మూడున్నర దశాబ్దాల క్రితం హైదరాబాదు పాత బస్తీలో గబ్బర్ సింగ్ అంటే చాలు సంఘ విద్రోహశక్తులకు టెర్రర్.
గూండాల గుండెల్లో నిద్రపోతూ గబ్బర్ సింగ్ అనే
పేరు తెచ్చుకున్న ఆ పోలీసు అధికారి అసలు పేరు కె.ఎస్.ఎన్. మూర్తి. నా మేనకోడలు
భర్త ఐ.పి.ఎస్. అధికారి రావులపాటి సీతారామారావు గారెకి బ్యాచ్ మేట్. రాష్ట్రంలో
అక్కడా ఇక్కడా కొన్నాళ్ళు పనిచేసి ఇద్దరూ దాదాపు ఒకేసారి హైదరాబాదు వచ్చారు. పాత
బస్తీలో పక్కపక్క జోన్లలో ఎసీపీలుగా జాయిన్ అయ్యారు. ఇద్దరి అధికార నివాసాలు కూడా
పక్కపక్కనే,
పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీలో.
ఆ విధంగా కె.ఎస్.ఎన్. మూర్తి గారు మా కుటుంబ
సభ్యులు అందరికీ పరిచయం. మనిషి బొద్దుగా, ఎత్తుగా, పోలీసు యూనిఫారంలో అయితే మరీ భీకరంగా
కానవచ్చేవారు. చిల్లర రౌడీలను, గ్యాంగ్ లీడర్లను సినిమాల్లో చూపించినట్టు
ఉరికించి కొట్టేవాడని, ఆ రోజుల్లో వచ్చిన షోలే సినిమాలో పాత్ర గబ్బర్ సింగ్ అనే
నిక్ నేమ్ ఆయనకు స్థిరపడి పోయిందని జనం
చెప్పుకునే వారు. పోలీసు డిపార్ట్ మెంటులో పై అధికారులు కూడా ఆయన్ని అసలు పేరుతొ
కాకుండా గబ్బర్ సింగ్ అని పిలిచేవారని ప్రతీతి.
ఒకసారి ఆయన భారీ కాయాన్ని తగ్గించుకునేందుకు
ప్రకృతి ఆశ్రమంలో చేరి బరువు బాగా తగ్గారు. ఆ రూపంలో గుర్తుపట్టని నాటి
ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ‘ఏడీ మన గబ్బర్ సింగ్ రాలేదా ఈ మీటింగుకు’ అని వాకబు చేశారట.
‘అదేమిటి ఇలా తగ్గిపోయారు, అలా
భారీ మనిషిగా ఉంటేనే కదా రౌడీలు మిమ్మల్ని చూసి భయపడతారని అలాంటి చోట్ల పోస్టింగు
ఇచ్చింది’ అని ఆశ్చర్యపోయారని సీతారామారావుగారు తన సహచరుడిని తలచుకుంటూ ఓ పాత
జ్ఞాపకం పంచుకున్నారు
(16-05-2021).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి