15, జూన్ 2016, బుధవారం

అమెరికన్ కాకమ్మ కధ


కాకమ్మ కధలు చెప్పేవాళ్ళు అమెరికాలో కూడా వుంటారు. అలాటి ఒక కధే ఇది.
కధ కాబట్టి, అందులోను అమెరికా కధ కాబట్టి  వూరికూరికే డౌట్లు అడక్కూడదు.
అనగనగా ఓ చదువుకోని నిరుద్యోగి మైక్రోసాఫ్టు ఆఫీసులో బంట్రోతు పనికోసం వెళ్ళి అక్కడి హెచ్ ఆర్ మేనేజర్ని కలిసాడు. (మైక్రోసాఫ్టు లాంటి సంస్థలో  బంట్రోతు ఉద్యోగం ఏమిటి అనే చొప్పదంటు ప్రశ్నలు మధ్యలో అడగరాదన్నది ఈ కాకమ్మ కధ చెప్పే పెద్దమనిషి కండిషన్.)
హెచ్ ఆర్ మేనేజర్ మనవాడి ఈ మెయిల్ అడిగాడు. 'పూటకు ఠికానా లేదు నాకో  కంప్యూటర్ పైగా ఓ ఈ మెయిల్ ఐడీ కూడానా' అని మనవాడు జవాబు చెప్పాడు. మేనేజర్ ఆశ్చర్యపోయాడు. 'నీకు  ఈమెయిల్ ఐడీ  కూడా లేదా. అదికూడా లేకుండా అమెరికాలో యెలా బతుకుతున్నావు?' అని ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంటే మనవాడు మొహం తిప్పుకుని బయట పడ్డాడు.
బయట పడ్డాడే కాని జీవితం పెట్టిన పరీక్ష నుంచి యెలా బయటపడాలో తెలియలేదు. అల్లా నడుచుకుంటూ వెడుతుంటే ఆదివారం సంత (?) కనబడింది. జేబులో పది డాలర్లు వున్నాయి. అవ్వే ఈనెలకు, కాదు  కాదు మొత్తం ఈ ఏడాదికీ మిగిలిన ఆఖరు మొత్తం. వెళ్ళి ధైర్యం చేసి పది డాలర్లు పెట్టి పది కిలోల టమాటాలు కొన్నాడు. ఓ సంచీలో వేసుకుని ఇల్లిల్లు తిరిగి అమ్మాడు. సాయంత్రం చూసుకుంటే ఇరవై డాలర్లు లాభం. ఓహో డబ్బు సంపాదించడం అంటే ఇదా అనుకున్నాడు. మళ్ళీ ఆ డబ్బులన్నీ పెట్టి టమాటాలు కొని మళ్ళీ వాటిని ఇంటింటికీ తిరిగి అమ్మాడు. పొద్దున  జేబులో వున్న పది డాలర్లు రాత్రికి ఇంటికి చేరేసరికి పిల్లలు పెట్టి  అరవై అయ్యాయి. తిరుగుడు, శారీరక శ్రమ తప్ప వేరే పెట్టుబడి లేదు. అతడికి తత్వం బోధపడింది. ఇక వెనుతిరిగి చూడలేదు.
నెల తిరిగేసరికల్లా బండి కొన్నాడు. మరోనెలకల్లా ట్రక్కు కొన్నాడు. మూడు నెలల్లో టోకు దుకాణం తెరిచాడు. ఐదేళ్ళల్లో ఏకంగా దేశంలో ఒక పెద్ద చైన్ సంస్థగా ఎదిగాడు. లక్షలకొద్దీ ఆదాయం, వేలకొద్దీ సిబ్బంది.
కుటుంబం కోసం ఏదయినా చేయాలనిపించి  ఒక ఇన్స్యూరెన్స్ సంస్థని సంప్రదించాడు. అతడు అడిగిందే భాగ్యం అనుకుని ఆ కంపెనీ తమ  మార్కెటింగ్ చీఫ్ నే అతడి ఇంటికి పంపింది.  అతగాడు వివరాలు తీసుకుంటూ యధాలాపంగా మనవాడి  ఈ మెయిల్ అడిగాడు. అలాటిదేదీ లేదన్నాడు. ఇన్స్యూరెన్స్ వాడు బిత్తరపోయాడు. ఇన్ని బిలియన్ల టర్నోవర్ వున్న ఇంత భారీ సంస్థకు అధిపతి అయివుండి ఈ మెయిల్ కూడా లేకుండా ఇన్నిన్ని  వ్యాపారాలు యెలా చేయగలుగుతున్నారని అడుగుతూ అది కూడా వుంటే మీరు మరిన్ని కోట్లకు పడగలేట్టేత్తేవాళ్ళేమో! అని నసిగాడు.
మనవాడు నవ్వాడు, ఎదురుగా కూర్చున్న మార్కెటింగు చీఫ్ గుండెలవిసేలా బిగ్గరగా నవ్వాడు.
నవ్వి అన్నాడు.
'అవును! ఈ మెయిల్ అవీ వుండి వుంటే నేను ఈ పాటికి మైక్రోసాఫ్టు సంస్థలో ఆఫీసు బాయ్ గా వుండి  వుండేవాడిని'         
ఇలాటి కాకమ్మ కధలు బొచ్చెడు తెలుసంటారా? నాకు ఈ కధ చెప్పిన పెద్దమనిషితో నేనూ అదే అన్నాను. ఆయన నవ్వుకుని వుంటారు. ఆయన వుండేది అమెరికాలో కాబట్టి.

(ఇంగ్లీష్ లో ఈ కధను పీవీవీజీ స్వామి గారు  నాకు మెయిల్ చేశారు. నేను దాన్ని ఇష్టం వచ్చినట్టు తెలుగులో చెక్కేసాను. షరా మామూలుగా స్వామిగారికి కృతజ్ఞతలు)

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

రివర్స్‌లో ఓ కథ 🙂. వినే ఉంటారు 🙂.
ఓసారి అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారు తన భార్యతో కలిసి ఓ రెస్టారాన్‌ట్ కి వెళ్ళారట డిన్నర్కి. ప్రెసిడెంట్ గారి భార్యతో కాస్త మాట్లాడాలి అని రెస్టారాన్‌ట్ ఓనర్ అడిగి, పర్మిషన్ తీసుకుని, ఆమెతో ప్రైవేట్‌గా మాట్లాడాడట. వాళ్ళ సంభాషణ పూర్తయినతర్వాత ఏవిటి సంగతని ఒబామా గారు భార్యని అడిగితే, ఒకప్పుడు అతను నన్ను ప్రేమించానని వెంటపడేవాడు అందట. అయితే అతన్ని పెళ్ళి చేసుకునుంటే నువ్వు ఈ రెస్టారాన్‌ట్ కి ఓనర్ అయ్యుండేదానివన్నమాట అన్నాడట ఒబామా గారు. "కాదు, నేను అతన్ని పెళ్ళి చేసుకునుంటే అతను అమెరికా ప్రెసిడెంట్ అయ్యుండేవాడు" అని ఆమె జవాబిచ్చిందట 😀 😀.

Pavan Kumar Reddy Rendeddula చెప్పారు...

మీ ఇద్దరి కథలు బాగున్నాయండి