18, ఆగస్టు 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో: (355) : భండారు శ్రీనివాసరావు

 మాట్లాడను, రాస్తాను

ఎందుకంటే నాకు మాట్లాడడం, ప్రసంగాలు చేయడం ఆట్టే చేత కాదు. అయితే నలుగుర్నీ పోగేసుకొని పోచుకోలు కబుర్లు చెప్పడం చిన్నతనం నుంచీ అలవాటు. ఇవి చూసి నేనేదో పొడిచేసే వక్తను అని అనుకునేవారు.   

మొన్నీ మధ్యనే మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి రెండో కుమారుడు సుభాష్ చంద్ర బోస్ కు  సాదాసీదాగా జరిగిన రిటైర్ మెంట్ ముచ్చట్లు రాశాను. మా అన్నయ్యకు నలుగురు కుమారులు. ఆడపిల్లలు లేరు. మొదటి వాడు జవహర్ లాల్. రెండో వాడు సుభాష్ చంద్ర బోస్, మూడోవాడు, లాల్ బహదూర్, నాలుగో వాడు రాజేంద్ర ప్రసాద్. అరవై ఏళ్ళ కిందట జాతీయ నాయకుల పేర్లు పిల్లలకు పెట్టుకోవడం సాధారణ విషయం.

 

సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యే రోజున ఒక సాంప్రదాయం పాటిస్తారు. హోదాతో నిమితం లేకుండా ఇంటికి కారు పంపించి, కుటుంబ సభ్యులను రప్పించి ఆఫీసులో వీడ్కోలు కార్యక్రమం తరువాత మళ్ళీ ఇంటికి ఆఫీసు కారులోనే సాగనంపుతారు. ఇది షరా మామూలుగా జరిగే విషయమే. విశేషం ఏమీ లేదు.

కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖలో, ప్రస్తుతం అత్యంత కీలకంగా మారిన GST విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న మా   సుభాష్, తన రిటైర్ మెంటు కొత్త పద్దతిలో ప్లాన్ చేశాడు. ఎప్పుడో 34 ఏళ్ళ క్రితం కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు మా అన్నయ్య వాడికి ఒక బైక్ కొనిపెట్టాడు. ఏళ్ళు గడుస్తున్నా, ఉద్యోగంలో హోదాలు పెరుగుతున్నా ఆ బైక్ ను పదిలంగా చూసుకుంటూ వచ్చాడు. ఏ బైక్ మీద మొదటి సారి ఆఫీసుకు వెళ్ళాడో, వాళ్ళ నాన్న ప్రేమగా కొనిచ్చిన అదే బైక్ పై రిటైర్ అయిన తర్వాత ఆఫీసు నుంచి భార్య హేమను వెనుక కూర్చోబెట్టుకుని ఇంటికి చేరాడు.

 

సుభాష్ పెద్ద కుమార్తె శిఖిర, అల్లుడు కౌండిన్య అమెరికాలో వుంటారు. మా అన్నయ్య మూడో కుమారుడు లాల్ బహదూర్ పెద్ద అమ్మాయి స్పురితకు, ఈ నెలలో జరగబోయే వివాహం నిమిత్తం హైదరాబాదు వచ్చారు. వచ్చినప్పటి నుంచి వాళ్లది, సుభాష్ రెండో కుమార్తె శిశిరదీ ఒకటే ఆలోచన. ఒక మచ్చ పడకుండా ఇన్నేళ్ళు సర్వీసు చేసిన సుభాష్ ఉద్యోగ విరమణ ఫంక్షన్ తమ చేతుల మీదుగా చేయాలని సంకల్పించారు. తండ్రికి తెలిస్తే ఒప్పుకోడని  సర్పైజ్ ఇవ్వాలని ఆలోచించారు. హైదరాబాద్ లో అందుబాటులో వున్న దగ్గరి చుట్టపక్కాలకు, సుభాష్ కు అత్యంత ఆత్మీయులైన స్నేహితులకు రహస్యంగా కబురు చేశారు. పలానా రోజున పలానా హోటల్ కు రమ్మని చెప్పారు. డిపార్ట్ మెంటులో ఉన్నతాధి కారి ఒకరు కలవాలని అనుకుంటున్నారని ఒక సహోద్యోగితో చెప్పించారు. అలాగే ఆ స్నేహితుడు వెళ్లి సుభాష్ ని  వెంటబెట్టుకుని వచ్చాడు.

అప్పటికే అక్కడ నలభయ్ యాభయ్ మందిమి ఉన్నాము. మొబైల్ లో సుభాష్ కదలికలను గమనిస్తూ, వాడు తలుపు తెరుచుకుని హాల్లోకి రాగానే అందరం ఒక్క పెట్టున సర్ప్రైజ్ అని గట్టిగా కేకలు పెట్టడంతో సుభాష్ మమ్మల్ని అందర్నీ చూసి తెల్లపోయాడు.   

మా అన్నయ్య రామచంద్ర రావు గారు బ్యాంకు ఉద్యోగంలో నానా  దేశ యాత్రలు చేస్తున్నప్పుడు ఆయన పిల్లల చదువులు కూడా అనేక చోట్ల సాగాయి. నలుగురు పిల్లల్లో సుభాష్ కు మిత్ర  బృందం ఎక్కువ. పిఠాపురం. హైదరాబాదు, తిరుపతి, శ్రీకాకుళం,బొంబాయి, (ఇప్పుడు ముంబై), న్యూయార్క్ ఇలా పలుచోట్ల పరిచయం అయిన మితృలు ఇప్పటికీ వాడి మిత్ర బృందంలో వున్నారు. ఎప్పుడో ఒకప్పుడు కలుస్తూనే వుంటారు. పరస్పర యోగక్షేమాలు తెలుసుకుంటూ వుంటారు. వాడికి స్నేహితుడు కావడానికి క్లాస్ మేట్ కానక్కర లేదు. పరిచయం అయిన ప్రతి వాడు స్నేహితుడే.

ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు రైల్వేలో జనగామలో పని చేశాడు. కొన్నాళ్ళు వైజాగ్ లో, చాలా కాలం హైదరాబాదులో  కష్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ వివిధ హోదాల్లో పనిచేసి కిందటి నెల జులై ముప్పయి ఒకటిన పదవీ విరమణ చేశాడు. అన్ని చోట్లా స్నేహితులు, స్నేహితులు. కుటుంబానికి స్నేహితులకు నడుమ సన్నటి విభజన రేఖ తానే గీసుకున్నాడు, ఉభయతారకంగా.

తన వీడ్కోలు కనుక సుభాష్ ఉచితరీతిన సమాధానం చెప్పాడు ఎక్కువగా హాస్యం పాలు ఒలికిస్తూ. మా అమ్మగారి పేరుమీద ఓపెన్ చేసిన అమ్మమ్మ సంతానం గ్రూపులో  ప్రతిఒక్కరినీ, అలాగే అత్తగారి తరపున కూడా వారిది పెద్ద కుటుంబం కనుక పేరు పేరునా గుర్తు చేసుకుంటూ, తాను ఏదైనా మంచి చేశాను అని అందరూ భావిస్తూ మాట్లాడారు కనుక కాదని వారి మనస్సు నొప్పించడం భావ్యం కాదని, అంచేత వినమ్రంగా స్వీకరిస్తూ ఒక మాట చెప్పాడు.

అమ్మమ్మ సంతానంలో ఒకడిగా పుట్టడం వల్లనే ఆ మాత్రం మంచితనం అయినా తనకు ఒంటపట్టిందని అన్నాడు. ‘మళ్ళీ పుడితే మాత్రం  మా అమ్మా నాన్నల కడుపునే రెండో సంతానంగా, ఇదే అన్నయ్యలు, ఇదే తమ్ముళ్లు, మేనత్తలు, ఇదే పెద్దనాన్న, ఇదే పిన్నులు బాబాయిలు, ఇదే అత్తామామలు, ఇదే భార్యా పిల్లలు , ఇదే అల్లుడు కౌండిన్య  తోడల్లుళ్ళు, ఇదే మరదళ్లు. స్నేహితులు   ఇలా సందడిగా, ఆపేక్షలకు మారు పేరుగా వున్న కుటుంబంలో మళ్ళీ జన్మించాలన్నదే నా కోరిక. నేను సదా త్రికరణ శుద్ధిగా నమ్మే ఆ తిరుపతి వెంకన్నను  అనుదినం కోరే కోరిక ఇదొక్కటే’        

సుభాష్ ఉద్యోగపర్వంలో అనేక ఊళ్లు తిరుగుతూ హైదరాబాదు వచ్చినప్పటి మా ఇద్దరు పిల్లలు దూరంగా వున్నారనే బెంగ మాకు తీరిపోయింది. మాకిద్దరు మగ పిల్లలు. కానీ నా పెద్ద పిల్లాడు సుభాషే అనేది మా ఆవిడ ఎప్పుడూ.

మా పెద్దవాడు చదువుల కోసం నాగపూరులో ఉండేవాడు. సంతోష్ అప్పటికి చిన్నవాడు. మా రెండో అన్నయ్య కుమారుడు సుభాష్ హమేషా మా ఇద్దర్నీ కనిపెట్టుకుని ఉండేవాడు. వాడికి పెళ్ళయిన తర్వాత కూడా మా రెండు కుటుంబాలు ఒకే ఇంట్లో పైనా కిందా వుండే వాళ్ళం. మాకే కాదు మొత్తం మా కుటుంబంలో అందరికీ మా సుభాష్ 108. అవసరం పడిందంటే చాలు వాలిపోయేవాడు.

మేము మాస్కో వెళ్ళే వరకు మా అవసరాలు అన్నీ వాడే కనిపెట్టి చూసేవాడు. ఒకసారి అరడజను ప్లాస్టిక్ కుర్చీలు తన జీతంనుంచి కొనుక్కుని తెచ్చాడు. ‘బాబాయి ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. కనీసం మంచి కుర్చీలు లేకపొతే  ఎల్లా అనేది వాడి సంజాయిషీ. మరీ చిన్నపుచ్చకూడదని వాడు మాకు చేసిన పెద్ద సాయాలు రాయడం లేదు. ఆ జాబితా చాలా పెద్దది.

మా సుభాష్, హేమల పెళ్లి రోజు, మా ఆవిడ పుట్టిన రోజూ ఒకే రోజు కావడంతో వాళ్లకు పెళ్ళయిన నాటి నుంచీ కలిసే వేడుక జరుపుకుంటూ రావడం ఆనవాయితీ. మా ఆవిడ చనిపోయిన మరుసటి ఏడాది వాళ్ళూ పెళ్లి రోజు జరుపుకోలేదు.

 అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా సమయానికి సహాయ హస్తం అందించేవాడు. ఈ విషయంలో వాడికి స్వపర బేధం లేదు. కబురు తెలియగానే 108 అంబులెన్స్ మాదిరిగా వాలిపోయేవాడు.           

   

 

లేచి స్నానం చేయండి, గుడికి పోయొద్దాం” అనేది మా ఆవిడ.  

అప్పుడు కానీ నాకు లైటు వెలగదు, ఆ రోజు (ఫిబ్రవరి తొమ్మిది) తన పుట్టినరోజని. అసలు గుర్తుండదు. ఇలాంటి పుట్టిన రోజులు నలభయ్ ఎనిమిది (మా పెళ్లయినప్పటినుంచి) నాతో కలిసి జరుపుకుంది. ఆ రోజున సుభాష్ హేమ దంపతులకు ఫోన్ చేసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు  చెప్పిన తర్వాతే నిద్ర పోయేది. కానీ తన పుట్టినరోజు నేను మరిచిపోయిన  సంగతి ఏనాడూ నన్ను నోరెత్తి అడగలేదు. అదే నా పుట్టిన రోజయితే మాత్రం అంతకు ముందు రాత్రి పన్నెండు గంటల వరకు మేలుకుని వుండి, నాకు షేక్ హాండ్ ఇచ్చి, మెత్తగా చేయి నిమిరి  బర్త్ డే విషెస్ చెప్పి పడుకునేది. నేనో సీతయ్యను. ఇలాంటి సెంటిమెంట్లకు కడుదూరం.

పిన్ని అంటే సుభాష్ కు ఆరోప్రాణం. సుభాష్ అంటే మా ఆవిడకు పంచప్రాణాలు. అందుకే వాడి రిటైర్ మెంట్ ఫంక్షన్ లో నన్ను మాట్లాడమంటే, గొంతు పూడుకు పోయింది.

‘సుభాష్ గురించి మాట్లాడలేను. రాస్తాను’ అని చెప్పి కూర్చొన్నాను.




(ఇంకా వుంది)

15-08-2026

కామెంట్‌లు లేవు: