16, మే 2021, ఆదివారం

జీవితంలో కధలు

 జీవితంలో కొన్ని సంఘటనలు కధలకు ఏమాత్రం తీసిపోవు.

చాలా ఏళ్ళ క్రితం, 2005లో కాబోలు, తానా వారి ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లాను.

‘ఎంతకాలం అమెరికాలో వుంటారు అనే ఇమ్మిగ్రేషన్ అధికారి ప్రశ్నకు ‘అయిదు రోజులు’ అని జవాబిచ్చాను. ‘ఫైవ్ డేస్ ఓన్లీ అన్నాడతగాడు ఒకింత ఆశ్చర్యంతో.  నిజానికి నా రిటర్న్ ఫ్లైట్ కూడా ఐదో రోజునే వుంది. తీసి చూపించాను. ఆల్ ది బెస్ట్ అన్నాడు స్టాంప్ వేస్తూ.

బయటకి వచ్చి చూసుకుంటే ఆరు నెలలు అని వుంది. పదేళ్ల మల్టిపుల్ విజిటర్స్ వీసా నాది. అమెరికాలో ఉండడానికి ఎక్కువలో ఎక్కువ అనుమతించే ఆరు మాసాల వ్యవధిని  నాకిచ్చినట్టు.

తానా సభలు జరిగే డెట్రాయిట్ నగరంలో విదేశాల నుంచి వచ్చిన అతిధులకు కొన్ని హోటళ్ళలో బస ఏర్పాటు చేశారు. పెద్ద ఆడంబరంగా లేకపోయినా గదిలో అన్ని వసతులు వున్నాయి. ఒక్కో గదిని  ఇద్దరిద్దరికి  చొప్పున కేటాయించారు. నాతొ పాటు గదిలో ఉన్న వ్యక్తి వచ్చినప్పటి నుంచి చాలా టెన్షన్ తో వున్నట్టు కనిపించాడు. మర్నాడు డెట్రాయిట్ మాజీ మేయర్ , కీర్తిశేషులు ఆల్బర్ట్ కోబో పేరిట నిర్మించిన సువిశాల సభామందిరంలో తానా సభలు మొదలవుతాయి.

అతడితో పెద్దగా మాట్లాడానికి నా దగ్గర కూడా విషయాలు లేవు. అంత పరిచయమూ లేదు. అయినా అతడి మొహంలో కనబడుతున్న  టెన్షన్ తగ్గించడానికి వివరాలు అడుగుతూ మాటల్లో పెట్టాను.

‘ఎవరికీ చెప్పకండి. నేను ఈ ఒక్క రాత్రే వుంటాను. తెల్లారేసరికల్లా వెళ్ళిపోతాను అన్నాడు. నాకు ఆశ్చర్యం. సభలకోసం వచ్చి తెల్లారి వుండననడం ఏమిటి?  ఎక్కడికి అని అడిగేలోగా అతడే అన్నాడు.

‘ఎక్కడికి పోవాలో సరిగ్గా నాకే తెలియదు. పలానా  చోటుకి వెళ్ళమని హైదరాబాదులో చెప్పారు. అదేమిటో ఎక్కడో ఎలా వెళ్ళాలో తెలియదు. కానీ వెళ్లి తీరాలి’ అన్నాడు.

‘సరిపడా డబ్బులు ఉన్నాయా అని అడిగాను. అడిగితే ఇవ్వడానికి నా దగ్గరా ఎక్కువేమీ లేవు. ఏదో అయిదు రోజులు, అదీ వాళ్ళ ఆతిథ్యంలో ఖర్చులు ఏముంటాయి అనే అభిప్రాయంతో ఎక్కువ డాలర్లు కూడా తెచ్చుకోలేదు.

‘అక్కరలేదు. నేను ఆ ఏర్పాటుతోనే వచ్చాను. ఓ మూడు నెలలకు సరిపడా డబ్బులు వున్నాయి. తర్వాత నా అదృష్టం’ అన్నాడతను.

మాటల్లో వివరాలు చెప్పాడు. అతడో ఎలిమెంటరీ స్కూలు టీచరు. పెద్ద సంసారం, చిన్న జీతం. ఎన్నాళ్ళిలా అనుకుంటూ వుంటే ఎవరో చెప్పారు, ‘అమెరికా వెళ్ళు, అది అవకాశాల దేశం, ఏదో ఒక పని దొరక్కపోదు అని.

‘ఎలా వెళ్ళడం?’ అంటే ...

‘అది కూడా అతడే చెప్పాడు. ఏదో ఒక విధంగా విజిటర్ వీసా సంపాదించి వెళ్ళు. ఒక్కసారి అమెరికాలో అడుగుపెడితే రోజుకిన్ని డాలర్లు, గంటకిన్ని డాలర్లు చొప్పున  ఇచ్చే వాళ్ళు వుంటారు. నీ ఖర్చులకు పోను ఇంటికి డబ్బులు కూడా పంపుకోవచ్చు అని ఉత్సాహ పరిచాడు

‘ఏమి చేయాలని ఆలోచిస్తున్న నాకు అతడిచ్చిన ఈ  సలహా మరేదీ ఆలోచించకుండా చేసింది. అంతే! ఉన్న కొంత పొలం అమ్మ వద్దంటున్నా అమ్మేసాను. అప్పటినుంచి చేయని ప్రయత్నం లేదు, వీసా సంపాదించడానికి. ఇన్నేళ్ళకు కుదిరింది. ఇంట్లో బయలుదేరిన దగ్గరి నుంచి ఒకటే బెంగ. మళ్ళీ మా ఊరికి తిరిగి వెడతానా! మా వాళ్ళను మళ్ళీ నా కళ్ళతో చూడగలుగుతానా!’

నాకు ఏమి చెప్పాలో తెలియలేదు. మౌనంగా వుండిపోయాను.

అతడే మొదలు పెట్టాడు మళ్ళీ.

‘ఎవరిదో తెలుగు వాళ్లది ఫాం హౌస్ వుండట, దానికి కేర్ టేకర్ కావాలిట. ఎక్కడో అడవీ ప్రాంతంలో వుందట. పలానా చోటు వరకు రాగలిగితే వాళ్ళే తీసుకు వెడతారట. ఆరు నెలలు స్టాంప్ వేశారు. ఈలోగా ఏదో ఒక మంచి ఉద్యోగం పట్టుకోవాలి

మనిషిని చూస్తే పిరికివాడిలా వున్నాడు. ఇంత ధైర్యం ఎలా చేశాడు? దేశం కాని దేశంలో, ఊరు కాని వూళ్ళో భాష కూడా సరిగా లేకుండా ఎలా నెగ్గుకు రాగలడు?

డబ్బు అవసరాలవల్ల, మరీ పచ్చిగా చెప్పాలంటే డబ్బు యావలో పడి జీవితంలో ఇంత రిస్క్ తీసుకోవాలా!

ఆ రాత్రి ఎక్కడో డిన్నర్ ఏర్పాటు చేశారు. అతడు రాలేదు. ఏదో కొనుక్కుని తింటాను రానన్నాడు. వచ్చేసరికి నిద్ర పోతున్నాడు.

తెల్లారి చూస్తే పక్క మీద లేడు, అసలు గదిలోనే లేడు.

ఇంత పెద్ద సువిశాల దేశంలోకి అతడు ఒంటరిగా నడుచుకుంటూ వెడుతున్న దృశ్యమే నా ఊహకు మిగిలింది.

అతడు ఉద్యోగం సంపాదించుకున్నాడా! ఆ దేశంలో స్థిర పడ్డాడా! ఎప్పటికయినా మన దేశానికి వచ్చి భార్యాబిడ్డలను చూడగలిగాడా! అలా జరిగితే ఎంత బాగుంటుందో కదా!

ఆ తర్వాత ఎప్పుడు అమెరికా వెళ్ళినా నా మదిలో ఈ ప్రశ్నలు తలెత్తేవి. కాకపోతే జవాబు దొరకని ప్రశ్నలు.  (16-05-2021)         

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

కానీ అతను తానా వారి ఆహ్వానం మీద వచ్చాడు అని తెలుస్తుంది . హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందన్న మాట తానా ఆహ్వనాల్లో . ఒక 4 , 5 సంవత్సరాల క్రితం కూడా ఎదో తెలుగు సంఘం మీద చాలా పెద్ద ఆరోపణలు వచ్చాయి , ఇండియా నుండి చిన్న actress లని తీసుకుని వెళ్లి అక్కడ వ్యభిచారం చేయిస్తున్నారని ... మన వాళ్ళు మాహా వెధవలోయి అని ఎవరో అన్నట్టు ..
:Kasi