14, మే 2021, శుక్రవారం

ఈద్ ముబారక్!


పుట్టిన తేదీ అంటే అధికారికంగా పదో తరగతి పాసు సర్టిఫికేట్ లో వున్న తేదీనే. అంచేత ఆ సర్టిఫికేట్ కు అదనపు విలువ.
ఆ రోజుల్లో నేను చదువుకున్న ఖమ్మం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వుండేది. ఆ సర్టిఫికేట్ కోసం నేను మొదటిసారి హైదరాబాదు వచ్చాను.
హిమాయత్ నగర్ బస్ స్టాప్ లో బస్సెక్కితే సీదా యూనివర్సిటీకి వెడుతుంది అని మా చుట్టం ఒకాయన చెప్పిన మాట ప్రకారం సిటీ బస్సు ఎక్కాను, నాకు గుర్తు ఉన్నంత వరకు మూడో నెంబరు అనుకుంటా. ఒక స్టాపు దాటిన తర్వాత కండక్టర్ టికెట్ టికెట్ అంటూ వచ్చాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఒక టికెట్ అంటే అతడు ఉర్దూలో నవ్వాడు. అంటే నవ్వుతూ ఉర్దూలో ఏదో అన్నాడు. నాకు అర్ధం కాలేదని తెలిసి, వచ్చే స్టాపులో దిగిపోయి ఎదురుగా వచ్చే ఇదే నెంబరు బస్సు ఎక్కమని చెప్పాడు. ఆ రోజుల్లో రోడ్ డివైడర్లు ఉండేవి కావు. బస్సు దిగి రోడ్డు అవతలకు వెళ్లి మళ్ళీ అదే నెంబరు బస్సు పట్టుకుని యూనివర్సిటీ చేరుకున్నాను. రోడ్డుకు రెండు వైపులా పచ్చని చెట్లు. ఎటు చూసినా పచ్చిక మైదానాలు. నున్నటి రహదారులు. అక్కడక్కడా వాటి నడుమ, చెట్ల చాటున కానవచ్చే భవనాలు. నా కళ్ళకు అది మరో నగరం మాదిరిగా అనిపించింది. ఖమ్మంలో నేను చదువుకున్న రికాబ్ బజార్ స్కూలు ఓ పెంకుటింట్లో వుండేది. అలాగే ఎస్సారార్ అండ్ బీజీఎన్నార్ కాలేజీ ఫుడ్ కార్పొరేషన్ రేకు గిడ్డంగులలో వుండేది. అక్కడ చదువుకున్న నాకు ఉస్మానియా వైభవం చూసి కళ్ళు తిరిగిపోయాయి.
వాళ్ళనీ వీళ్ళనీ అడిగి అడ్మినిస్ట్రేటివ్ భవనం చేరుకున్నాను. తల ఎత్తి చూస్తేనే కానీ ముఖ ద్వారం పైఅంచు కనబడేలా లేదు. ఎత్తైన మెట్ల వరుస మీదుగా వెడుతుంటే ఏదో రాజ భవనంలోకి వెడుతున్న అనుభూతి.
సంబంధించిన క్లర్క్ ను కలిసి వచ్చిన పని చెప్పాను. నేను అడిగే సర్టిఫికేట్ రెండేళ్ల పాతది. అప్పుడు కంప్యూటర్లు లేవు. పాత దస్త్రాలు తీసి వెతికి ఇవ్వాలి. కానీ ఆ గుమాస్తా, నేను బయట ఊరు నుంచి వచ్చానని అర్ధం చేసుకుని ఎంతో ఓపిగ్గా గాలించి ఆ దస్త్రం పట్టుకున్నాడు. సర్టిఫికేట్ చేతిలో పెట్టాడు. అతడికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు. చేతులు జోడించి షుక్రియా సాబ్ అన్నాను. అతడు నవ్వి, చలో భాయ్ చాయ్ తాగుదామని బయటకు తీసుకు వచ్చాడు. డబ్బులు అడుగుతాడేమో అనే సందేహం కలిగింది. కానీ అతడే పైసలు ఇచ్చి ఉస్మానియా బిస్కెట్లతో చాయ్ తాపించి, పాన్ తినిపించి భుజం మీద తట్టి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమన్నాడు.
ఆ విధంగా ఇద్దరు (కండక్టర్, క్లర్క్) హైదరాబాదు ముస్లింలతో నా తొలి పరిచయం సుహృద్భావంగా జరిగింది.
ఆ తర్వాత నా వృత్తి జీవితమే హైదరాబాదుకు మారింది. ఇన్నేళ్ళలో ఎంతోమంది ముస్లిం స్నేహితులు. ఒకరా ఇద్దరా ఎంతోమంది స్నేహంలో ఉన్న మధురిమను నాకు చూపించారు.
వారందరికీ, ఫేస్ బుక్ లో పరిచయం అయిన ముస్లిం సోదరులు అందరికీ “ఈద్ ముబారక్”
(14-05-2021)

కామెంట్‌లు లేవు: