27, మార్చి 2021, శనివారం

నిఖార్సయిన ఐ.ఏ.ఎస్. నారాయణన్

 గట్టి పరిపాలకుడు అనిపించుకోవడానికి పెద్ద డిగ్రీలు అక్కరలేదు అనడానికి జలగం వెంగళరావును చెప్పుకోవచ్చు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జలగం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పరిపాలన నల్లేరు మీది  బండిలాగా సజావుగా  సాగిపోయేది. పైగా ఆయన హయాములో ఎమర్జెన్సీ. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు చోట్లా కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఇక అడ్డేముంటుంది.

ఈరోజుల్లో నానారకాల లాబీలు, ప్రభుత్వాలపై ఒత్తిడి పెట్టడానికి. ఆ రోజుల్లో రెండే రెండు లాబీలు.  అరకు (సారాయి) వ్యాపారులు, బియ్యం మిల్లుల వాళ్ళు.

జలగం వెంగళరావుకి, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల బియ్యం వ్యాపారులకి మెరుగయిన సంబంధాలు ఉన్న సంగతి బహిరంగ రహస్యమే.

అప్పుడు కృష్ణా జాయింటు కలెక్టరుగా నారాయణన్ అనే ఐ.ఏ.ఎస్. అధికారి వుండేవారు. మిల్లులవాళ్ళు బియ్యంలో రాళ్లు కలిపి  జనాలకు పంటికింది రాయిగా వుంటే, ఆ అధికారి మాత్రం వాళ్ళకే పంటి కింది రాయిలా తయారయ్యారు. ఆ నిక్కచ్చి అధికారి తనిఖీలు చేసి చాలా బియ్యం మిల్లులకు తాళాలు వేయించే పనిలో వుంటే, రాబోయే ముప్పును గమనించిన వ్యాపారులు ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు. ఇటు చూస్తే కావాల్సిన వాళ్ళు. అటు చూస్తే మచ్చలేని అధికారి.

చివరికి ముఖ్యమంత్రే ఆ అధికారికి ఫోను చేసి మాట్లాడాల్సివచ్చింది. వెంగళరావు గారు అధికారులతో చాలా హుందాగా వ్యవహరిస్తారని ప్రతీతి.

“చూడండి నారాయణన్ గారూ. మీ వద్ద కొన్ని ఫైళ్ళు పెండింగులో వున్నాయి. వాటి మీద మీ అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా రాసి పంపండి. ఇందులో ఎలాంటి ఒత్తిడీ వుండదు.

“పనులు ఎలా చేయించుకోవాలో బాగా తెలిసిన వాళ్ళే వాళ్ళు”

అన్నారు నింపాదిగా.

ఇదే అధికారి కొన్నాళ్ళు ఒంగోలులో పనిచేశారు. అధికారికమైన పనివుండి హైదరాబాదు వెళ్లి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుని సచివాలయంలో కలిసారు. లిఫ్టులో కాకుండా మెట్లెక్కి వెళ్ళారేమో ఆ అధికారి  కొంచెం ఆయాసపడుతూ ముఖ్యమంత్రి ఛాంబర్ లోకి వెళ్ళారు. ఆయన్ని చూసి జలగం నవ్వుతూ ఇలా అన్నారు.

“ఏమిటలా ఆయాసపడుతున్నారు. మా పిడతల మిమ్మల్ని తరుముతున్నాడా ఏమిటి?

పిడతల రంగారెడ్డి ఒంగోలు జిల్లా  కాంగ్రెస్ అగ్ర  నాయకుడు. ఇద్దరూ కాంగ్రెస్ వాళ్ళే. కాకపోతే ఒకరంటే ఒకరికి పొసగదు.

జలగం మాటల్లోని శ్లేష అదే.

ఈ నారాయణన్ గారు కొన్నేళ్ళ క్రితం వరకు మా రెండో అన్నయ్య రామచందర్రావు గారుంటున్న అపార్ట్ మెంటులోనే అద్దెకు వుండేవారు. ప్రస్తుతం సొంత ఇంటికి మారిపోయారు.

ఆ కొద్ది కాలపు పరిచయంలో మా అన్నయ్యకు తెలిసివచ్చినదేమిటంటే – నారాయణన్ అత్యంత సౌమ్యుడు, నిక్కచ్చిగా వ్యవహరించే నిఖార్సయిన ఐ.ఏ.ఎస్. అధికారి. వాచ్ మన్ తో సహా  ఎవరినీ పల్లెత్తు మాట పరుషంగా అనడం మా అన్నయ్య చూడలేదు, వినలేదు.

(27-03-2021)  

 

కామెంట్‌లు లేవు: