23, మే 2021, ఆదివారం

‘మరుపు’ మంచిదే!

   

గుర్తు పట్టారా అంటూ సరిగా  తెల్లవారకుండానే ఫోన్లో పలకరిస్తుంది ఓ గొంతు. మధ్యాన్నం ఏ కూరతో అన్నం తిన్నానో సాయంత్రానికి గుర్తుండని గొప్ప  జ్ఞాపక శక్తి నాది. జుట్టు పీక్కున్నా గుర్తు రాదు.

కానీ కధ అంతటితో ఆగదు.

‘నేనెవరో చెప్పుకోండి చూద్దాం’ అంటుందా గొంతు అవతల నుంచి.

పొద్దున్న పొద్దున్నే ఈ అగ్ని పరీక్ష ఏవిటని వాపోవడం ఇవతల మన వంతు.  

మనం గుర్తు పట్టడం, మనల్ని గుర్తు పట్టడం ఈ రెండూ ఏదో ఒకరోజున అందర్నీ వేధించే సమస్యలే అనిపిస్తుంది ఈ పాడు లోకంలో.

నిన్న సాయంత్రం ఒక పెద్దాయన ఫోన్ చేశారు, ఓ అరవై మంది అనాథాశ్రమం వాళ్లకు వాక్సిన్ వేయించాలి ఎలా అని.

ఒకప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు.  ఇంకా ఏదో సేవ చేయాలనే తపన.

ఆయన చెప్పిన మాటలు  వింటుంటే బాధ వేసింది.

గతంలో అలవాటు చొప్పున పెద్ద అధికారులకి ఫోన్ చేసి చెబుదామని ప్రయత్నిస్తే ‘సారు బిజీగా వున్నారు, మీరు ఫోన్ చేశారని తర్వాత చెబుతాను’ అన్నాడట ఆ అధికారి పియ్యే.

ఆయన కంటే ముందు రిటైర్ అయినవాడిని నేను. కనీసం ఆయనకీ ఫోన్ నెంబర్లు అన్నా తెలుసు, నాకదీ తెలియదు.

రోలు, మద్దెల సామెత జ్ఞాపకం వచ్చింది.

ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా చేసిన వీవీ శాస్త్రి గారు ఒక మాట చెప్పేవారు. ‘మనం సర్వాధికారాలు చెలాయించిన ఆఫీసుకి రిటైర్ అయిన తర్వాత తరచుగా, అదీ పని లేకుండా  పోకూడదు అని.

ఎందుకంటే కొత్త అధికారులు వస్తారు. పాత అధికారులని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం పాత సిబ్బందికి వుండదు. అది సహజం అని సరిపెట్టుకుంటే పర్వాలేదు, లేకపోతె మిగిలేది మనస్తాపమే.  

ఓ యాభయ్ ఏళ్ళ క్రితం కేబినెట్ మంత్రిగా రెవెన్యూ వంటి కీలక శాఖలను నిర్వహించిన శ్రీ పీ. నరసారెడ్డి   చాలా కాలం క్రితం ఏదో ఫంక్షన్ లో కలిసారు.  రేడియో విలేకరిగా నాకు ఆయనతో సన్నిహిత పరిచయం వుండేది. చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ ఇదే కలవడం. వృద్ధాప్యపు ఛాయలు మినహా మానసికంగా ఆయన గట్టిగానే కనిపించారు. గతం బాగానే  గుర్తున్నట్టు వుంది. అలనాటి విషయాలు కాసేపు ముచ్చటించారు. ఎలా వున్నారుఅనే నా ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు.

హైకోర్టులో బార్ రూమ్ అనేది వుంటుంది. యువ లాయర్లతో పాటు వయసు ఉడిగిన మాజీ అడ్వొకేట్లు కూడా అక్కడ కనిపిస్తారు. నిజానికి వారికి వాదించే కేసులు ఏమీ వుండవు. ఇంట్లో ఉబుసుపోక అక్కడికి చేరి కాసేపు కాలక్షేపం చేసి ఇళ్ళకు వెడతారు. నేనూ అంతే. అప్పుడప్పుడూ పార్టీ ఆఫీసుకు వెడతాను. నేను ఎవరన్నది మా  పార్టీలోనే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు తప్పుకుంటారు. ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది. కానీ ఇందిరాగాంధి వంటి  గొప్పనాయకులని తలచుకుంటే, వారితో పోల్చుకుంటే నా  పరిస్తితి చాలా మెరుగు’

ఇలాంటిదే మరో వ్యధాభరిత కధ

ఆయన చాలా కాలం ఒక పెద్ద కార్యాలయానికి ప్రధానాధికారిగా పనిచేశారు. ఆయన కనుసన్నల్లో వందలాదిమంది సిబ్బంది పనిచేసేవారు.  రిటైర్ అయిన తర్వాత కొన్నాళ్ళకు ఏదో పని వుండి ఆ ఊరు వెళ్ళారు. తన పొజిషన్ లో పనిచేస్తున్న మరో అధికారి బాగా తెలిసిన వాడు కావడంతో వాళ్ళ ఇంటికి వెళ్లి కాసేపు కూర్చుని పాత విషయాలు తిరగేసుకున్నారు.

ఈలోగా ఆఫీసు టైం కావడంతో కొత్త అధికారి పాత అధికారిని మీరు కూడా రండి మన ఆఫీసును చూద్దురు కాని అని కోరడంతో ఆయన కూడా కారెక్కి వెంట వెళ్ళాడు.

ఆ ఆఫీసులో ఒక పద్దతి ఏళ్ళ తరబడి పాటిస్తూ వస్తున్నారు.

ప్రధానాధికారి ఇంటి నుంచి బయలుదేరగానే ఆయన పర్సనల్ స్టాఫ్ అలర్ట్ అవుతారు. ఆఫీసుకు చేరగానే సెక్యూరిటీ చీఫ్ ఫుల్ సెల్యూట్ తో ఆయన్ని  కారు వద్దనే రిసీవ్ చేసుకుని, బ్రీఫ్ కేసు తీసుకుని   వెంట వుండి లిఫ్ట్ దగ్గరకు తీసుకువేడతాడు. ఆ అధికారి వచ్చేదాకా లిఫ్ట్ ను   గ్రౌండ్  ఫ్లోర్ లోనే నిలిపి సానిటైజ్  చేసి ఉంచుతారు. లిఫ్ట్ బాయ్ నమస్కారం పెట్టి పైకి తీసుకువెడతాడు.

సరే! ఇదంతా ఆ రోజు అక్కడ పద్దతి ప్రకారం జరిగింది. విచిత్రం ఏమిటంటే అప్పటికి కొన్నేళ్ళ క్రితం ఆ పాత అధికారిని కూడా  సకల లాంఛనాలతో ఇలాగే రిసీవ్ చేసుకునేవారు. ఆయనా ఈ వైభోగం అనుభవించిన వాడే.

ఇవ్వాళ కూడా  అదే మనిషి. అదే అధికారులు. అదే సిబ్బంది. కనీసం వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన్ని గుర్తు పట్టినట్టు కనీసం నటించను కూడా లేదు.  

భగవద్గీతలో చెప్పిన మాదిరిగా మానవుడు  జీర్ణమై పోయిన పాత ఉడుపులు వదిలేసి కొత్త వస్త్రాలు ధరించినట్టు, ఉద్యోగాలు కూడా.

కావున, ఓ పార్దా! పాత ఉద్యోగాల వైభోగం  కోసం వర్తమానంలో శోకించుట తగదు. మరచిపోవుట మేలు.

(23-05-2021)    

 

 

కామెంట్‌లు లేవు: