14, జూన్ 2016, మంగళవారం

మనసులోని రసం



ఈ పండు ఏమిటి?” అడిగాడు గురువు గారు
“నారింజ పండు” చెప్పాడు  శిష్యుడు
“ఈ పండును గట్టిగా పిండితే ఏం వస్తుంది?”
“నారింజ రసం”
“యాపిల్ రసం ఎందుకు రాదు?”
“వీల్లేదు”
“మరి ద్రాక్షరసం”
“అయ్యే పనికాదు”
“ఈ పండుని గట్టిగా పిండితే ఏ రసం వస్తుందంటావు?”
శిష్యుడికి సహనం తగ్గిపోతోంది. కానీ అడుగుతున్నది గురువుగారాయె. విసుగును అణచి పెట్టుకుంటూ జవాబు చెప్పాడు.
“నారింజ పండును పిసికితే నారింజ రసమే వస్తుంది”
“అంటే ఏమిటి. నారింజ పండు కాబట్టి లోపల వుండేది నారింజ రసమే, కదా!”
శిష్యుడు ఔనన్నట్టు తలూపాడు.
“ఉదాహరణకు ఈ పండే నువ్వు అనుకుందాం. ఎవరో కావాలని నీ మీద ఒత్తిడి పెంచాడనుకుందాం. నీకు ఇష్టం లేని మాటలు చెబుతున్నాడని అనుకుందాం. నిష్కారణంగా నిన్ను వేధిస్తున్నాడని అనుకుందాం. అప్పుడేమి జరుగుతుంది. నీకు లోపలనుంచి కోపం తన్నుకు వస్తుంది. అంటే నీ లోపల ఉన్నది కోపం అన్నమాట. ఇలా నీ మనసు బాధ పెట్టేవాడు నీ శత్రువు కావచ్చు, నీ మిత్రుడు కావచ్చు, నీ దగ్గరి చుట్టం కావచ్చు. నీ భార్యాపిల్లలు కావచ్చు, అధికారులు కావచ్చు. ప్రభుత్వాలు కావచ్చు. కానీ వాళ్ళు చేసేది ఈ పండును పిండినట్టు నిన్ను పిండడమే. కానీ నీలోనుంచి బయటకు వచ్చేది మాత్రం కోపం,   చీకాకు, ఆందోళనఒక్కోసారి భయం. దీనర్ధం ఏమిటంటే నీ మనసులో పేరుకుపోయి వున్నవి ఇవే. వీటి స్థానంలో ప్రేమ, ఆప్యాయతలు వుంటే అవే బయటకు వస్తాయి. జీవితంలో సాటివాడిని ప్రేమించడం నేర్చుకుంటే మనసులో కూడా ప్రేమే నిండి వుంటుంది. ఒత్తిళ్లకు గురయినప్పుడు అదే బయటకు వస్తుంది”

శిష్యుడికి గురువుగారి మాటల్లో పరమార్ధం బోధపడింది.

1 కామెంట్‌:

Mamtha చెప్పారు...

Could you please translate this post in to English ?