19, ఆగస్టు 2016, శుక్రవారం

మారుతున్న తరాలు

మారుతున్న తరాలు

“తనకు అందరూ తెలుస్తారు. కానీ తనెవరో అందరికీ  తెలియదు.
అందర్నీ తను గుర్తుపడతాడు, గుర్తుంచుకుంటాడు, కానీ తానెవరో వారికి గుర్తుండకపోవచ్చు.”
ఈ పొడుపు కధకు సమాధానం ‘జర్నలిష్టు’. మరీ ఖచ్చితంగా చెప్పాలంటే మాజీ జర్నలిష్టు. అంటే రిటైరయిన జర్నలిష్టు.
అతడికి ఎప్పటికీ మిగిలేవి జ్ఞాపకాలే.
జర్నలిష్టుగా వున్న రోజుల్లో వృత్తి రీత్యా  అనేకమందితో ముఖపరిచయం సహజం. మరి  కొందరితో అతి పరిచయం కూడా అంతే సహజం.
బాగా పాత తరానికి చెందిన జలగం వెంగళరావు, అంజయ్య, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, రోశయ్య మొదలయిన వారితో చాలా సాన్నిహిత్యం వుండేది.  మరో ముగ్గురు ముఖ్యమంత్రులు  చంద్రబాబు, వైయస్సార్ లతో  చెప్పుకోదగ్గ పరిచయం వుండేది. కేసీఆర్ గతంలో మంత్రిగా వున్నప్పుడు మిగిలిన జర్నలిష్టులతో పాటే నాకూ ఆయనతో మంచి పరిచయమే వుండేది.
వీరి వారసులు, నేటి తరం యువ నాయకులు  జగన్, కేటీఆర్, లోకేష్ లతో ముఖ పరిచయం కాదుకదా ఎన్నడూ ఎదురుపడి  కలుసుకోవడం కూడా జరగలేదు. ప్రెస్ క్లబ్ పుణ్యమా అని కేటీఆర్ ని ఓసారి  కలిసాను. జగన్ మోహన రెడ్డిని  టీవీల్లో చూడడమే.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు లోకేష్ చిన్న పిల్లవాడు. జూబిలీ హిల్స్  లోని  వాళ్ళ ఇంటికి  తరచూ వెడుతూ వున్న రోజుల్లో బయట  కనబడేవాడు. పెద్దయి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కలిసే సందర్భం ఎన్నడూ  తారసపడలేదు.
రాత్రి జనార్ధన్ అమ్మాయి పెళ్ళిలో కనబడ్డారు. టీడీపీ నాయకుడు  దినకర్, ఎన్టీవీ రుషినీ, నన్నూ  పలానా అని ఆయనకి పరిచయం చేశారు.
అంత హడావిడిలో కూడా ఆయన మా దగ్గర కాసేపు  ఆగి,  ‘అమరావతికి ఎప్పుడు వస్తున్నారు అని రుషిని ప్రశ్నిస్తూ  నా వైపు చూసి, టీవీ ఎనలిష్టు  అంటూ చిరునవ్వుతో పలకరించి ముందుకు వెళ్ళిపోయారు.
మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన రేడియో, డీడీ ‘చెవులు’ ఎటుపోయాయో, కొత్తగా వచ్చిన ఈ టీవీ ఎనలిష్టు ‘కొమ్ములు’ ఏవిటో! ముందు బోధపడలేదు.
ఆలోచిస్తే  అర్ధం అయింది. నిజమే. నేనూ  ఇలా ప్రవర్తించిన వాడినే.
నాకంటే  పాతతరం వాళ్ళు  ఎప్పుడూ నాగయ్య, నారాయణరావు, శ్రీ రంజని గురించి మాట్లాడుతుండేవాళ్ళు. అప్పటికే ఏ యెన్ ఆర్, ఎన్టీఆర్  తరం వచ్చేసింది. నాగయ్య  అనగానే  మంచం మీద దగ్గుతూ, గెడ్డం నెరిసిన మనిషే  కళ్ళల్లో మెదిలేవాడు. గతంలో ఆయన తారాపధంలో  ఓ వెలుగు వెలిగిన సంగతులు  మా  పాత తరం వాళ్లకు  తెలుసు కానీ  మాకు తెలియవు. అలాగే  నేటి తరం అస్తమానం తలచుకుండే తారలని  సినిమాల్లో చూసినా  గుర్తు పట్టలేని  పరిస్తితి  మా తరానిది.
ఈ సత్యం బోధపడితే  తరాల  అంతరాల్లో తేడాలని సరిగ్గా అర్ధం చేసుకోవచ్చు. లేకపోతే మిగిలేవి అపార్ధాలే!       


2 వ్యాఖ్యలు:

Mk Sarma చెప్పారు...

'గతం నాస్తి కాదు - అది అనుభవాల ఆస్తి' అన్నారు. ఒకరిద్దరు మిమ్మల్ని గుర్తించలేకపోతేనేం, ఒక సీనియర్ పాత్రికేయునిగా, కాలమిస్ట్ గా, ఒక మంచి బ్లాగర్ గా, అన్నిటికి మించి అనుభవజ్ఞునిగా చాలా మందికి మీ గురించి తెలుసు.

- యంకే శర్మ

అజ్ఞాత చెప్పారు...

One has to come to terms with the reality. Recognition, name and fame are ephemeral.