23, మార్చి 2021, మంగళవారం

నాలుకే నా శత్రువు - భండారు శ్రీనివాసరావు

 'మీకు శత్రువులు ఎవ్వరూ లేరా స్వామీ?' అని అడిగాడు ఓ ఆసామీ ఓ స్వామివారిని.

'లేకేం! నా నాలుకే నా శత్రువు' అన్నారా స్వామి.

తరచి చూస్తె అందులో ఎంతో నిజం వుందని అనిపిస్తుంది.

ఆ మధ్య ఎప్పుడో  అనుకోకుండా ఓ స్వామి వారి ప్రవచనం నా చెవిన పడింది.

ఆయన కంఠం కంచుగంట. చెప్పే విషయం ఏదయినా ఓ కధలా వినసొంపుగా వుంటుంది.

భార్యాభర్తల సంబంధాలు, విడాకుల ప్రస్తావన దొర్లింది. స్వాములేమిటి? విడాకుల గొడవేమిటి అనుకునేవాళ్ళకు ఆయన ప్రసంగమే సమాధానం. క్రమంగా  దేశంలో విడాకుల కేసులు  వేగంగా పెరిగిపోతాయని స్వామి ఉవాచ. మరి ఏమిటి మార్గం?

ఉందన్నారు ఆయనే. నాలుకను అదుపులో ఉంచుకోవడం ఒక్కటే శరణ్యం ఆన్నారాయన. సరిగ్గా ఇలాగే కాకపోయినా దాదాపు ఇదే అర్ధం వచ్చేలా చెప్పారు.

'మొగుడొకటి అంటాడు. భార్య ఒకటి అంటుంది. ఆ ఒక్కటే విడాకులదాకా వెడుతోంది. వెనుకటిలా ఈనాటి తరానికి మంచీచెడూ చెప్పీవాళ్ళు ఇళ్ళల్లో వుండడం లేదు. చెప్పినా వినిపించుకునే పరిస్తితి లేదు. చిన్న విషయాలు పెద్దవి అవుతున్నాయి. మునుపటి రోజుల్లో కూడా ఇలా జరక్కపోలేదు. కానీ కుటుంబ సంబంధాలు కట్టి పడేసేవి. ఇప్పుడలా కాదు. అప్పటికప్పుడే వేడి మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే కాస్త నాలుకను అదుపులో పెట్టుకుంటే ఇలాటి సమస్యలు అన్నీ అదుపులోకి వస్తాయి. లేకపోతే అదుపుతప్పి పోతాయి'

స్వామి వారు చెప్పింది అందరూ విన్నారు. బాగా చెప్పారు అని కూడా అనుకున్నారు. ఆ హితవచనాలను ఇంటిదాకా ఎంతమంది మోసుకెళ్లారన్నది అనుమానమే.

నేనూ దీనికి మినహాయింపు కాదని ఓ చర్చలో కూర్చున్నప్పుడు తెలిసిపోయింది.

నా నాలుకే నా శత్రువు. నిజానికి ఈ శత్రువును జయించాల్సిన పనిలేదు. స్వామి చెప్పినట్టు అదుపులో వుంచుకుంటే చాలు.

కానీ అయ్యే పనా!

 

3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నాలుకా వీపుకు దెబ్బలు తేకే ... అనే సామెత అయితే ఉండనే ఉంది కదా. నాలుకను అదుపులో పెట్టుకోవడం ఎప్పుడు శ్రేయస్కరమే.
ఈ కాలంలో విడాకుల కేసులు ఎక్కువవడానికి సర్దుకిపోవడం అన్నది కరువవటంతో బాటు నా అభిప్రాయంలో మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి. మహిళలల్లో విద్యాధికుల శాతం పెరగటం, ఆర్థిక స్వాతంత్ర్యానికి అవకాశాలు లభ్యమవటం. సరే అహంకారపు ప్రవర్తనను ఎగతోయటానికి సినిమాలు, టీవీ మీడియాలు తమవంతు కృషి ఎలాగూ చేస్తున్నాయనుకోండి.

అజ్ఞాత చెప్పారు...

విడాకులు కేసులు ఎక్కువ అవడానికి కారణం , తాగుబోతు భర్త లని , తిరుగుబోతు భర్తలని భరించే అవసరం నేటి మహిళకి లేకపోవడం . పూర్వం రోజుల్లో అయితే , మొగుడు ఎంత వెధవ అయినా సర్దుకుపొమ్మని ఇంట్లో చెప్పేవాళ్ళు , ఇప్పుడు ఆ అవసరం లేకపోవడం . స్త్రీ లు చదువుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు కాబట్టి . అంతే కానీ సీరియల్స్ సినిమాలు కాదు .

అజ్ఞాత చెప్పారు...

నిజం చెప్పలేని నాలుకేల.
నిజం చెప్పొద్దనే అహంకార శునకాలకు.. తగిన రీతిలో కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు సమాధానం చెప్పాలి.
మిగిలినవి తరువాత చూసుకోవచ్చు. ఇక్కడెవడూ తోపు కాదు, ఎదురు లేనోడు అంతకన్నా కాదు. ఎవడన్నా అలా విర్రవీగితే చుక్కలు చూపించాల్సిందే.

అదుకే నాలుకా.. ఈకుక్కలకి సరైన సమాధానం చెప్పవే అన్నట్టుగా ఉండాలండి. లేకపోతే బతకలేం .. ఈ కుక్కల మొరుగుడు మరీ ఎక్కువైపోతుంది.