ఒకానొక కాలంలో జిల్లా మొత్తాన్ని తమ కనుసన్నల్లో శాసించే జిల్లా కలెక్టర్లకు తమ జిల్లాలో తిరగడానికి జీపు సౌకర్యం మాత్రమే వుండేది. అదీ టార్పాలిన్ పట్టాలు అటూ ఇటూ టపటపా కొట్టుకుంటూ వేళ్ళాడే పాతతరం జీపులు.
అలాటి కాలంలో, ఒకానొక జిల్లాలో, కలెక్టర్ గా పనిచేస్తున్న ఓ ఐ.ఏ.ఎస్. అధికారి జీపు తీసుకుని ఓ రోజు ఉదయం ఏదో గ్రామానికి టూరుకు వెళ్లి తిరిగి వస్తుంటే జీపు టైరు
పంక్చర్ అయింది. సెల్ ఫోన్లు లేని రోజులాయె. డ్రైవర్ పంక్చర్ వేయించుకుని
రావడానికి కొన్ని మైళ్ళ దూరంలో వున్న మరో పెద్ద వూరికి వెళ్ళాడు.
కలెక్టర్ గారి వెంట వున్న బిళ్ళ బంట్రోతు, అయ్యగారికి చెట్ల
నీడన వున్న ఒక మోరీ చూపించి అక్కడ కూర్చోపెట్టాడు. డ్రైవర్ రావడానికి బాగా వ్యవధి
వుంది. అటూ ఇటూ చూస్తున్న కలెక్టర్ గారి
దృష్టికి దగ్గరలో ఓ వూరు జాడ కనిపించింది. కొందరు ఆడవాళ్ళు బిందెలు చంకన పెట్టుకుని
వస్తూ కానవచ్చారు. ఆయన వారిని పలకరించి, 'నీళ్ళ కోసం ఇంత దూరం ఎందుకు పడుతూ లేస్తూ వస్తున్నారు, మీ వూళ్ళో మంచి
నీటి బావి లేదా?' అని ప్రశ్నించారు. 'నువ్వేమన్నా ఆర్చేవాడివా, తీర్చేవాడివా' వంటి చొప్పదంటు ప్రశ్నలు వాళ్ళు వేయకుండా, 'వూళ్ళో బావులకేం
చాలా వున్నాయి, కానీ మమ్మల్ని అక్కడ నీళ్ళు తోడుకోనివ్వరు' అని బదులు
చెప్పారు. కలెక్టర్ సాలోచనగా తలపంకించి ఊరుకున్నారు. ఈలోగా టైరు పంక్చర్
వేయించుకుని డ్రైవర్ తిరిగివచ్చాడు.
కలెక్టర్ తన మానాన తాను పొతే కధే లేదు. ఆయన అల్లాంటి ఇల్లాంటి అధికారి కాదు
కాబట్టి ఏం చేయాలో వెంటనే ఆలోచించి పెట్టుకున్నాడు. డ్రైవర్ ని నేరుగా జిల్లా కేంద్రానికి పంపించి తాను ఆ మోరీ మీదనే కూర్చుండిపోయాడు. ఈలోగా ఆయన
మౌఖిక ఆదేశాలు అందుకున్న కలెక్టర్ గారి సిబ్బంది, స్థానిక
తాసిల్దారు టైప్ రైటర్లు, కలెక్టర్ గారి అధికారిక ముద్రిక తదితరాలతో సహా అక్కడికి వచ్చారు. ఊళ్ళోకి
కబురు పంపి గ్రామ సర్పంచుని రప్పించారు. ఈ హడావిడి అంతా చూసి ఊరిజనం అంతా అక్కడ
పోగయ్యారు. వూరి వెలుపల నుంచి మంచి నీళ్ళు తెచ్చుకునే వారికి వారి గూడెం లోనే ఒక
మంచి నీటి బావి మంజూరు చేయాలని సర్పంచు నుంచి ఓ
అభ్యర్ధన పత్రం తీసుకున్నారు. దానికి అక్కడికక్కడే స్థానిక అధికారి నుంచి ఆమోద
ముద్ర వేయించారు. తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకుంటూ అందుకు అవసరమైన నిధులను
తక్షణమే మంజూరు చేస్తూ ఆ మోరీ మీదనే కూర్చుని సంతకం
చేసి, కింద స్టాంపు వేసారు. ఆ వెనువెంటనే కూలీలను పిలిపించారు. బావి తవ్వకానికి ఆయనే స్వయంగా గడ్డపారతో మొదటి పలుగు
వేసి స్వీకారం చుట్టారు. ఝాము పొద్దెక్కక ముందే ఝామ్మని బావి పని మొదలయింది.
అంతకుముందు ఆ ఊరిజనం ఇలాటి అధికారిని చూడలేదు సరికదా కనీసం వినికూడా వుండలేదు.
అందుకే అందరి మొహాల్లో నిండుకున్న నిబిడాశ్చర్యం. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో
వారి వూరిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శుభారంభం జరిగింది. పొద్దుగూకే సమయానికి
బావిలో సమృద్ధిగా జలపడింది. ఆ వూరి గూడెం జనానికి కొత్త పొద్దు పొడిచింది.
ఆ జిల్లా ఖమ్మం
జిల్లా. ఆ వూరు రెబ్బారం అని అందరూ పిలుచుకునే రెబ్బవరం. ఆ కలెక్టర్ గారి పేరు
ఆర్. పార్ధసారధి. ఆయన ఇప్పుడు జీవించి లేరు. కానీ ఆ గూడెం
ప్రజల మనస్సులో ఇంకా జీవించే వున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి