‘నాన్నా మనమేమిట్లు?’ అన్నాడు మా పెద్ద కొడుకు సందీప్ ఓ రోజు స్కూలు నుంచి రాగానే.
ముందు ఆ ప్రశ్న అర్ధం కాలేదు. కాసేపటి తర్వాత చిన్నప్పుడు ఈ మాట మా బామ్మగారి నోటంట విన్న సంగతి గుర్తుకువచ్చింది. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి రాగానే వారిని ‘ఏమిట్లు’ అని అడిగేది. నాకు ముందు అర్ధం అవకపోయినా అర్ధం అవడం మొదలయినప్పటి నుంచి ఆ మాట వినగానే చిరాకేసేది. (ఏమిట్లు అంటే మీరెవరు? ఏం కులం?)
మా ఇద్దరు పిల్లల్నీ చిక్కడపల్లిలో మా ఇంటికి రిక్షా దూరంలో హిమాయత్ నగర్ సెంట్ ఆంథోనీ స్కూల్లో చేర్పించాను. మొదటి రోజే నాకూ ఆ స్కూలు ప్రిన్సిపాల్ గ్రిగరీ రెడ్డి గారికీ మాట తేడా వచ్చింది.
‘మీరెన్నయినా చెప్పండి ఆ కాలమ్ (Column) నేను పూర్తి చేసేది లేదు’ అనేశాను.
‘అలా ఎలా కుదురుతుంది. అది రూలు’ అన్నారాయన ఇంకా గట్టిగా.
‘అన్నీ రూలు ప్రకారమే చేస్తున్నారా’ అన్నాను ఒకింత వెటకారంగా.
‘చూడండి. మీరు రేడియో జర్నలిస్టు అని మీ ఇద్దరు పిల్లలకీ డొనేషన్ తీసుకోలేదు. మిగిలిన వారి దగ్గర తీసుకోకపోతే స్కూలు నడపలేము’
‘అప్లికేషన్ లో పిల్లవాడి కులం రాస్తేనే స్కూలు నడుస్తుందా?
ఇండియన్ అని మాత్రమే రాస్తాను, కావాలంటే రెలిజియన్ రాస్తాను. అంతేగాని కులం పేరు రాయను’
చెప్పి వచ్చేశాను.
ఆ తర్వాత ఏమీ కాలేదు. ఆయన ఆ ప్రసక్తి లేకుండానే ఇద్దరు పిల్లల్ని చేర్చుకున్నాడు.
ఇప్పుడు మళ్ళీ మావాడి మాటలతో ఆ గతం గుర్తుకువచ్చింది.
‘ఎవరు అడిగారు’ అన్నాను మా వాడితో.
‘నా క్లాస్ మేట్స్ అడుగుతున్నారు’
‘తెలవదని చెప్పు’
‘సరే’ అని వెళ్ళిపోయాడు.
3 కామెంట్‌లు:
Should have written "gOvinduDu." Sree Annamacharaya writes in one of his compositions: kulamunu neevE gOvinduDaa.
చాలా బాగుంది మాలాంటి కొత్త తల్లిదండ్రులకి పనికొచ్చే సలహా
దయచేసి తెలుగును తెలుగులిపిలోనే వ్రాయప్రార్ధన. తెలుగుతల్లి ఇంకొంచెం సంతోషపడుతుంది. వ్యాఖ్యాతలు దయచేసి గమనించాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి