14, జూన్ 2016, మంగళవారం

నరేంద్ర మోడీ సప్త సూత్ర పధకం



సూటిగా.....సుతిమెత్తగా.......
 “చెత్తను ఊడ్చేస్తున్నా అంటూ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతాపార్టీ శ్రేణులకు సప్తసూత్ర సహిత దిశానిర్దేశం చేశారు.
అలహాబాదులో రెండు రోజులపాటు జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చేసిన ప్రసంగంలో మోడీ కొన్ని నిజాలు వెల్లడించారు. కొన్ని ప్రకటనలు చేసారు. కొన్ని హెచ్చరికలు ఒదిలారు. కొన్ని సూక్తులు నుడివారు.. పనిలో పనిగా కొన్ని గొప్పలు కూడా చెప్పారు.
ఏతావాతా ఆయన ప్రసంగ  సారాంశం ఏమిటంటే వచ్చే ఏడాది  జరిగే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పార్టీని సంసిద్ధం చేయడం,  ఆ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ ప్రత్యర్దులయిన ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలపై అవినీతి ముద్ర వేయడం.
జరిగింది పార్టీ కార్యవర్గ సమావేశం కనుక అందులో తప్పు ఎంచాల్సింది ఏమీ లేదు.
ఇక తన ప్రసంగంలో, (ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తల మేరకు) మోడీ చెప్పిన నిజం ఏమిటంటే-
“పార్టీ నిర్మాణంలో దశాబ్దాలుగా కోట్లాదిమంది కార్యకర్తలు చేసిన కఠోర శ్రమ ఫలితాలను నేడు మనం అనుభవిస్తున్నాం”.
భేష్! నిఖార్సయిన నిజం.
ఇక ప్రకటన విషయానికి వస్తే,
“ఒక చిన్న ఇంటిని శుభ్రం చేయాలంటేనే వారం పడుతుంది. యూపీఏ హయాములో జరిగిన అవినీతితో దేశ వ్యాప్తంగా చెత్త పేరుకు పోయింది.  నేను యావత్ దేశాన్ని శుభ్రం చేస్తున్నా”.
ప్రకటన ఆకర్షణీయంగానే వుంది. అయితే, చెత్తను ఊడ్చే పనితోనే సరిపుచ్చుకోకూడదు. దానితో పాటు చేయాల్సినవి ఇంకా  చాలా వున్నాయి.
“..మనం కేంద్రంలో, అనేక రాష్ట్రాల్లో అధికారంలో వున్నాం. ఈ అధికార ప్రభావం మన మీద వుండకూడదు’ అంటూ సూటిగానే పార్టీ నాయకులకు, శ్రేణులకు హెచ్చరికతో కూడిన సూచన చేసారు.
“సేవాభావం, సమతౌల్యం, నిగ్రహం, సమన్వయం, సానుకూలత, సంవేదన, సంవాదం అనే సప్త సూత్రాలను పార్టీ నేతలు, కార్యకర్తలు పాటించాలి”
వీటిల్లో కొన్ని  హిందీ పదాలకు  తెలుగు సమానార్ధకాలు వేరు. అర్ధాలు కొంత వరకు మారిపోతాయి. ఐతే, ఈ నీతులు ఇప్పుడు చెబుతున్నారు  అంటే  ఏమర్ధం? పార్టీలో ఎంతో కొంత వీటికి కొరత వున్నట్టే కదా! పిల్లవాడ్ని పొద్దున్నే నిద్ర లేచి చదువుకోమని తండ్రి చెబుతున్నాడు అంటే, పిల్లాడు ఆ పని చేయడంలేదనే కదా!
“రెండేళ్ళ మా పాలనపై అనేక మీడియా సంస్థలు సర్వేలు చేసాయి. ప్రజల అండతో నేను ప్రధమ శ్రేణిలో పాసయ్యాను”
పైన చెప్పిన అయిదింటిలో ఇది దేనికిందికి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆయన ఈ ప్రసంగం చేసిన సందర్భాన్ని దృష్టిలో వుంచుకుని చూస్తే అందులో ఎలాంటి అనౌచిత్యం కనబడని మాట  వాస్తవమే. బీజేపీ అధ్యక్షుడు  కాకపోయినా  ప్రధాని మోడీనే ఆ పార్టీకి అధినాయకుడు. కాబట్టి, రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కార్యకర్తలను సంసిద్ధం చేయాలంటే ఉపన్యాసాలలో ఆ మాత్రం ఘాటు తప్పని సరి.
నిజానికి ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం. నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో విజయ భేరీ మోగించిన మూలాయం సింగ్ ఎస్పీ పార్టీ, అతడి కుమారుడు అఖిలేష్  యాదవ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. అధికారం చేపట్టిన రెండేళ్ళలోనే వచ్చిపడ్డ సార్వత్రిక ఎన్నికల్లో మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సాధించిన ఘన విజయం భారతీయ జనతా పార్టీలో కొత్త ఆశలు రేకెత్తించింది. ఆ రాష్ట్రంలోని మొత్తం ఎనభయ్ లోక సభ సీట్లలో  ఏకంగా డెబ్బయి ఒకటి గెలుచుకుని విజయ బావుటా ఎగురవేసింది.  ఆ స్థాయి విజయాన్ని వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో నమోదు  చేయాలని ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఏ రాజకీయ పార్టీ అయినా సాధించిన విజయాలను పటిష్టం చేసుకోవాలనే చూస్తుంది. అందులో 404 సీట్లున్న ఉతరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో పాటు  సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం బీజేపీకి చాలా చాలా అవసరం. ఎందుకంటే, తద్వారా రాజ్యసభలో బలాన్ని ఇతోధికంగా పెంచుకోవడానికి వీలుపడుతుంది. లోక్ సభలో నెగ్గించుకున్న జీ ఎస్ టీ వంటి అతి ముఖ్యమైన బిల్లులను చట్టరూపంలోకి తీసుకురావాలంటే రాజ్యసభలో బలం అతి కీలకం. యూపీ ఎన్నికల్లో గెలుపు ఇందుకు మార్గాన్ని సుగమం  చేస్తుందన్న నమ్మకంతోనే ఆ రాష్ట్రంలో పాగా వేయడానికి మోడీ, అమిత్ షా ద్వయం ఆత్రుత పడుతోందని భావించవచ్చు.  
అసోంలో సాధించిన విజయం, యూపీని కైవసం చేసుకునే దిశగా బీజేపీచేత  అడుగులు వేయిస్తోంది.  ఇందులో బహుముఖ ప్రయోజనాలు వున్నాయి. దేశానికీ ప్రధాన మంత్రులను అందించిన ఉత్తర ప్రదేశ్ నుంచే కాంగ్రెస్ అధినాయకులు సోనియా, రాహుల్ లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అంత బలమయిన స్తితిలో లేకపోయినా, ఆ పార్టీకి ఆయువు పట్టు వంటి నేతలు ఇద్దరు ఆ రాష్ట్రం నుంచే ఎన్నికయ్యారు. అంచేత దానిపై పట్టు చిక్కించుకోవడం అంటే ప్రత్యర్ధిపై పై చేయి సాధించినట్టే కాగలదని బీజేపీ వ్యూహకర్తల ఆలోచన కావచ్చు. అందుకే పార్టీ జాతీయ కార్వర్గ సమావేశంలో సాధించిన విజయాలను ఏకరవు పెట్టడంతో పాటు, ఈ దేశం అనుభవిస్తున్న అన్ని కష్టాలకీ, నష్టాలకి  కారణం కాంగ్రెస్ పాలనే అంటూ మరోమారు బహిరంగ నిందారోపణలు చేయడం.   
చరిత్రలో రాజ్యాలను జయించుకుంటూ జైత్ర యాత్రలు చేసే చక్రవర్తులు,  స్థానిక పరిస్తితులకు తగ్గట్టుగా యుద్ధ వ్యూహాలను మార్చుకోవడం ఆనవాయితీ. అలాగే గతంలో అసోం లో విజయానికి అనుసరించిన పద్దతికి భిన్నంగా బీజేపీ అధినాయకత్వం, యూపీ విషయంలో యుద్ధ తంత్రం మార్చుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అసోంలో ముఖ్యమంత్రి అభ్యర్దిని ఎన్నికలకు ముందే ప్రకటించడం ఆ పార్టీకి  బాగా కలిసి వచ్చింది. యూపీ వంటి సువిశాల రాష్ట్రంలో ఆ తంత్రం పనిచేయకపోవచ్చు.  అందుకే మోడీ, అమిత్ షా ద్వయం వ్యూహాన్ని కొంత మార్చుకుంటున్నట్టు అనిపిస్తోంది. ప్రధాన ప్రత్యర్దులయిన ఎస్పీ కి అఖిలేష్ యాదవ్, బహుజన సమాజ్ పార్టీకి మాయావతి ముఖ్యమంత్రి  అభ్యర్ధులని స్పష్టంగా తెలుస్తున్న పరిస్తితుల్లో, బీజేపీ ఈ విషయంలో స్పష్టత ఇవ్వకుండా రంగం లోకి దిగడం వల్ల కలిగే లాభ నష్టాలను గురించి పార్టీలో చర్చ జరుగుతోంది. యెంత కాదనుకున్నా ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో కులం కీలక భూమిక పోషిస్తున్న మాట నిజం. ఆ రాష్ట్రంలో ఠాకూర్లు, యాదవులు, షెడ్యూల్డ్ కులాలు, ఒబీసీలు, బ్రాహ్మణులు ఇలా అందరికీ ఎంతో కొంత ఓటు బ్యాంకు వుంది. ఇలా కులాల వారీగా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఒక్కో కులానికి చెందిన వారిని అప్రకటిత ముఖ్యమంత్రి అభ్యర్ధులుగా ప్రచారంలో పెట్టడం ద్వారా అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకోవచ్చనే ఆలోచన కూడా వుంది. అయితే, ఇంతమంది సీఎం అభ్యర్ధులు రంగంలో వుంటే వచ్చే కుమ్ములాటలను  కూడా గమనంలో వుంచుకోవాల్సిన అవసరం వుంటుంది. ఒక రకంగా స్థానిక నాయకులను ఇలా ఒకరి మీద ఒకరిని ఎగదోసి పబ్బం గడుపుకునే సంస్కృతి కాంగ్రెస్  లో వుందని చెప్పుకుంటారు. మరి, నిబద్దత కలిగిన పార్టీ అని ఓ పక్క చెప్పుకుంటూ ఇలాటి రాజకీయాలు చేస్తే పార్టీ ప్రతిష్ట పలచపడుతుందేమో కొందరి సందేహం. విజయాన్నే తుది లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న బీజేపీ  అధిష్టానం, బహుశా ఇటువంటి సందేహాత్మకుల అభిప్రాయాలను పట్టించుకోక పోవచ్చు.             
వచ్చే సంవత్సరం యూపీలో  గెలుపు భారతీయ జనతా పార్టీకి  ఆవశ్యకమే. కానీ అప్పటిలోగా యావత్ ప్రజలు మోడీపై పెట్టుకున్న ఆశల మాటేమిటి? ఇలా చరిత్రలోని చక్రవర్తుల మాదిరిగా రాష్ట్రం వెంట రాష్ట్రం తమ ఖాతాలో వేసుకుంటూ పోవడమేనా! ఇది ధ్యేయంగా పెట్టుకుంటే తప్పేమీ లేదు. కానీ ఇదొక్కటే ధ్యేయం కాదని చెప్పేవాళ్ళు ఆయన అభిమానుల్లోనే పెక్కుమంది వున్నారు.
నరేంద్ర మోడీ ఈ విషయం గమనంలో వుంచుకోవాలి.
చెత్తను ఊడ్చేస్తా! అనే మోడీ ప్రకటనను  అందరూ హర్షిస్తారు, స్వాగతిస్తారు.
అయితే ఒక సలహా. 
చెత్తను మోసుకెళ్ళే లారీ కూడా కొంత చెత్తను రోడ్లమీద పడేస్తుంటుంది. దాన్ని శుభ్రం చేస్తామని బయలుదేరే వాళ్ళు రాజకీయాల్లో ఎలాగూ సిద్ధంగా  వుంటారు. ఇది గుర్తు పెట్టుకోవడం కూడా అవసరం.
(14-06-2016)    

         

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Let modiji work peacefully for five years. SP and BSP are bandicoots looting UP.

నీహారిక చెప్పారు...

ఫోటోలకు ఫోజులిస్తేనే చెత్తని ఊడ్చేసినట్లా ? ఈ దేశంలోని చెత్తని ఊడ్వాలంటే వారు కారణజన్ములై ఉండాలి. ఇంతవరకూ ఒక్కటంటే ఒక్క కుంభకోణం కూడా టచ్ చేయలే(రు)దు.