13, మే 2021, గురువారం

ఆవకాయ కారాల సీజన్

 

“కాయ రూపాయ్ అయ్ పొతే, ఆవకాయను పెట్టుటెలా!
కూరనార లేనిరోజున బడికి పిల్లల పంపుటెలా!”

అప్పుడెప్పుడో 1975లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేను రాసిన రోజువారీ వాక్టూన్లలో ఒక పంక్తి ఇది.

2018లో, కారణం తెలవదు, ఎప్పుడూ ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెట్టే అలవాటు బొత్తిగా లేని నేను మొట్టమొదటిసారి ఆవకాయ కారాల కార్యక్రమంలో చేయి పెట్టడమే కాదు, యావత్తు బాధ్యతను నేనే నెత్తిన వేసుకున్నాను. ఏడాది తర్వాత మీకెట్టాగు తప్పదులే అనుకుందో ఏమో, మా ఆవిడ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తాను పక్కన కూర్చుని సూచనలు చేస్తుంటే నేను ఆ క్రతువును దిగ్విజయంగా పూర్తి చేశాను. (వెనుకటి రోజుల్లో అంటే మాతండ్రి, తాతల కాలంలో మొగవాళ్ళే ఈ బాధ్యత నిర్వర్తించేవారని విన్నాను)
కారాలు కలుపుతున్న చేతులు కాబట్టి నేను ఫోటో తీయలేకపోయాను. ఫోటోలు అంటే ఇష్టపడదు కనుక తను తియ్యలేదు. ఏతావాతా జరిగింది ఏమిటంటే నా జీవితంలో మొట్టమొదటిసారి ఇంటి పనుల్లో మా ఆవిడకు సాయం చేశాను అనే దానికి ఒకే ఒక్క రుజువు అంటూ లేకుండా పోయింది. అది నిజంగా నా దురదృష్టం. అమూల్యమైన, అపురూపమైన ఇటువంటి జ్ఞాపకాలు మనసులోనే దాచుకోవాలని రాసిపెట్టి వుంటే ఏం చేస్తాము చెప్పండి.

ఇక ప్రస్తుతానికి వస్తే, మొన్నీమధ్య మా మేనల్లుడు కొమరగిరి రామచంద్రం భార్య శ్రీమతి కరుణ ఓ సీసాలో మామిడికాయ కారం పెట్టి పంపింది. ఆవిడ వంటలు, పిండి వంటల్లో అందెవేసిన చేయి. ‘బాగుంది! ఎలా పెట్టారని ఆరా తీస్తూ, రాసి పంపితే నలుగురికీ పనికి వస్తుందన్నాను. అదన్న మాట ఇది:

ఆవకాయ కారం ఎలా పెట్టాలి? – శ్రీమతి కొమరగిరి కరుణ
ఓ చిన్న కుటుంబానికి పాతిక కాయలు ఎక్కీతక్కీ.
చిన్న రసాలు కానీ, తెల్ల గులాబీ రకం కానీ తీసుకోవాలి.
ఇరవై అయిదు కాయల కారానికి కావాల్సినవి:
కిలో కారం, నాలుగు కిలోల పప్పు నూనె, ముప్పావు కేజీ ఆవపిండి, దంచిన ఉప్పు ముప్పావు కేజీ, మంచి శనగలు వంద గ్రాములు.
ముందుగా పచ్చి మామిడి కాయలను బకెట్ నీళ్ళలో వేసి బాగా కడిగి తడి లేకుండా తుడిచి వాటిని టెంకె ఉండేలాగా ముక్కలుగా కొట్టించుకోవాలి. తర్వాత మళ్ళీ వాటిని శుభ్రంగా తుడిచి, జీడి, పొర తీసివేయాలి.
తరువాత ఓ లీటరు వేడి నీళ్ళు మరగబెట్టి, చల్లార్చి వుంచుకోవాలి. ఒక బేసిన్ తీసుకుని ఆవపిండి మొత్తం వేసి చల్లారిన నీళ్ళతో ఆవపిండిని గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. (కొన్ని ప్రాంతాలలో నీళ్ళు కాకుండా ఏకంగా పప్పు నూనెతోనే ఆవపిండిని కలిపే ఆచారం వుంది)
ఎంత ఎక్కువసేపు కలిపితే అంత ఘాటు వస్తుంది. ఓ పది నిమిషాలు ఆగి, అందులో కారం, ఉప్పు కొద్దిగా తగ్గించి వేసి కలపాలి. ఒక లీటరు నూనెను, శనగలను ఆ మిశ్రమంలో వేసి కలపాలి. తడి లేకుండా తుడిచిన జాడీని దగ్గర పెట్టుకుని ముక్కలకు ఆ పిండి బాగా అంటేలా చూసుకుంటూ జాడీలో వేసుకోవాలి. జాడీ నిండిన తర్వాత ఆ మొత్తం పచ్చడిని చేతులతో అదిమి పెట్టాలి. జాడీ పైన తెల్లటి శుభ్రమైన వస్త్రంతో వాసిన కట్టాలి.
మూడు రోజులు అలా ఉంచేసి, పెద్ద బేసిన్ లో జాడీలోని మొత్తం ముక్కల కారాన్ని వేసి అందులో మిగిలిన నూనె మొత్తం వేసి బాగా కలపాలి. రుచి చూసి, ఉప్పు అవసరం అనుకుంటే కలపాలి. తర్వాత ఆవకాయ కారం మొత్తం జాడీలోకి ఎక్కించి మూత పెట్టి, ఏమాత్రం తడి తగలకుండా భద్రం చేసుకోవాలి.
రోజువారీ అవసరాలకోసం కొద్దికొద్దిగా జాడీ నుంచి తీసి చిన్న చిన్న గాజు సీసాల్లో వుంచుకోవాలి. వాటిని ఫ్రిజ్ లో ఉంచితే ఆవకాయ ఘాటు, రంగు కొన్ని నెలల పాటు అలాగే వుంటుంది.

వెల్లిపాయ కారం

కారానికి కూడా చిన్న రసాలు, కానీ తెల్ల గులాబీ రకం మామిడికాయలు కానీ బాగుంటాయి.

కావాల్సినవి:

మామిడికాయలు పాతిక, (ముక్కలు చేసి జీడి, పొర తీసి పొడిగా వుంచుకోవాలి), ఎర్ర కారం: ఒక కిలో, మెంతులు: పావు కేజీ, ఉప్పు: ముప్పావు కేజీ, ఆవపిండి: పావు కేజీ, ఎండలో వుంచి  పొట్టు వలిచిన వెల్లిపాయలు : అర కేజీ, పప్పు నూనె: మూడు కేజీలు

ముందుగా మెంతులను, నూనె లేకుండా ఎర్రగా వేయించు కోవాలి. కమ్మటి వాసన వస్తే బాగా వేగినట్టు గుర్తు. అవి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. వెల్లిపాయల్లో కొంత అంటే ఓ చిన్నగ్లాసుడు విడిగా తీసి గ్రైండర్ లో వేసి నీళ్ళు కలపకుండా పేస్టుగా చేసుకోవాలి.

ఒక బేసిన్ తీసుకుని అందులో  కారం, మెంతి పిండి, ఆవ పిండి, వేసి కలపాలి. సిద్ధంగా ఉంచుకున్న ఉప్పులో సగం మాత్రమే ఈ మిశ్రమంలో కలపాలి. అందులో వెల్లుల్లి పేస్టుతో పాటు మిగిలిన వెల్లుల్లి రెబ్బలను వేసి, ఒక లీటరు నూనె వేసి కలపాలి. అందులో మామిడికాయ ముక్కల్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ పిండి ముక్కలకు బాగా అంటేలా కలిపి జాడీలోకి తీసుకోవాలి. గట్టిగా అదిమిపెట్టి వుంచి తర్వాత ఆ జాడీకి తెల్లటి గుడ్డతో వాసెన కట్టాలి. మూడు రోజులు అలాగే వుంచి తర్వాత జాడీలోని  మొత్తం కారాన్ని ఓ బేసిన్ లోకి తీసుకుని తిరగ కలపాలి. కనపడకుండా జాడీలో నూనె నింపాలి. అప్పుడు ఉప్పు రుచి అవసరం అనుకుంటే వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకుని పచ్చడి కనపడకుండా నూనె నింపి వాసెన కట్టి భద్రపరచుకోవాలి.   

(ఇంకో రోజు మరో కారం గురించి)

కామెంట్‌లు లేవు: