27, మార్చి 2021, శనివారం

తెలుగు నాటకం – సింహావలోకనం - భండారు శ్రీనివాసరావు

 (మార్చి 27, ప్రపంచ రంగస్థల దినోత్సవం)

హైదరాబాదు చిక్కడపల్లి త్యాగరాజ గానసభలో దాదాపు వారానికి ఒక రోజయినా ఏదో ఒక నాటకం వేస్తుంటారు. ఈవిధంగా రంగ స్తల రంగానికి గానసభ చేస్తున్న సేవ మెచ్చుకోతగ్గదే. కాకపొతే నాటకానికి ముందు ఏదో ఒక సభ పెట్టి వక్తల ప్రసంగాలతో, ముఖ్య అతిధుల అభిభాషణలతో ప్రేక్షకుల ఓర్పును పరీక్షిస్తుంటారన్న అపప్రధ వుంది. ఓ పక్క ‘నాటకం ఎప్పుడు మొదలవుతుందా’ అని ప్రేక్షకుల ఎదురు చూపులు చూస్తుంటే, మరోపక్క ఇవేమీ పట్టించుకోకుండా సుదీర్ఘంగా సాగే సభలో పాల్గొనే వక్తలు ‘నాటకానికి పూర్వ వైభవం తేవాలంటూ’ అంటూ దీర్ఘోపన్యాసాలు దంచుతుంటారు. వారు కోరుకునే పూర్వవైభవం ఎప్పుడూ వస్తుందో తెలియని నాటకాభిమానులు అప్పటికే చాలా పొద్దుపోయిందనుకుని నిట్టూర్పులు విడుస్తూ బయటకు జారుకుంటూ వుంటారు. ఇక ఆడిటోరియంలో మిగిలేవారు పల్చబడుతుంటారు.

ఈ నాటకాలు చాలు. వాటిని కట్టిపెట్టు’ అని చాలా సార్లు నిజజీవితంలో అనుకుంటూ వుండడం కద్దు. నిజంగా జరుగుతున్నది కూడా అదే. నాటకానికి పూర్వ వైభవం మాటలతో రాదు. అలాగని చేతలు కూడా పని చెయ్యడం లేదు. పదిహేనేళ్ళ క్రితం, పరిచయం అవసరంలేని పెద్దమనిషి కే.వీ. రమణాచారి గారు ‘రసరంజని’ సంస్త ద్వారా ‘నాటకానికి ప్రాణం పొయ్యాలి’ అని నానా తంటాలు పడ్డారు. బోల్డంత ఖర్చు పెట్టారు. విసుగెత్తి మానేశారు.

కావ్యేషు నాటకం రమ్యం’ అన్నాడు కాళిదాసు. తెలుగు వారికి పద్య నాటకాలు ఎంతో ఇష్టం. ఎనభయ్యో దశకంలో కూడా నాటకాలు బాగా చూసే వారు. ‘ఉద్యోగ విజయాలు’ నాటకంలో ‘చెల్లియో చెల్లకో’, ‘జెండాపై కపిరాజు’ ‘అలుగుటయే యెరుంగని’ పద్యాలు కంఠతా రానివారు, అవి తెలియని వారు తెలుగునాట అరుదు. పొద్దున్నే చద్దన్నం తిని, గొడ్లను మేపు కోవడానికి వెళ్ళిన పాలేర్లు, పశువులు మేస్తూ వుంటే చెట్టుకింద పడుకొని ఈ పద్యాలు పాడుకొంటూ, రాగాలు తీస్తూ రోజంతా హుషారుగా గడిపేవారు. అలా గాలివాటంగా పద్యాలు పాడేవారే తదనంతర కాలంలో రంగస్థల నటులుగా మారిన ఉదాహరణలు కూడా వున్నాయి.

తెలుగు నాటక బావుటా (2)

పౌరాణిక నాటకాలు అంటే చెవి కోసుకొంటాము’ అనేవాళ్ళు పాతికేళ్ళ క్రితం దాకా. ఇది పూర్తిగా నిజం. ఆ నాటకాల్లో పాత్రధారి ఎలా వున్నా పద్యం పాడడానికే ప్రాధాన్యం. ఎంత రాగం తీస్తే అంతగా తలలూపేవాళ్ళు. ‘ఒన్స్ మోర్’ అనే ఇంగ్లీష్ మాట పల్లెపట్టులలోని నిరక్షరాస్యులకు కూడా తెలుసు. ఓ పద్యం పాడగానే ‘ఒన్స్ మోర్’ అని అరిచే వారు. ఆ పద్యం మళ్ళీ పాడే వరకు నాటకాన్ని ముందుకు సాగనిచ్చేవారు కాదు. ఓ సీన్లో పద్యం పాడిన తర్వాత ఆ పాత్రధారి పాత్రోచితంగా కింద పడిపోవాల్సిన సందర్భంలో కూడా ప్రేక్షకులు ఎవరయినా ‘ఒన్స్ మోర్’ అంటే చాలు అతగాడు మళ్ళీ లేచి నిలబడి పద్యం పాడి రాగం తీసి మళ్ళీ పడిపోయేవాడు. ఔచిత్యమా కాదా అనేది అక్కడ అనవసరం. అలా సాగేవి నాటకాలు. జనం విరగబడి చూసే వారు. ఊళ్ళల్లో, ఉత్సవాలు అవీ జరిగినప్పుడు ‘టికెట్ నాటకాలు’ ఆడేవారు. ‘ఫలానా హాలులోనో లేక ఫలానా వారి దొడ్లోనో’ అని కర పత్రాలు వేసే వారు. ఒకళ్ళవో ఇద్దరివో నటుల ఫోటోలు కూడా ఉండేవి, పాంఫ్లెట్ చివర్లో రేట్లు ఉండేవి. రిజర్వుడు, కుర్చీ, బెంచీ, నేల ఇలా విడివిడిగా టిక్కెట్లు వుండేవి. మహా అయితే టికెట్ ఖరీదు రూపాయి, అర్ధ, పావలా అలా వుండేది. ‘ప్యాట్రన్ టిక్కెట్లు కలవు’ అని రాసే వారు. ‘స్త్రీలకు ప్రత్యేక స్థలం. ఆలసించిన ఆశాభంగం, షరా మామూలే! త్వరపడండి. ముందుగా టిక్కెట్లు రిజర్వ్ చేసుకోండి! ఏ కారణం చేతనయినా ప్రదర్శన నిలిపివేసినయెడల టికెట్ డబ్బు వాపసు ఇవ్వబడదు’ ఇలా ఏవేవో రాసేవారు.

మరపురాని కొందరు మహానటులు

నాటకాలు ఆడేవారిలో సూరిబాబు,రాజేశ్వరి నిజజీవితంలో భార్యాభర్తలు. సూరిబాబు కంఠం అదోరకంగా వుంటుంది. కంచు కంఠం అనేవారు. చాలా సినిమాల్లో వేషాలు వేసారు. ఎక్కువగా నారదుడిగా. స్టేజి మీద ఆయన ధర్మరాజు వేసేవారు.

పాచికలు ఆడే సీనులో తమ్ములను, ద్రౌపదిని వొక్కొక్కరినీ పణంగా పెట్టి వోడిపోతున్న ఘట్టంలో పద్యాలు గొప్పగా ఉండేవి. రాజేశ్వరితో కలసి ‘తారాశశాంకం’ ఆడేవారు.

బెజవాడలో శరభయ్య గుళ్ళకు ఎదురుగా రైలు పట్టాలకు ఆవతలి వయిపు ‘రాజేశ్వరి మేడ’ వుండేది. కందుకూరి చిరంజీవి రావు మరో ధర్మరాజు. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్ గా వుండేవారు. పద్యంతో పాటు నటనకు ప్రాధాన్యం ఇచ్చేవారు.

సి.డి. కృష్ణమూర్తి అనే ఆయన కూడా ధర్మరాజు, కృష్ణుడు వేషాలు వేస్తూ వుండేవారు. జైహింద్ టాకీసు లక్ష్మీ టాకీసుల మధ్య సోమిదేవమ్మ గారింట్లో వెనుక పోర్షన్ లో అద్దెకు వుండేవారు. పుట్టుకతో అరవ వాడు అయినా తెలుగులో సుస్వరంతో రాగయుక్తంగా పద్యాలు పాడేవారు. కిరీటం వెనుక గుండ్రటి వెలుగు ప్రసరిసున్నట్టుగా కృష్ణుడి వేషంలో ట్రిక్ ఫోతోగ్రఫీతో తీయించుకున్న అనేక ఫోటోలు సీడీ కృష్ణమూర్తి గారింట్లో గోడలమీద దర్శనమిచ్చేవి.

దుర్యోధనుడుగా ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి పేరు అందరికీ తెలిసిందే. నాటకాల్లో ప్రారంభించి సినిమాలకు వెళ్లి అడపా తడపా మళ్ళీ నాటకాలు వేస్తూ వుండేవారు. చివరగా అవసాన దశలో గుంటూరులో వో పెద్ద ఆంజనేయ స్వామి గుడి కట్టించి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ రాముల వారిలో ఐక్యం పొందారు.

ఎన్. వి. ఎల్. నరసింహాచార్యులు, తుర్లపాటి రాధాకృష్ణమూర్తి , వెంట్రప్రగడ నారాయణరావు, దుర్యోధన వేషాలకు ఖ్యాతి గడించారు. కురుక్షేత్రంలో భీముడిదో మంచి పాత్ర. వేమవరపు శ్రీధరరావు గారు భీముడి పాత్రకి మరోపేరుగా నిలిచారు. ఈయనకూడా రేడియో స్టేషన్ లో స్టాఫ్ ఆర్టిస్ట్ గా వుండేవారు. టి. శేషా రావు, విన్నకోట సాంబయ్య భీముడిగా గుర్తుండిపోయే పేర్లు. అబ్బూరి ఆదినారాయణ శర్మ, అబ్బూరి వర ప్రసాద రావు తమ్ముడు. ఈయన కర్ణుడిగా వేసేవారు. అలాగే అబ్బూరి వెంకటప్పయ్య. హెచ్. ఎం. వి. వారి గ్రామఫోను రికార్డుల్లో అబ్బూరితో కలసి పాడారు.

నటిస్తూనే చనిపోయిన నటులు

వల్లూరు వెంకట్రామయ్య చౌదరి ‘బాలనాగమ్మ’ నాటకం ఆయన పోయే వరకు బాగా నడిచింది. మాయల ఫకీరుగా ఆయన నటన గొప్పగా వుండేది అనే వారు. ఓ నాటకంలో నటిస్తూనే స్టేజీ మీదే చనిపోయారు. అలాగే ‘రామాంజనేయ యుద్ధం’ లో ఆంజనేయుడి పాత్ర ధరించే బేతా వెంకటరావు గారు కూడా వేషం మీదే చనిపోయారు. మహానుభావులు. కళామతల్లి సేవచేస్తూనే కన్నుమూశారు. వెంకటరావు గారి అబ్బాయి బేతా రామచంద్రరావు తండ్రి కళను పుణికిపుచ్చుకున్నాడు. అతడు కూడా ఆంజనేయుడి వేషం వేసేవాడు.

కుందేరు కృష్ణ శర్మ అని విజయవాడలో కనక దుర్గ కళాసమితి గుమస్తాగా వుండే వారు. చాలా నాటకాల్లో వేసేవారు. కృష్ణుడు దగ్గర్నుంచి సహదేవుడి దాకా. ప్రతి నాటకంలోను ఆయన తప్పని సరిగా కనపడే వారు. ఎంతో సహృదయులు. చాలా మంది నటులు అవసాన దశలో కష్టాలు పడుతుంటే చూడలేక వాళ్ళకోసం వో నాటకం పెట్టి ఇంటింటికీ వెళ్లి టికెట్లు అమ్మి డబ్బు పోగు చేసి ఇచ్చేవారు. కర్రి అబ్బులు, ద్వారపూడి సూర్యారావు, కే. హరి ప్రసాద రావు, అయ్యదేవర పురుషోత్తమరావు కూడా కృష్ణుడి వేషం వేసి పేరు తెచ్చుకున్నవారే.

హరిశ్చంద్ర పాత్రకు డి. వి. సుబ్బారావు గారని బందరు వాస్తవ్యులు వుండే వారు. ‘వింధ్యారాణి ఫేం’ అని చెప్పుకొనేవారు. మల్లాది సూర్యనారాయణ గారు కూడా హరిశ్చంద్ర వేసే వారు. తర్వాత వేటపాలెం నుంచి మరో డి. వి. సుబ్బారావు వచ్చారు. హరిశ్చంద్ర వొకటి ఆడేవారు. ఐదో తరగతి కూడా చదివి వుండరు కానీ ఆయన వేసిన టికెట్ డ్రామా అంటే చాలు డబ్బులు బాగా వచ్చేవి. నెల్లూరుకు చెందిన పొన్నాల రామసుబ్బారెడ్డి మరో ప్రసిద్ధి చెందిన నటుడు. హరిశ్చంద్ర పాత్రకు పెట్టింది పేరు. గూడూరి సావిత్రి అనే ఆవిడ ఈయన టీంలో చంద్రమతి గా పేరు పొందారు. మందపాటి రామలింగేశ్వర రావు విశ్వామిత్రుడుగా వేసేవారు.

చిక్కుల్లో ‘చింతామణి'

కాళ్ళకూరు నారాయణ రావు గారు రెండు నాటకాలు రాసారు వొకటి ‘చింతామణి’ రెండోది ‘వర విక్రయం’. ఇవి రాసి ఎనభయి ఏళ్ళు అయిందేమో. ఇంకా వందేళ్ళు పూర్తి కాలేదు. ఆ రోజుల్లో జటిలంగా వుండే రెండు సామాజిక సమస్యలను తీసుకుని ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు వీటిని రాసారు. గురజాడ అప్పారావుగారి కాలంలో ‘కన్యాశుల్కం’ వుంటే కాళ్ళకూరి వారి సమయంలో వరకట్నం సమస్య బాగా ప్రబలివుంది. ‘వర విక్రయం’ ఎందుకో కాని, స్టేజి మీద పాపులర్ కాలేదు. బెజవాడ రేడియోలో నండూరి సుబ్బారావు, శ్రీరంగం గోపాలరత్నం, చిరంజీవిరావు వాళ్ళు వేసారు. చాలా సార్లు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వర విక్రయం నాటకం ప్రసారం చేశారు. సింగరాజు లింగరాజు మరిచిపోలేని లోభి క్యారెక్టర్ వేసేవారు. రెండో నాటకం ‘చింతామణి’ బాగా పాపులర్ అయింది. ‘కురుక్షేత్రం’, ‘రామాంజనేయ యుద్ధం’ వంటి నాటకాలు పోయినా అడపా తడపా ఇంకా ఆడుతున్న నాటకం ‘చింతామణి’.

కథా వస్తువు చిన్నదే. చింతామణి ఓ సంస్కారమున్న వేశ్య. చదువు కొన్నది. విద్యా వంతులంటే వల్లమాలిన అభిమానం. ఆ ఊళ్లోనే భవానీ శంకరుడనే జల్సా రాయుడు వుంటాడు. అతను తనకున్నదంతా చింతామణికి సమర్పించుకొని జులాయిగా తిరుగుతూ ఉంటాడు. చింతామణి అమ్మ శ్రీహరి. వాళ్ళ ఇంటికి వచ్చే విటులందరికి శ్రీహరి అంటే భయం. ఏ రోజు ఎకౌంటు ఆ రోజే తేల్చి వేస్తుంది. మర్నాడు మళ్ళీ డబ్బు దశకం తెస్తేనే ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చేది. కొన్నాళ్ళకు భవాని శంకరుడి దగ్గర మొత్తం సొమ్ము అయిపోవడంతో వెళ్ళగొడుతుంది. ఇతనికో మిత్రుడు వున్నాడు బిల్వమంగళుడు. అందమైన వాడు. విద్యా వంతుడు. ఆస్తి పరుడు. అన్నిటికి మించి మంచి ప్రవర్తన వున్నవాడు. భవానీ శంకరుడు ఓ సారి చింతామణి దగ్గర బిల్వమంగళుడి ప్రసక్తి తీసుకు రావడం, అతన్ని ఎలాగయినా ఓ మాటు ఇంటికి తీసుకురమ్మని ఆమె కోరడం, చింతామణి ప్రాపకం కోసం భవానీ శంకరుడు ఒక రోజు బిల్వ మంగళుడిని చింతామణి ఇంటికి తీసుకురావడం, క్రమేపీ వారిద్దరి మధ్య అనుబంధం ఏర్పడడం, చివరికి చింతామణి పశ్చాత్తాప పడడం ఇలా నాటకం నడుస్తుంది. పెద్ద పాత్రలు ఏమీ లేవు కూడా. చింతామణి, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, చింతామణి తల్లి శ్రీహరి, చెల్లెలు చిత్ర, బిల్వమంగళుడి భార్య రాధ, అతడి స్నేహితుడు దామోదరుడు. ఇంతవరకు బానే వుంది సుబ్బిశెట్టి అనే మరో పాత్ర ఈ నాటకానికి జీవం పోసింది. అదే ఇప్పుడు చింతామణి నాటకాన్ని వివాదాస్పదం చేస్తోంది. చింతామణి మీద మోజుతో వున్నదంతా పోగొట్టుకున్న సుబ్బిశెట్టి చివర్లో తిరగేసిన జల్లెడలో పెసర పునుకులు, మసాలా వడలు పెట్టుకుని బజార్లవెంట తిరుగుతూ అమ్ముకునే దుస్తితికి దిగజారిపోతాడు. భవాని శంకరుడు బ్రాహ్మణుడు కాబట్టి నీళ్ళకావిళ్ళు మోస్తూ ‘తాతలనాటి క్షేత్రములు తెగనమ్మి దోసిళ్ళతో తెచ్చి ధారపోసినాను, అత్తవారిచ్చిన అంటు మామిడితోట నీవు కోరగనే రాసి ఇచ్చినాను’ అంటూ గతాన్ని తలచుకుంటూ పద్యాలు పాడుకుంటూ వుంటాడు. ఇంతవరకు బానే వుంది సుబ్బిశెట్టి అనే పాత్ర ఈ నాటకానికి జీవం పోసింది. అదే ఇప్పుడు చింతామణి నాటకాన్ని వివాదాస్పదం చేస్తోంది. కాళ్ళకూరి వారు రాసిన ఉద్దేశ్యం మంచిదే అయివుండవచ్చు కానీ, కాలక్రమంలో జనాలను ఆకట్టుకోవడం కోసం సుబ్బిశెట్టి, చిత్ర, శ్రీహరి పాత్రల నడుమ మోటు సరసం, ముతక హాస్యం ప్రవేశపెడుతూ వచ్చారు.ఓ దశలో అది సభ్యత హద్దులు దాటిపోయి కుటుంబపరంగా చూడడం సాధ్యం కాకుండా పోయింది. కాళిదాసు కోటేశ్వరరావు అనే ఆయన సుబ్బిశెట్టి వేషం వేసేవారు. సూరవరపు వెంకటేశ్వర్లు శ్రీహరి వేషం కట్టేవారు. నాటకాల తొలి రోజుల్లో ఆడ పాత్రలు నటీమణులు దొరక్క మొగవాళ్ళే ఆడవేషాలు వేయాల్సివచ్చేది. సూరవరపువారు ‘హరిశ్చంద్ర’ లో కాలకౌసికుడి భార్య కలహకంటిగా, ‘సక్కుబాయి’లో అత్తగా పెద్ద పేరు సంపాదించుకొన్నారు. కాళిదాసు, సూరవరపు కాంబినేషన్ ఎప్పుడు హద్దులు దాటలేదు. శ్రీ రామనవమికి బెజవాడ బీసెంటు రోడ్డులో ఏటా ‘చింతామణి’ నాటకం వేసేవారు. ఆ రోడ్డులో నిజానికి ఎక్కువమంది వ్యాపారుల దుకాణాలు ఆర్య వైశ్యులవే. అరవపల్లి సుబ్బారావు అనే ఆయన సుబ్బిశెట్టి వేషం వేసేవారు. కాకపొతే, కారణాలు ఏమయినా ఈ నాటకంలో పోను పోను అశ్లీల సంభాషణలు, సినిమా డైలాగులు, పాటలు పెట్టి నాటకం స్తాయిని దిగజార్చారు. ఇప్పుడు ఆర్య వైశ్య మహా సభ అభ్యంతరం చెప్పిందంటే నిజమే మరి. నాటకాన్ని నిషేధించాలా లేక ఇటువంటి ద్వందార్ధ సంభాషణలు లేకుండా చూస్తామని ఆపేస్తామని నాటక సమాజాలు, నటులు హామీ ఇస్తారా చూడాలి. అంత వరకు కాళ్ళకూరి వారికి క్షమాపణలు చెప్పి ‘చింతామణి’కి కొన్నాళ్ళు రెస్ట్ ఇవ్వడం మంచిదేమో!

నటుల్లో ఘనాపాటి శ్రీ పులిపాటి

పులిపాటి వెంకటేశ్వర్లు అర్జున పాత్ర కోసమే పుట్టాడా! అనిపించేలా అద్భుతంగా నటించే వాడు. 'హరిశ్చంద్ర' లో నక్షత్రకుడు, 'చింతామణి'లో భవాని శంకరుడు వేసే వారు. ఓసారి బెజవాడ రామ్మోహన్ గ్రంధాలయం హాల్లో పీసపాటి కృష్ణుడుగా, పులిపాటి అర్జునుడుగా ‘గయోపాఖ్యానం’ వేసారు.కృష్ణార్జున సంవాదంలో భాగంగా వొకరి నొకరు దెప్పి పొడుచుకొనే పద్యాలు పోటాపోటీగా ఆలపించి అందర్నీ అలరింపచేశారు.

బీవీ రంగారావు బెజవాడ మునిసిపాలిటీలో పని చేస్తూ నాటకాలు వేసేవారు. అర్జున వేషంతో పాటు ‘రాయబారం సీను’లో అశ్వథామ వేసేవారు. ‘అదిగో ద్వారక’ పద్యం ఈయన పాడితేనే వినాలి సుమా అన్నట్టుగా పాడేవారు. 'హరిశ్చంద్ర' కూడా వేసేవారు.బెజవాడ జింఖాన గ్రౌండ్స్ లో చేనేత సప్తాహాలు జరిగేవి. చేనేత వస్త్రాలు ప్రదర్శించేవారు. జనం రావడం కోసం రోజుకో నాటకం వేయించే వారు. ఓసారి రంగారావు 'హరిశ్చంద్ర' పెట్టారు. ప్రేక్షకులకు వెసులుబాటు ఏమిటంటే నాటకం ఆరుగంటలకే మొదలెట్టే వారు. రంగారావుతో పాటు పులిపాటి కూడా వున్నారు. కాటి సీనులో 'మాయా మేయ జగంబు, ఇచ్చోటనే కదా, చతురంభోది పయోధి’ పద్యాలు ఎంతో హృద్యంగా పాడారు. దాదాపు నాలుగైదు వేలమంది అలా నిశ్శబ్దం గా కూర్చొని నాటకం చూసారు.

ఏలూరు దగ్గర కలపర్రు వెంకటేశ్వర్లు - పద్యాలు వినీ వినీ నటుడుగా మారిన కోవలోకి వస్తారు. అర్జునుడు వేసేవారు. 'కురుక్షేత్రం' ఆఖరి సీనులో అభిమన్యుడు చనిపోయినట్లు తెలిసిన తర్వాత అర్జునుడు పాడే పద్యాలు, కృష్ణుడి ఊరడింపుల మధ్య పగ తీర్చుకొంటానని చేసిన ప్రతిజ్ఞలు బాగా పాడేవారు.

అలాగే కొచ్చెర్లకోట సత్యనారాయణ అని చాలా ముందు తరం నటుడు. అర్జునుడు, కృష్ణుడు, రాముడు వేసేవారు. షణ్ముఖితో కలసి ద్వారక సీను రికార్డు ఇచ్చారు.

సంగీత విద్వాన్ అద్దంకి శ్రీరామ మూర్తి గారు ధర్మరాజు వేషానికి ప్రసిద్ధులు. 'కురుక్షేత్రం'తో పాటు 'పాదుకా పట్టాభిషేకం' కూడా ఈయనకి పేరు తెచ్చి పెట్టింది. తొలి తరం సినిమాల్లో కూడా వేశారు. మంగళంపల్లి బాల మురళీకృష్ణకి ముందు పారుపల్లి రామకృష్ణయ్య గారి దగ్గర సంగీతం నేర్చుకొన్నారు. గాంధీ నగరం సెంటర్ లో ‘యెర్నేని మాన్షన్’ పక్క బిల్డింగ్ వీరిదే. గేటు దగ్గర ‘సంగీత విద్వాన్ అద్దంకి శ్రీ రామమూర్తి’ అనే బోర్డు వుండేది. వేమూరి విమలాదేవికి అమ్మేసారు.

పి. సూరిబాబు, రాజేశ్వరి రంగస్థల నటులలో భార్యాభర్తలు. సూరిబాబు కంఠం అదోరకంగా వుంటుంది. కంచు కంఠం అనేవారు. చాలా సినిమాల్లో వేషాలు వేసారు. ఎక్కువగా నారదుడిగా. స్టేజి మీద ఆయన ధర్మరాజు వేసేవారు. పాచికలు ఆడే సీనులో తమ్ములను, ద్రౌపదిని వొక్కొక్కరినీ పణంగా పెట్టి వోడిపోతున్న ఘట్టంలో పద్యాలు గొప్పగా ఉండేవి. రాజేశ్వరితో కలసి ‘తారాశశాంకం’ ఆడేవారు.బెజవాడలో శరభయ్య గుళ్ళకు ఎదురుగా రైలు పట్టాలకు ఆవతలి వయిపు ‘రాజేశ్వరి మేడ’ వుండేది. కందుకూరి చిరంజీవి రావు మరో ధర్మరాజు. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్ గా వుండేవారు. పద్యంతో పాటు నటనకు ప్రాధాన్యం ఇచ్చేవారు.

షణ్ముఖి ఆంజనేయ రాజు అని తణుకులో వుండేవారు. ‘జీళ్ళపాకం సంగీతం’ అని కొందరు విమర్శించినా ఆయన పద్యం వినడం కోసం వేలాదిమంది తహతహలాడేవారు. గరికిపాటి నరసింహరావు గారు ఈ మధ్య ‘భక్తి ఛానల్’లో ‘భారతం’ ఫై ప్రసంగిస్తూ, షణ్ముఖికి గొప్పగా నివాళులర్పించారు. ‘ఆయన నాటకాలు చూడడానికి తాడేపల్లి గూడెం నుంచి సైకిళ్ళు వేసుకొని భీమవరం వెళ్లడం బాగా గుర్తు. రాయబారం సీనులో ఆంజనేయరాజు పాడే ఆ నాలుగు పద్యాల కోసం వెళ్లి ఒన్స్ మోర్ లు కొడుతూ మళ్ళీ మళ్ళీ పాడించుకొనేవాళ్లమ’ని ఆయన గుర్తు చేసుకున్నారు.

పాటా పద్యం కలబోస్తే ఈలపాట రఘురామయ్య

ఈల పాట రఘురామయ్య గారు సినిమాల్లో కృష్ణుడుగా, నారదుదుగా పేరుతెచ్చుకున్న నటుడు. కురుక్షేత్రంలో మొదటి కృష్ణుడుగా వేసేవారు. 'బావా ఎప్పుడు వచ్చితీవు’ ‘ఎక్కడ నుండి రాక’ అనే పద్యాలు చాలా బాగా పాడే వారు. పాండవుల సందేశం తీసుకొనే సీన్ లో ' అయినను పోయి రావలయు హస్తినకు' అన్న పద్యాన్ని పాపులర్ చేసింది రఘురామయ్య గారే. నాటకంలో ఆయన పోర్షన్ అయిపోయిన తర్వాత స్టేజి మీదకు వచ్చి పది పదిహేను నిమిషాల సేపు ఈల పాట వినిపించేవారు, కుడిచేయి మధ్య వేలు నోట్లో పెట్టుకొని. ఇప్పుడు శివ ప్రసాద్ ఈల పాట కచ్చేరీలు చెయ్యడానికి ప్రేరణ బహుశః ఇదే కావచ్చు. వేమూరు గగ్గయ్య గారి కుమారుడు రామయ్య కూడా చాలా రోజులు కృష్ణ వేషం వేసేవారు. రామయ్య మొదటి కృష్ణుడుగా, అబ్బూరి రెండో కృష్ణుడుగా, పృథ్వీ వెంకటేశ్వరరావు మూడో కృష్ణుడుగా చాలాకాలం ఆడేవారు. అబ్బూరి ‘ఆంధ్రా ఆర్టిస్ట్ అసోసియేషన్’ పేరిట సొంత సమాజం నడిపారు. తర్వాత కర్ణుడి పాత్ర మీద శ్రద్ధ చూపి కర్ణుడిగా పేరు పొందారు. ‘కర్ణ సందేశం’ లో పీసపాటి కృష్ణుడు, రామయ్య కర్ణుడు వేషాలు వేసి చాలామందిని మెప్పించారు.

ఏ.వీ. సుబ్బారావు తెనాలికి చెందిన నటుడు. కుప్పా సూరి, కుప్పా గాంధీ అని ఇద్దరు సోదరులు వుండే వారు. సూరిగారు హరిశ్చంద్ర వేసేవారుట. సుబ్బారావు గారు తెనాలి నుంచి ప్రస్తానం ప్రారంభించి టాప్ నటుడుగా పేరు పొందారు. ‘సుబ్బారావు గారి చేత మొదట వేషం కట్టించింది నేనే’ అని గాంధి వో సారి చెప్పారు. ఈ గాంధీ తర్వాత నాటకాలు మానేసి బెజవాడ బావాజీ మఠంలో గుమస్తాగా చేరాడు. కెనాల్ రోడ్డులో ఈ మఠానికి చాలా ఆస్తులు ఉండేవి . సత్యనారాయణ పురం దగ్గర బావాజీ పేట అనే పేట వుండేది. అక్కడ వుండే ఇళ్ళ నుంచి రెండు మూడు రూపాయిలు అద్దెగా వసూలు చేసే వాడు. తర్వాత అక్కడ ఇళ్లు కట్టుకున్న వాళ్లకు ఆ స్థలాలు అమ్మేసారు. బావాజీ మఠం ఆస్తులన్నీ పోయాయి, గవర్నమెంట్ నిర్వాకం వల్ల.

మరో ఘనాపాటి పీసపాటి

కురుక్షేత్రం లో శ్రీ కృష్ణ పాత్రధారి అనగానే అందరికి గుర్తు వచ్చే పేరు పీసపాటి నరసింహ మూర్తి గారు.

విజయనగరం దగ్గర ‘రాముడు వలస’ అనే చిన్న వూళ్ళో వుండేవారు. ఎక్కడకి వెళ్ళాలన్న అక్కడ నుంచే. సాంప్రదాయ మైన బ్రాహ్మణ కుటుంబం కావడంతో సంస్కృతం, తెలుగు భాషల్లో మంచి పట్టు వుండేది.ఆజాన బాహుడు. అవసరమైన వరకే సంగీతం పద్యంలో చొప్పించి పాడే వారు. ఎంత గొప్పగా ఉండేదో.

ఆయన నాటకం చూడలేకపోతే జీవితంలో వో మంచి అవకాశం పోగొట్టుకున్నట్టే. రెండేళ్ళు అయిందేమో ఆయన పోయి. తెలుగు వారంతా బ్రహ్మరథం పట్టడంతో పాటు నటుడిగా ఆయనకు రావల్సిన గౌరవాలన్నీ దక్కాయి వొక్క పద్మ అవార్డు మినహా.

ఆంధ్ర విశ్వ విద్యాలయం కళా ప్రపూర్ణ, కేంద్ర సంగీత నాటక అకాడెమి ఫెలో షిప్, తెలుగు విశ్వ విద్యాలయం విశిష్ట పురస్కారం, రాజా లక్ష్మి ఫౌండేషన్ అవార్డు వగైరా. వోసారి తిరుపతి వెంకట కవుల సమక్షంలో ‘ఉద్యోగ విజయాలు’ పోటీలు జరిగాయి. అందులో కృష్ణ పాత్రధారి పీసపాటి బంగారు కీరీటం బహుమతిగా పొందారు. 'మామా సత్యవతీ పౌత్రా! ధాత్ర రాష్ట్రులకు పాండవులకు సంధి చేసి ఈ రాజలోకమ్మును కాపాడుమని యాచించుటకయి పాండవదూతగా నీ వద్దకు వచ్చితి’ అంటూ ఆయన రాయబారం సీన్ లో ప్రవేశించడం వో మధురాతి మధురమైన జ్ఞాపకం. ‘పతితులు కారు నీయెడల భక్తులు, శుంఠలు కారు విద్యలన్ చతురులు’ అని పాండవుల గొప్పతనం గురించి కౌరవుల సభలోచెప్పడం కూడా ఎంతో రమ్యంగా వుండేది. ‘ఒన్స్ మోర్’ లు పట్టించుకునే వారు కాదు. ఇక తప్పని సరి అయితే సంభాషణలు మార్చి కొత్తదనంతో అదే పద్యాన్ని కొద్దిగా మార్చి పాడేవారు. ప్రేక్షకులంతా హర్ష ధ్వానాలు చేసేవారు.

ప్రేక్షకులను పద్యాలతో ఊరించిన అబ్బూరి

పాతికేళ్ళ పాటు తెలుగు నాటక రంగాన్ని ఏలిన మరో వ్యక్తి అబ్బూరి వరప్రసాద రావు గారు. పద్యాన్ని రాగ యుక్తంగా పాడడం ఈయనతో ఒక మోడల్ గా మారిందని చెప్పొచ్చు. ఆయన చనిపోయినప్పుడు ‘ఆంధ్ర జ్యోతి’ తెలుగు దిన పత్రిక సంపాదకీయం రాసిందంటే ఆయన ఎంత గొప్పవాడో అర్థ మవుతుంది. ఒకేరోజు రోజు మూడు చోట్ల వేషాలు వేసేవాడు. బెజవాడలో ద్వారక సీను, మంగళగిరిలో రాయబారం, పెద కాకానిలో మూడో కృష్ణుడు ఇలా వుండేది ఆయన బిజీ షెడ్యూలు. ‘చెల్లియో చెల్లకో, అలుగుటయే యెరుంగని, జెండాఫై కపిరాజు, సంతోషమ్మున సంధి సేయవో’ అనే ఆయన పద్యాలు గ్రామ ఫోన్ రికార్డులు గా వచ్చాయి. పదిహేను రోజులకోసారి రేడియోలో మధ్యాహ్నం ‘కార్మికుల కార్యక్రమం’ లోనో, సాయంత్రం ‘గ్రామ సీమల కార్యక్రమం’ లోనో ఈ రికార్డు వేసేవారు. అప్పట్లో అందరి ఇళ్ళల్లో రేడియోలు వుండేవి కావు. వినాలనుకున్నవాళ్లు రాఘవయ్య పార్కుకు వెళ్లి వినేవాళ్ళు. లేదా ‘మాతా కేఫ్ హోటల్’ రేడియోలోనో వినేవాళ్లు.

యెంత పేరొచ్చినా, జనం నీరాజనాలు పట్టినా నాటకాల్లో వేసేవారు ఎలా చెడిపోతారో అనడానికి ‘అబ్బూరి వారి జీవితం ఓ ఉదాహరణ’. మద్యానికి బానిస కావడంవల్ల ఆరోగ్యం చెడింది. మదనపల్లి శానిటోరియంలో ‘టీబీ’కి వైద్యం చేయించుకున్నా కొన్నాళ్ళకు అది మళ్ళీ తిరగ బెట్టింది. ఎలా సంపాదించాడో అల్లాగే పోయింది ఆయన డబ్బంతా.

మిక్కిలినేని ‘నటరత్నాలు’

నాటక చరిత్ర అంతా తెలుసుకోవడం అంత సులభం ఏమీ కాదు. అలాగే తెలుగు రంగస్థల నటుల గురించి కూడా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు ‘నట రత్నాలు’ అని ఆంధ్ర ప్రభ వీక్లీ లో ఓ శీర్షిక నడిపే వారు. ఆరోజుల్లో అందరూ వాటిని ఆసక్తిగా చదివేవాళ్ళు.

పామర జనాల నాలుకలపై నర్తించిన పాండవోద్యోగ విజయాలు

అప్పటికి ఇప్పటికి పౌరాణిక నాటకం అంటే తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలే. వాస్తవానికి ఆయన ఈ రెండూ విడివిడిగా రాశారు, పాండవోద్యోగం, పాండవ విజయం అని. ఈ రెండు కలిపి, మరికొన్ని నాటకాలలోని పద్యాలు జోడించి ‘కురుక్షేత్రం’గా ప్రచారంలోకి తీసుకు వచ్చారు. ఎన్ని వేలసార్లో, వేలేమిటి లక్షసార్లు అని కూడా చెప్పొచ్చు ఈ నాటకాన్ని తెలుగునాట నాలుగు చెరగులా వేసి వుంటారు. కొన్ని వేలమందికి ఈనాటకం ఉపాధి కల్పించింది. పేరు తెచ్చి పెట్టింది. ఒకనాడు తెలుగు నేలపై ఒకపక్క తమ పనిపాటులు చేసుకుంటూనే ఈ నాటకంలోని చెలియో చెల్లకో మొదలయిన పద్యాలు రాగయుక్తంగా పాడుకోని పల్లె వాసులు అరుదు.

బలిజేపల్లి వారి ‘హరిశ్చంద్ర’, చిలకమర్తి వారి ‘గయోపాఖ్యనం’ కూడా ప్రసిద్ధి పొందినవే.

తర్వాత వచ్చినవి కాళ్ళకూరి నారాయణ రావు గారి ‘చింతామణి’, తాండ్ర సుబ్రహ్మణ్యం గారి ‘రామాంజనేయ యుద్ధం’. అడపా తడపా వల్లూరి వెంకట్రామయ్య చౌదరి గారి ‘బాల నాగమ్మ’. మిగతావన్నీ చెదురుమదురగా ఆడేవి, ‘పాదుక పట్టాభిషేకం’ వంటివన్న మాట.

పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద’

ఆరోజుల్లో నాటకం ఆడడానికి స్టేజి కూడా పెద్ద ప్రాముఖ్యం లేనిదే. కావాల్సిందల్లా మంచి మైకు సెట్టు. మైకు బాగా లేకపోతే జనం గోల చేసేవారు. లైటింగ్ కూడా పట్టించుకునేవారుకాదు. వెనక వైపు ఓ తెరా, ముందు మరో తెరా వుంటే చాలు నాటకం వేయడానికి. ముందు తెరను కప్పీ మీద లాగడానికి వీలుగా కట్టేవారు. చూసిన ఏ నాటకాలలోను అది సరిగా పని చెయ్యగా చూడలేదు. దాంతో నాటకం ట్రూపులో ఒకడు స్టేజి ఎక్కి ఈ మూల నుంచి ఆ మూలకు చేత్తోనే తెరను లాగేవాడు. నాటకం మొదలు పెట్టడానికి కొద్ది నిమిషాల ముందు హార్మొనీ వాయించే ఆయన వచ్చేవాడు. తొక్కుడు హార్మొనీ. పెట్టెలోంచి పీకి లేపి క్లిప్పులు పెడితే వాయించడానికి వీలుగా తయారయ్యేది. ఆయన కూర్చోడానికి ఓ మడత కుర్చీ. ఇక నాటకం ఏదయినా, ఎవరు వేసినా ‘పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద’ అనే ప్రార్ధనతో మొదలు పెట్టేవారు. ఇది రాసిన మహాను భావుడెవడో ఎవరికీ తెలియదు. ఎంతో మందిని అడిగినా లాభంలేక పోయింది. ఆ మధ్యన ఓ అష్టావధానం లో కూడా ఈ ప్రశ్నవేసారు. సమాధానం ఏమి వచ్చిందో గుర్తు లేదు. ఎవరికయినా తెలిస్తే తెలిస్తే చెప్పండి. రెండు మూడు నిమిషాల ప్రార్ధన తర్వాత, ‘శ్రీకృష్ణ పరమాత్మకీ జై!’ అంటూ నాటకం ఆడేవాళ్ళ సమాజం పేరు చెప్పుకుని దానికి కూడా జై కొట్టే వారు. ప్రార్ధన సమయానికి కొందరు వేషాలు పూర్తి గా వేసుకుని, మరికొందరు సగం వేషాలతోనో, లేదా లుంగీ పంచెలతోనొ పాడేవారు. ఇంత ముద్ద హారతి కర్పూరం వెలిగించి. పాడడం అవగానే ఓ కొబ్బరికాయ స్టేజి మీద గట్టిగా కొట్టేవారు. అప్పడప్పుడు సగం చిప్ప యెగిరి వెళ్లి జనంలో పడేది. ఈ తెరవెనక భాగోతం అంతా మసగ మసగ్గా బయట ప్రేక్షకులకు కనపడుతూనే వుండేది. బెజవాడ ఏలూరు రోడ్ సెంటర్లో ‘రామకృష్ణ మైక్ సర్వీసు’ అని వుండేది. ఆయన దగ్గర మంచి మైకులు ఉండేవి. వాటిని ష్యూర్ మైకులు అనేవాళ్ళు. బాగా లాగుతాయని చెప్పుకునేవాళ్ళు. అంటే ఎంతో దూరం వరకు వినబడతాయన్న మాట, ఇబ్బంది పెట్టకుండా. కరపత్రాల్లో కూడా వేసుకొనే వారు, పలానా వారిదే మైక్ సెట్ల సప్లయి అని.

బెజవాడలో ఇప్పటి నవరంగ్ థియేటర్ని 1960 – 1970 మధ్య షహెన్ షా మహల్ అనే వారు. యాజమాన్యంలో ఏవో గొడవలవల్ల అప్పట్లో థియేటర్ ని మూసేశారు. దానిని నాటకాలకు వుపయోగించుకునేవారు. అలాగే గాంధీ నగర్ లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం హాలు. అప్పడప్పుడు రామ్మోహన్ గ్రంథాలయం పైన వున్నచిన్న హాలు. నాటకాలన్నీ శనివారం నాడే వేసేవారు. తెల్లవార్లు నడుస్తుంది కనుక మర్నాడు ఆదివారం పడుకోవచ్చని కాబోలు.

(మితృలు శ్రీ ఆర్వీవీ కృష్ణారావు గారు ఇచ్చిన సమాచారం లేకపోతే ఈ వ్యాసరచన సాధ్యం అయ్యేది కాదు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు)

 

కామెంట్‌లు లేవు: