5, మే 2021, బుధవారం

కాడి బరువు

 సంసారం నడపడానికి గృహస్తు ఎలా తంటాలు పడతాడో, ప్రభుత్వాలు కూడా అంతే! వాళ్లకి డబ్బులు ఆకాశం నుంచి రాలి పడవు. పన్నుల రూపంలో  ప్రజలనుంచే  వస్తాయి. ఆ సంగతి తెలుసు కాబట్టే  ఔరంగజీబు జిజియా పన్నుతో సరిపుచ్చితే, ఈనాటి ప్రజాప్రభుత్వాలు ఆయన్ని మించిపోయి ఆదాయ మార్గాలు కనుక్కుంటున్నాయి.  ఒడ్డున కూర్చొని నీతులు చెప్పే ప్రతిపక్ష రాజకీయ నాయకులు తాము అధికారంలోకి రాగానే ఇవే పనులు చేస్తారు. వాళ్ళకీ తెలుసు, మోసేవాడికి తెలుస్తుంది కాడి బరువు అని.

ఎన్ని చూడలేదు, ఎంతమందిని చూడలేదు?

అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామంటూ ఆర్భాటంగా హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు, గద్దె ఎక్కగానే ఆ వూసు ఎత్తవు. ఎందుకంటే, మద్యం వల్ల సంసారాలు చితికి పోయే మాట నిజమే కాని, నిషేధం విధిస్తే ప్రభుత్వాలు ఆర్ధికంగా దెబ్బ తింటాయనే నిజం వాళ్లకు తెలుసు కనుక. వాళ్ళు ఏ ఆట ఆడాలన్నా ముందు విత్తం వుంటేనే కద. ఖజానా నిండుగా వుంటేనే నడిచేది కధ.

ఏదైనా రాజకీయ పార్టీ అది అధికారంలో వున్నప్పుడు మద్యం అమ్మకాలకి తాము వ్యతిరేకం అంటే నమ్మే పరిస్థితి ఉందా! అసలు అలా అనగలవా, ఏదో ఎన్నికలు  దగ్గర పడితే తప్ప.

(ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్)అసెంబ్లీ రికార్డులు పరిశీలిస్తే 1968 జూన్ 26 వ తేదీన వావిలాల వారు చేసిన ప్రసంగం దొరికింది. (ఆయన మద్యానికి సంపూర్ణ వ్యతిరేకి)

 

ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ఏరియా) మద్య నిషేధం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ వావిలాల గోపాలకృష్ణయ్య గారు చేసిన ఈ ప్రసంగం అచ్చులో దాదాపు రెండు పేజీల పైన వుంది. విషయవిస్తరణ భీతితో దాన్ని కుదించాల్సి వచ్చింది.

వావిలాల వారు ఏమన్నారంటే:

 

మన జీవితమంతా రెండు నాలుకలలో నడుస్తున్నది. నిన్న మొరార్జీ దేశాయి గారు ఇక్కడకు వచ్చి ప్రొహిబిషన్ రద్దు చేయడానికి వీలు లేదన్నారు. ఈవేళ కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉన్న నిజలింగప్ప గారు ఇంకొక మాట చెబుతున్నారు. బెంగుళూరులో వారిని అడిగితె, ఇది శాంతి భద్రతలకు సంబంధించిన విషయం, సామాన్య ప్రజలు ఎంతవరకు శిరసావహిస్తారు అనే దృష్టితో చూడాలి. ఏమైనా ఇది రాష్ట్రాలకు సంబంధించిన విషయం అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొరార్జీ దేశాయి గారు ప్రొహిబిషన్ వల్ల కలిగే నష్టంలో సగం ఇస్తాం అంటున్నారు. అసలు డబ్బు ఎక్కడ వుంది?

“....కాంగ్రెస్ ఆదర్శాలతో వుండేవారు ఈనాడు బహిరంగంగా తాగడానికి పర్మిట్లు ఎందుకు ఇస్తున్నారు. తాగనిస్తారట. పర్మిషన్ లేకుండా తాగేవారిని జైల్లో పెడతారట. తెలంగాణలో ప్రొహిబిషన్ అక్కరలేదా. ఆంధ్రాకే కావాలా. ఇట్లా ఈ రెండు నాలుకల రాజ్యం ఎన్నాళ్ళు సాగుతుందో అర్ధం కావడం లేదు. నేను ప్రొహిబిషన్ కు అనుకూలుడను అనేది మాత్రం క్లియర్ గా చెబుతున్నాను. కానీ ఇప్పుడు ప్రొహిబిషన్ అమలు జరుగుతున్నది అంటే నన్ను నేను మోసగించుకోవడం, మిమ్ములను మోసగించడం తప్ప ప్రొహిబిషన్ ఎక్కడా లేదు. దీనివల్ల అధికారులు లంచగొండులవుతున్నారు. దాదాపు పన్నెండు దేశాలలో ప్రొహిబిషన్ అమలు చేసారు. ఆ దేశాలలో రాజ్యం ఎవరి చేతుల్లోకి పోయింది. బూటులిక్కర్స్ చేతికే పోయింది.

మోరల్స్ లేవు. బహిరంగంగా తాగుతూ వుంటే ఎదురుగా వుండి కూడ, కళ్ళు వుండికూడా మూసుకుని వ్యవహరిస్తున్నాము. అమలు చేయడానికి సమర్ధత లేకపోతె వదిలేయాలి. (ప్రొహిబిషన్) అమలు చేస్తారంటే సరిగా అమలుచేయాలి.

“... ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాలి. అమలు చేయడానికి సమర్ధత లేదంటారా ఏడుస్తూ ఒప్పుకుంటాము”

ఆ కాలంలో మద్య నిషేధం గురించిన వావిలాలవారి మధనం అది.

 

ఇక ప్రస్తుతానికి వస్తే,

నిరుడు కేంద్రం కరోనా విషయంలో కొత్త మార్గదర్శికాలు ప్రకటించగానే లిక్కర్ షాపులు ఓపెన్ చేయడానికి పచ్చ జండా వూపిన రాష్ట్రాలు ఇవే.

1. ఆంధ్రప్రదేశ్

2. ఉత్తరప్రదేశ్

3. పశ్చిమ బెంగాల్

4. మహారాష్ట్ర

5. ఛత్తీస్ గర్

6. కర్ణాటక

7. అసోం

8. హిమాచల్ ప్రదేశ్.

ఈ రాష్ట్రాలు ఏ పార్టీల పాలన కింద వున్నాయో విడమరిచి చెప్పక్కర్లేదు.

ఈ రాష్ట్రాల్లో అన్ని పార్టీల వాళ్ళు అధికారంలో వున్నారు.

కాబట్టి అందరూ అందరే. చొక్కాలు చించుకోనక్కరలేదు.

ఒక్కముక్కలో చెప్పాలంటే:

"మద్య నిషేధం రాజకీయ పార్టీలకి విజయ నినాదం

మద్యం అమ్మకం ఆ పార్టీల ప్రభుత్వాలకు ప్రాణాధారం"

తోకటపా:

రెండేళ్ల క్రితం (2019) ఎన్నికల ఫలితాల సమయంలో టీవీ విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఎనిమిదింటికి మొదలైన చర్చ అర్ధరాత్రి దాకా సాగింది. ప్రోగ్రాం అయిన తర్వాత నాతో పాటు పాల్గొన్న మరో విశ్లేషకుడు అడిగారు, ఈ టైములో ఎక్కడైనా బార్లు తెరిచివుంటాయా అని. ఆ రాత్రి అలాంటి బారు పట్టుకున్నామా లేదా అనేది వేరే విషయం.

మళ్ళీ ఒక  రోజు ఆయన ఓ టీవీ చర్చలో కనపడ్డాడు, 'ప్రభుత్వం మద్యం షాపులు తెరవడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే' అని బల్ల గుద్ది వాదిస్తూ.

(2021)

 

 

 

 

కామెంట్‌లు లేవు: