పదాలను ఎలా పలకాలి? Suneel Satti లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పదాలను ఎలా పలకాలి? Suneel Satti లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, మార్చి 2021, శనివారం

పదాలను ఎలా పలకాలి? – భండారు శ్రీనివాసరావు

 ఎలా పలికినా పర్వాలేదు అనుకునే టీవీ యాంఖర్లకు, ఎలా రాసినా ఏమీ కాదు అనుకునే పత్రికారచయితలకు ఏమాత్రం కొరత లేని ఈ రోజుల్లో Suneel Satti ఒక పెద్దమనిషి వ్యక్తుల, ప్రాంతాల పేర్లను ఎలా ఉచ్చరించాలి అని ఫేస్ బుక్ లో అనునిత్యం ప్రయత్నం చేస్తూనే వున్నారు కానీ అది అరణ్య రోదనేమో అనిపిస్తోంది. (ఫేస్ బుక్ లో ఎప్పుడు పోస్టింగ్ పెట్టినా ఆయన పేరు ఇంగ్లీష్ లోనే వుంటుంది. దాంతో ఆయన ఇంటి పేరును (SATTI ని ఎలా రాయాలో తెలియక అంటే, ‘సత్తి’ అనాలా, సట్టి’ అనాలా అనే అయోమయంలో పడి) అలాగే యధాతధంగా ఇంగ్లీష్ లోనే రాశాను. ఎందుకంటే సునీల్ గారు ఉచ్చారణను, స్పెల్లింగులను చాలా సీరియస్ గా తీసుకుంటారు. అనేక పత్రికల్లో అనుదినం వచ్చే వార్తలలోని విదేశీ, స్వదేశీ వ్యక్తుల పేర్లను పత్రికల వాళ్ళు తెలిసీ తెలియక ఎలా భ్రస్టు పట్టిస్తున్నదీ సోదాహరణంగా వివరించడానికి, పాఠకులకు అవగాహన కలిగించడానికి సునీల్ గారు తీసుకుంటున్న శ్రమదమాదులు అభినందనీయం. అందుకే ఆయన అంటే నాకు అమిత గౌరవం.

వారు ఇస్తున్న కొన్ని ఉదాహరణలను చూస్తుంటే మనం ఇన్నాళ్ళ బట్టి ఇంత అజ్ఞానంతో పదాలను పలుకుతున్నామా, రాస్తున్నామా అనే భావన కలగడం తధ్యం.

ఆలిండియా రేడియోలో జాతీయ, అంతర్జాతీయ వార్తలు చదివే వారికి ఇటువంటి విషయాల్లో చక్కని అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక విభాగమే వుంది. ఎందుకంటే మన దేశాన్ని సందర్శించే విదేశీ ప్రముఖుల పేర్లను తప్పుగా ఉచ్చరించడం సరైన పద్దతి కాదు.

సునీల్ గారు రాస్తున్న విషయాలను పత్రికల వాళ్ళు, మీడియా వాళ్ళు గమనంలో ఉంచుకోగలిగితే బాగుంటుంది.

తోక టపా:

(ఉచ్చారణలో ‘చ్చా’ కు వత్తు పెట్టి  మహబాగా ఉచ్చరించాం అనుకునేవారు కూడా వున్నారు. నిజానికి ఆ పదంలో ‘వత్తు’ లేదు. వత్తి వత్తి పలకక్కర లేదు, రాయక్కర లేదు)