30, మే 2021, ఆదివారం

సంక్షేమానికి పెద్దపీట జగన్ రెండేళ్ళ పాలన

 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఓటమి అనుభవం నుంచి నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏమైనా గుణ పాఠం నేర్చుకున్నారా అంటే

 ఈ రెండేళ్ల పాలన తీరుతెన్నులు గమనించిన తర్వాత చప్పున ఔనని చెప్పడం కష్టం.

అయితే ఈ రెండేళ్లలో పాలనా సంబంధమైన విషయాల్లో ఆయన నవ్యత్వం   ఏమీ చూపించలేదా అంటే లేదు అని చెప్పడం కూడా కష్టమే.


అర్జునుడి దృష్టి పక్షి కన్ను మీద కేంద్రీకృతం అయినట్టు ఈ రెండేళ్లలో జగన్ మోహన రెడ్డి ధ్యాస, శ్వాస యావత్తూ తన ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలు మీదనే పెట్టారు. మేనిఫెస్టో తనకు ఓ భగవద్గీత, ఓ ఖురాన్, ఓ బైబిల్ అని పలుసార్లు ఆయనే స్వయంగా చెప్పుతూ వచ్చారు. అలానే చేస్తూ వచ్చారు. ఇది తప్పా ఒప్పా అంటే జవాబు వుండదు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రభుత్వాలను ఎలా తప్పు పట్టగలం? అలా అని,  అవే సర్వస్వంగా భావించి మిగిలిన అవసరాలను పక్కన పెడుతూ పొతే అభివృద్ది కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ఖజానాలో మిగిలే మొత్తమెంత? అభివృద్ధి లేని సంక్షేమం వల్ల రాష్ట్ర పురోభివృద్ధి ఎలా సాధ్యం? 

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు ఉన్నప్పటికీ నైతిక బాధ్యత మాత్రం లేదు. కారణం ప్రజలు ఆయన పెట్టుకున్న  ప్రాధాన్యతలు  గుర్తెరిగి, ఏరికోరి మరీ అధికారం ఒప్పచెప్పారు.


ప్రతి ప్రజాప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలు నిర్దేశించుకుంటుంది. అలా ఏర్పరచుకున్న ప్రాధాన్యతల ప్రకారం తనకు తాను దిశానిర్దేశం చేసుకుంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇందుకు మినహాయింపు కాదు.


అయితే వచ్చిన చిక్కల్లా ఎక్కడ అంటే సంక్షేమం, అభివృద్ధి అనే పదాలకు అన్వయం చెప్పుకోవడంలో ఎవరి పద్దతులు వారికి వున్నాయి. ఒకరి భాష్యాన్ని మరొకరు అంగీకరించరు.

‘పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే ముఖ్యమంత్రిగా నా కర్తవ్యమ్’ అని ఆనాడు ఎన్టీ రామారావు బహిరంగంగా ప్రకటించేవారు. అలా అమల్లోకి వచ్చినవే రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పధకాలు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సుదీర్ఘ కాలంలో పాలన కొత్త పుంతలు తొక్కింది. ఒక యువ ముఖ్యమంత్రిగా ఆనాడు అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకుని యువతరానికి ఒక ఆశాదీపికగా మారారు. ఇప్పటికీ వారిలో ఆ ఆరాధనా భావం చెక్కుచెదరకుండా వుంది.

ఆయన పరిపాలన ఫలితాలను, ఆయన ప్రాధాన్యతలను  ప్రజల్లో కొన్ని వయసుల వాళ్ళు, ముఖ్యంగా  యువకులు, మధ్య తరగతి, ప్రైవేటు ఉద్యోగ వర్గాల వాళ్ళు గుర్తించి గౌరవించారు. అభిమానించారు. ఇంకా ఆయనపట్ల వారిలో ఇలా పెంచుకున్న ఆరాధనా భావం అలాగే వుంది. అయితే ఆయనకు మాత్రం  రాజకీయంగా అచ్చిరాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదును అద్భుతంగా అభివృద్ధి చేసిన ఆయన కృషిని మునిసిపల్ ఎన్నికలలో ప్రజలు గుర్తించలేదని ఆయనే బాధ పడ్డారు. అభివృద్ధి అంటే పైకి కానవచ్చే రోడ్లు, సుందరమైన భవనాలు కాదని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. భుజానికి ఓ కంప్యూటర్ బ్యాగ్ తగిలించుకుంటే చాలు, ముఖ్యమంత్రిని సులభంగా కలవచ్చు అని ఎద్దేవా చేసాయి కూడా. ఆ అపప్రథ తొలగించుకోవడానికి ఆయన  2014 ఎన్నికలకు ముందు ‘నేను మారాను, నన్ను నమ్మండి’ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  

ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకుని గెలుపు సాధించాలి అంటే సంక్షేమమే తారకమంత్రం అని రాజకీయనాయకులు  నమ్మే పరిస్థితి వచ్చింది. దాంతో తమ తమ ఎన్నికల ప్రణాళికల్లో సాధ్యమైనన్ని తాయిలాలను దట్టించి వదలాల్సిన అవసరాన్ని అన్ని పార్టీలు దేశ వ్యాప్తంగా గుర్తించి అందుకు అనువైన పధకాలను ఆకర్షణీయమైన పేర్లతో రూపొందించే పనిలో పడ్డాయి.

ఈ క్రమంలో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మస్తిష్కంలో ‘నవ రత్నాలు’ పేరిట  రూపుదిద్దుకున్న  పధకం కూడా అటువంటిదే. తాను అధికారంలోకి రాగానే వాటిని తుచ తప్పకుండా అమలుచేస్తానని ఎన్నికల ప్రచార సభల్లో పలుసార్లు ఆయన ప్రజలకు హామీలు ఇస్తూపోయారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం, 2019 లో జరిగిన ఎన్నికల్లో కనీవినీ ఎరుగని ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తండ్రి, కొడుకుల(వై యస్ ఆర్, జగన్) చేతుల్లో ఓడిపోయిన రికార్డు చంద్రబాబు ఖాతాలో చేరింది.

జగన్ ఆ ఏడాది మే ముప్పయ్యవ తేదీన నూతన ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.  పూర్తిగా సంక్షేమానికి పెద్ద పీట వేసిన నవరత్నాలు హామీ ఆయన విజయానికి చాలావరకు దోహదం చేసివుండవచ్చు.  అయితే ఎన్నికల్లో జయాపజయాలకు సంక్షేమ పధకాలు అనే ఒక్క అంశమే కొలమానం కాదు. పాలక పక్షంపై ప్రజల్లో కలిగిన అసంతృప్తి అసహనంగా మారి, అసహనం ఆగ్రహంగా పెచ్చరిల్లి, ఆగ్రహం అవధులు ఎరుగని కసిగా రూపొందినప్పుడు ఎంతటి ప్రభుత్వాలయినా పేకమేడల్లా కుప్ప కూలుతాయి. ఈ కఠోర వాస్తవాన్ని జగన్ మోహనరెడ్డి ఖచ్చితంగా గమనంలో వుంచుకోవాలి. 


మొన్నీమధ్య ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో అనేక పధకాలకు కేటాయింపులు ప్రకటించినప్పుడు రెండేళ్లుగా ఇన్ని పధకాలు అమలవుతున్నాయా అని అనిపించింది. 

“నాడు, నేడు, జగనన్న విద్య దీవెన, వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ, జగనన్న వసతి దీవెన, వై.ఎస్.ఆర్. కాపునేస్తం. జగనన్న నేతన్న నేస్తం, లా నేస్తం, ఈ.బీ.సీ. నేస్తం, అమ్మ ఒడి, వై.ఎస్.ఆర్. చేయూత, వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా, జగనన్న గోరు ముద్ద, వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ, ఇలా ఎన్నో, ఎన్నెన్నో. ఇవన్నీ ఒకేసారి విన్నప్పుడు పేర్ల విషయంలో తొందరపాటుతనం కానవస్తుంది ఎవరికయినా. 

వీటిల్లో కొన్ని కొత్తవి ఉండవచ్చు, మరికొన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు పాత పధకాలకు కొత్త పేర్లు పెట్టి అమలు చేస్తున్నవి కావచ్చు. ఏవైనా ఒకటి మాత్రం ఒప్పుకుని తీరాల్సిన వాస్తవం. ప్రతి పధకానికి ఒక కాల నిర్ణయ పట్టిక పెట్టుకుని, నెలలు, తేదీల ప్రకారం ఒక పద్దతిగా ప్రతి పధకాన్ని అమలు చేస్తున్న మాట నిజం. సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాయి. ఆ వైతరణి దాటి, అధికారంలోకి రాగానే ‘బోడి మల్లయ్య’ సామెత మాదిరిగా వ్యవహరిస్తుంటాయి అనే అపప్రథ వుంది. కానీ జగన్ మోహన రెడ్డి ఈ ఒక్క విషయంలో పాత బాణీని పక్కన పెట్టి కొత్త బాట ఎంచుకున్నట్టుగా వుంది. 

సంక్షేమం సరే, అభివృద్ధి మాటలేమిటి అనే విపక్షాల విమర్సలకు ఆయన బడ్జెట్ సమావేశంలోనే అన్యాపదేశంగా ఇలా జవాబు చెప్పారు.

“అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాల నిర్మాణం కాదు, సమాజంలో అట్టడుగున ఉన్న పేదవాళ్ల కనీస అవసరాలను తీర్చడం కూడా అభివృద్దే”

తోకటపా : పూర్వం జనతా ప్రభుత్వ హయాములో మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా పనిచేసిన మధు దండావతే ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకు రైలు బోగీల్లో  రెండో తరగతి ప్రయాణీకులు నిద్రించడానికి చెక్కబల్లలు ఉండేవి. వాటికి మెత్తటి  కుషన్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించడంతో రైల్వే శాఖ వారు దేశ వ్యాప్తంగా  ఆ ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. రెండో తరగతి ప్రయాణీకులకు పెద్ద ఉపశమనం లభించింది. ఎంతగానో సంతోషపడ్డారు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఎప్పుడూ ఆ తరగతిలో ప్రయాణించని ఉన్నత తరగతుల వాళ్ళు ఈ మార్పులోని మంచిని గుర్తించలేకపోయారు. సమాజంలో వివిధ వర్గాల వారి మనస్తత్వాలు భిన్నంగా ఉంటాయనడానికి ఇదో ఉదాహరణ.  

(30-05-2021

కామెంట్‌లు లేవు: