10, మే 2021, సోమవారం

పేర్ల పురాణం

 ప్రభుత్వాలు మారినప్పుడల్లా పధకాల పేర్లు మారడం అందరికీ తెలిసిందే. పధకాలు కాకుండా ప్రభుత్వ శాఖల పేర్లు కూడా మారిపోవడం కూడా కొత్తేమీ కాదు.

మోడీ ప్రభుత్వం కేంద్రంలోని మానవ వనరుల అభివృద్ధి శాఖను విద్యా మంత్రిత్వ శాఖగా మారుస్తూ నిర్ణయించింది. సమగ్ర జాతీయ విద్యా విధానానికి రూపకల్పన చేసిన పిమ్మట దాని అమలుకోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ శాఖకు దాని పూర్వ నామమే దక్కింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి విద్యా మంత్రిత్వ శాఖగా ఉంటూ వస్తున్న ఈ శాఖ పేరును రాజీవ్ గాంధి ప్రధానమంత్రి అయినప్పుడు మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చారు. అప్పటికే అనేక కీలకమైన శాఖలు నిర్వహించిన పీవీ. నరసింహారావు గారిని ఈ శాఖకు మంత్రిని చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, పీవీ గారంతటి సీనియర్ కు ఇంతటి అప్రధాన శాఖ ఏమిటని. రాజీవ్ గాంధి ఆ శాఖ పేరును కూడా మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చారు. పీవీ గారు ఆ శాఖను ఎంత సమర్ధవంతంగా తీర్చిదిద్దారు అంటే చివరకు అది కేంద్ర ప్రభుత్వంలోని అతి కీలక మంత్రిత్వ శాఖల్లో ఒకటిగా మారిపోయింది.
ఇటువంటి ఘటనలు పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగాయి. సమాచార, పౌర సంబంధ శాఖను ఉన్నట్టుండి సమాచార, జన సంబంధ శాఖగా మార్చారు. అంటే పౌర అనే పదం తీసేసి జన అనే పదం చేర్చారు. కానీ రాజధాని నుంచి జిల్లాల వరకు ఆ శాఖ కార్యాలయాల బోర్డులను, లెటర్ హెడ్లను, ఆఖరికి అధికారిక స్టాంపులను మార్చాల్సి వచ్చింది.
మళ్ళీ చాలా కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభువులకు ఆ పేరు నచ్చలేదు. తిరిగి సమాచార, పౌర సంబంధ శాఖగా మారిపోయింది.
చిత్రం ఏమిటంటే ఆ శాఖ పేరులోనే పౌర సంబంధాలు. నిజానికి ఆ అధికారులు నెరిపేది పత్రికా సంబంధాలు.

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అనాదిగా వస్తున్న ఊళ్ళ పేర్లు, రోడ్ల / వీధుల పేర్లే మార్చేస్తుంటారు. ప్రభుత్వ శాఖల పేర్లు మార్చటం ఓ లెక్కా. అయితే ప్రభుత్వ విభాగాల పేర్లు మారిస్తే తడిసి మోపెడు ఖర్చు - మీరన్నట్లు ఊళ్ళల్లో ఆ ఆఫీసుల బోర్డులు, లెటర్ హెడ్లు, రబ్బర్ స్టాంపులు అన్నీ మార్చెయ్యాలి కదా. ఎవడబ్బ సొమ్మని?