28, మార్చి 2021, ఆదివారం

పాదనమస్కారాలు, ఎన్టీఆర్

 ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకమునుపే జగత్ ప్రసిద్ధ తెలుగు సినీ నటుడు. మద్రాసులోని ఆయన ఇంటి ముందు ప్రతి ఉదయం రెండు మూడు టూరిస్టు బస్సులు నిలిపివుండేవి. ఆయన అలా బయటకు వచ్చి మేడమీది వరండాలో నిలబడగానే అప్పటి వరకు ఆయనకోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆనందానికి అలవి వుండేది కాదు. అదృష్టవశాత్తు దర్శన భాగ్యం లభించిన వాళ్ళు ఆయన కాళ్ళకు సాష్టాంగనమస్కారం చేసేవాళ్ళు. ఆయనకు ఓ అలవాటు ఉండేదని చెప్పుకునేవారు, కాళ్ళమీద మీద పడిన వాళ్ళు తమంతట తాము లేవాలే కానీ ఆయన లెమ్మని చెప్పేవాళ్ళు కాదని. పైగా కాళ్ళ మీద పడుతున్నవారిని వారించేవారు కాదు.

తెలుగు దేశం పార్టీ పెట్టి, తొలి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి, అఖండ విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఈ పాద నమస్కారాల ప్రహసనం కొనసాగింది. తెలుగు దేశం పార్టీలో మహిళా నాయకురాళ్ళు నన్నపనేని రాజకుమారి, త్రిపురాన వెంకట రత్నం, గంగాభవాని మొదలయిన వాళ్ళు పదిమంది చూస్తున్నారని కూడా చూడకుండా బహిరంగంగానే ఆయనకు పాద నమస్కారాలు చేసేవాళ్ళు. ఇది ఎంతవరకు ముదిరింది అంటే బేగం పేట విమానాశ్రయంలో ఎన్టీఆర్ విమానం దిగివస్తున్నప్పుడు టార్ మాక్ మీదనే వాళ్ళు పోటీలు పడి ఆయన కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుని మరీ పాద నమస్కారాలు చేయడం ఆ రోజుల్లో ఒక సంచలన వార్తగా మారింది. అది ఇది ఇంతింతై, అంతింతై దేశం నలుమూలలకు పాకింది.

ఢిల్లీ నుంచి ఇల్లస్ట్రెటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా విలేకరి ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేయడానికి హైదరాబాదు వచ్చారు. ఆయనకి తెల్లవారుఝామున నాలుగు గంటలకు టైం ఇచ్చారు. కొద్ది ముందుగానే ఆ విలేకరి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. సరిగ్గా ఇచ్చిన టైముకల్లా, కిర్రు చెప్పులు చప్పుడు చేస్తుండగా ఎన్టీఆర్ కిందికి దిగివచ్చారు. ఢిల్లీ విలేకరి కుర్చీ నుంచి లేచి ఎన్టీఆర్ పాదాలకు సాష్టాంగనమస్కారం చేసారు. చేసిన మనిషి లేవకుండా అలాగే కాసేపు వుండిపోయారు. కొద్ది సేపటి తర్వాత లేచి కూర్చునినేను విన్నది నిజమే!’ అని అంటూ ఇంటర్వ్యూ ప్రారంభించారు.

ప్రశ్నోత్తరాల కార్యక్రమం యధావిధిగా కొనసాగింది. అది వేరే సంగతి.

కొసమెరుపు ఏమిటంటే తరువాత చాలా రోజులకు ఆ పత్రిక ప్రచురించిన కధనం, ఈ పాద నమస్కారం ప్రహసనంతోనే మొదలవుతుంది.

 

కామెంట్‌లు లేవు: