చేసారు. వాళ్ళ ఆత్మీయత ఎప్పటికీ మర్చిపోలేననన్నారు. ఇంటికి వెళ్తే పూత రేకులు పెట్టేవారని గుర్తు చేసుకొన్నారు.దొర గారు ఎప్పుడు ‘అముల్ బేబీ’ మాదిరిగా చిరునవ్వులు నవ్వుతూ వుంటార’ని అంటూ సభలో నవ్వుల పువ్వులు పూయించారు. అయితే అంత మాత్రాన ఆయన దగ్గర చొరవ తీసుకోలేమమని అన్నారు. పూత రేకులు పెట్టిన కొంత సేపటికే ‘నైట్ పెట్రోలింగుకు ఎందుకు వెళ్ళలేద’ని కేకలేసేవారని చెబుతూ, డిపార్ట్ మెంట్ లో వున్న అప్పటి భయ భక్తులను సభికులకు, ముఖ్యంగా సభలో వున్న పోలీసు అధికారులకు జ్ఞాపకం చేసారు. రావులపాటి సీతారామారావు గారిని గురించి చెబుతూ ‘ఆయనతో పాటు పన్నెండు మంది ట్రెయినీ డీఎస్పీలు అనంతపురం పోలీసు ట్రైనింగ్ కాలేజీలో వుండేవారని, మద్రాస్ నుంచి తాను తెచ్చిన తినుబండారాలన్నీ వాళ్ళే తీసేసుకునేవార’ని చురక వేసారు. తనకు తెలుగు చదవడం బాగా  రాకపోయినా, పుస్తకం టైటిల్ ‘ఎన్టీఆర్ తో నేను’ అనే బదులు ‘ఎన్టీఆర్ నేనే’ అని పెడితే సరిపోయేదని చతురోక్తి విసిరారు. గవర్నర్ స్థాయిలో వుండి కూడా అనుబంధాలకు, ఆత్మీయతకు నిదర్శనంగా నిలిచారు నరసింహన్ గారు.

పుస్తకావిష్కరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరికి ఆ పుస్తకం కావాలని అనిపించింది. కొంత మందికి ఎమెస్కో విజయ్ కుమార్ గారు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. అందరికి ఇవ్వడం సాధ్యం కాదు కదా. ఆ హడావిడిలో ఆర్వీవీ కృష్ణారావుగారు వెంటనే బుక్ ఎగ్జిబిషన్ లో వున్న ఎమెస్కో స్టాల్ కి వెళితే ‘లేవు’ అని చెప్పారు. అప్పటికే అందరూ వెళ్లిపోతున్నారు. దొరగారితో ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ లు తీసుకుంటూ వుండడంతో ఆయన బిజీగా వున్నారు. ఈలోగా ఎవరో చెప్పారు ‘నవోదయ స్టాల్ లో ట్రై చెయ్యండి’ అని. అక్కడకి వెడితే కొద్ది కాపీలే వున్నాయి. ఆయన రెండు కాపీలు కొని, దొర గారి దగ్గరకి వచ్చి ‘సార్! మీ సంతకం కావాలి” అంటే వెంటనే గుర్తు పట్టి సంతకం చేసిచ్చారు. ‘రెండో పుస్తకం మీద కూడా కావాలి సార్! ఇది భండారు శ్రీనివాస రావుకి’ అంటే ‘శ్రీనివాసరావు ఎలా వున్నాడు?’ అని ఎంతో అభిమానంగా అడుగుతూ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. కృష్ణారావు గారు, నేను ఇదివరలో రేడియోలో పనిచేసే రోజుల్లో దొరగారితో చాలా సన్నిహితంగా వుండే వాళ్ళం. నక్సలైట్ సమస్య ఉధృతంగా వున్న రోజుల్లో రేడియో ప్రభావం బాగా వుండేది. ఢిల్లీ నుంచి వచ్చే స్పాట్ లైట్ వంటి ముఖ్యమయిన కార్యక్రమాల్లో సయితం ఈ సమస్యకు ఎక్కువ ప్రాధాన్యం వుండేది. వృత్తి  రీత్యా మేము ఆయన్ని కలిసినప్పుడు, ముఖ్యంగా కొత్త సంవత్సరం ఆరంభంలో డీజీపీ సంప్రదాయంగా ఇచ్చే పార్టీల్లో మమ్మల్ని గుర్తుంచుకుని అభినందించేవారు.

ఈ విధంగా దొరగారు రాసిన ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పుస్తకం కొనకుండానే, ఆయన ఆటోగ్రాప్ తో సహా, నా చేతికి వచ్చింది.

ప్రతి ధాన్యపు గింజమీదా తినేవాడి పేరు రాసివుంటుందిట. అలాగే ప్రతి పుస్తకం మీదా దాన్ని చదివేవాడి పేరు ఉంటుందేమో!

అలా అయాచితంగా దొరగారి పుస్తకం ఆయన సంతకంతోసహా నా చేతికి వచ్చింది.

 

 (12—03 -2021)

కామెంట్‌లు లేవు: