17, సెప్టెంబర్ 2021, శుక్రవారం

మంత్రులు నిర్ణయాలు తీసుకోగలరా! – భండారు శ్రీనివాసరావు

 రేడియోలో పనిచేసేవారు ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేయాల్సి వస్తుంది. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన వీ.వీ. శాస్త్రి (వేమూరి విశ్వనాధ శాస్త్రి) చెప్పిన ఆసక్తికర ఉదంతం ఇది.

ఆయన భోపాల్ లో పనిచేసేటప్పుడు జవహర్ లాల్ నెహ్రూ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐ.సీ.ఎస్. అధికారి కె.పీ.ఎస్. మీనన్ ఏదో కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆ నగరానికి రావడం జరిగింది. ఆయన వద్ద గతంలో పనిచేసిన సంగ్లూ అనే అధికారి అప్పుడు భోపాల్ రేడియో కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆయన పూనికపై వీ.వీ. శాస్త్రి వెళ్లి మీనన్ ను కలుసుకుని రేడియో కేంద్రానికి ఆహ్వానించారు. నిజానికి ఆయన మరునాడు విదేశీ ప్రయాణం పెట్టుకున్నారు. అయినా, రేడియో మీది గౌరవంతో, సంగ్లూ మీది అభిమానంతో తన ప్రయాణం వాయిదా వేసుకున్నారు. ఆరోజు రేడియో స్టేషన్ కు వచ్చిన మీనన్, మాటల సందర్భంలో తన అనుభవాలు కొన్ని చెప్పారు.

మీనన్ గారు ఆరోజు చెప్పిన విషయాల్లో ఒకటి మన రాష్ట్రానికి సంబంధించింది కావడం వల్ల శాస్త్రి గారికి బాగా గుర్తుండిపోయింది.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అనేక సంస్థానాలను ఇండియన్ యూనియన్ లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నిజాం నవాబు ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎలాటి చర్య తీసుకోవాలనే విషయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్న ఆ సమావేశం గంటల తరబడి కొనసాగింది. అర్ధరాత్రి కావొస్తోంది. సర్దార్ పటేల్ మగత నిద్రలోకి జారిపోయినట్టు కళ్ళు మూసుకుని వున్నారు. భారత సైన్యాలను హైదరాబాదు పంపే విషయంలో సుదీర్ఘంగా చర్చ సాగుతోంది. కళ్ళు మూసుకుని అంతా వింటున్న సర్దార్ పటేల్ లేచి ఒక్కసారిగా ఇలా అన్నారట.

ఇండియన్ ఆర్మీ ఇప్పటికే హైదరాబాదు చేరిపోయింది. మేజర్ జనరల్ చౌదరి అక్కడే వున్నాడు.’

పటేల్ మాటలు విని అక్కడివారంతా మ్రాన్పడిపోయారు.

నెహ్రూ సంగతి చెప్పక్కర లేదు.

ప్రధానమంత్రికి తెలియకుండా మంత్రులు నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇప్పుడు ఊహకు అందని విషయం. కానీ నెహ్రూ హయాములో జరిగింది.


(హోం మంత్రి సర్దార్ పటేల్, ప్రధాని నెహ్రూ)


(17-09-2021)

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ప్చ్ ప్చ్, కాశ్మీరు గురించి కూడా పటేల్ గారు మగత నిద్రలోనే చెయ్యవలసినది చేసేసి ఉంటే ఎంత బాగుండేది?