కరోనా రాకచూసి మిగిలిన వ్యాధులన్నీ సర్దుకు కూర్చున్నాయి.
‘ఏమిటలా వున్నావు’ ధైర్యం చేసి అడిగింది కలరా నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ.
‘ఎలా ఉండను? నిన్న మొన్నటిదాకా మొత్తం ప్రపంచాన్ని
గడగడలాడించానని విర్రవీగాను’
‘ఇప్పుడు మాత్రం ఏమైంది? నీ నామ స్మరణ చేయకుండా భూలోకవాసులకు
క్షణం గడవడం లేదు కదా!’ అన్నది హెచ్.ఐ.వి.
‘నేనూ అలాగే అనుకున్నాను. ఈ సృష్టి ప్రారంభం అయిన తర్వాత యావత్ ప్రపంచ ప్రజల
నోళ్ళలో నా పేరు ఎన్ని కోట్లమారు మారుమోగుతున్నదో చూసి నేనూ పులకరించిపోయాను.
వాళ్ళు నా పేరు వింటేనే ఎంతగా భయపడుతున్నారో కళ్ళారా చూసి పొంగిపోయాను. కానీ అది
భయం కాదనీ, వాళ్ళు నాతో పరాచికాలు ఆడుతున్నారనీ
ఇపుడిప్పుడే గ్రహింపుకు వచ్చి సిగ్గుపడుతున్నాను’
‘అదేమిటే అలా అంటున్నావు. నువ్వు కదా మా అందర్నీ చూస్తుండగానే మించిపోయావు. నీ పేరు వింటేనే వణికిపోయేలా మానవుల్ని
మార్చగలిగావు అని మేమిక్కడ అసూయతో రగిలిపోతుంటే ఏమిటిది ఇలా నీ ఈ మాటలతో
మమ్మల్నిలా మళ్ళీ సంతోషపెడుతున్నావు’ అంది ఎబోలా.
‘అలానా! నేను రంగ ప్రవేశం చేసిన తర్వాత మీకెవ్వరికీ సరైన పనిపాటలు
లేకుండాపోయాయి కదా! ఆ ఖాళీ టైములో మీరు కాస్త పత్రికలు చదివితే, కొంచెం టీవీలు చూస్తే విషయం బోధపడేది’
‘పత్రికలూ, టీవీలు అంటూ మమ్మల్ని భయపెట్టకు. మేము
ఇంతమందిమి కలిసి చేయలేని అపకారాన్ని అవి ఒంటిచేత్తో మానవాళికి చేస్తున్నాయి. అసలేం
జరిగిందో నువ్వే చెప్పు, వింటాం’ అంది కేన్సర్.
‘మనుషులకు చావు భయాన్ని మించిన భయం వుండదు అనే ధీమాతో నేను భూలోకంలో
అడుగుపెట్టాను. మొదట్లో నా అభిప్రాయం నిజమే అనిపించింది. కానీ రోజులు గడుస్తున్న
కొద్దీ వాళ్ళు మళ్ళీ తమ మునపటి వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. చావు ముంగిట్లో
వుందని తెలిసి కూడా చిన్నారులపై లైంగిక దాడులు చేస్తూనే వున్నారు. చనిపోతే
కట్టుకుపోయేది ఏమీ ఉండదని తెలిసికూడా ఆన్ లైన్ మోసాలతో ఇతరులని దోచుకుంటూనే
వున్నారు. కరోనా బారిన పడితే రేపు మనది కాదు అనే భయం ఎటు పోయిందో తెలవదు ఎప్పుడో మూడేళ్ళకు వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎలాగా, ప్రత్యర్ధిని ఓడించడం ఎలాగా అని మల్లగుల్లాలు పడుతున్నారు. దొంగతనాలు, దోపిడీలు జరుగుతూనే వున్నాయి. భూఆక్రమణలు మునుపటి కంటే ఎక్కువయ్యాయి. డబ్బు
పోగేసుకోవడం ముమ్మరమయింది. మరణభయంతో జనంలో అత్యాశ లేకుండా పోతుంది అనుకుంటే ఆ
కక్కుర్తి మరీ ఎక్కువయింది. తింటున్నారు, తాగుతున్నారు, క్వారంటైన్లలో చిందులేస్తున్నారు. వైద్యం చేయడానికి లక్షలు గుంజుతున్నారు.
చనిపోతే శవాన్ని అప్పగించడానికి డబ్బులు లాగుతున్నారు. నిజం చెప్పాలంటే నా రాకకు
ముందుకంటే కూడా ఇప్పుడు ప్రపంచం మరీ పాడయిపోయింది.
ఇన్నిరోజుల అనుభవంతో చెబుతున్నా
వినండి. కరోనా అంటే భయం కంటే డబ్బు అంటే మమకారమే వాళ్లకు ఎక్కువ అని తేలిపోయింది’ (10-05-2021)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి