21, ఆగస్టు 2016, ఆదివారం

మరపురాని మనిషి మా పెద్దన్నయ్య పర్వతాలరావు


 మా పెద్దన్నయ్యకీర్తిశేషులు  భండారు పర్వతాలరావు చాలా సంవత్సరాలక్రితం ఒక వ్యాసం రాసారు. డబ్బు కావాలాదరిద్రం పోవాలా అనేది దాని శీర్షిక.
“ఒకానొక గర్భ దరిద్రుడు దేవునిగూర్చి గొప్ప తపస్సు చేస్తాడు.
ఆయనప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. భక్తుడు తన పరిస్తితి చెబుతాడు.
దేవుడప్పుడు చిరునవ్వు నవ్వి, ‘’డబ్బు కావాలా ? దరిద్రం పోవాలా ?’ అని అడుగుతాడు.
దాంతో భక్తుడికి కళ్ళు తెరిపిళ్ళు  పడతాయి.
దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కాదుడబ్బున్న దరిద్రులు కూడా లోకంలో చాలామంది వున్నారు. వాళ్ళకంటే తానే మిన్న అని తెలుసుకుంటాడు.


మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు పుట్టపర్తిలో వుండగా అనేక రచనలు చేస్తూ పోయారు. వాటిల్లో ఒకటి దశావతారాలు. వారి చిన్నమ్మాయి వాణి వెల్దుర్తి, రాతప్రతిని చిన్ని పొత్తంగా తయారు చేసి, కుటుంబ సభ్యులకు స్వయంగా ఇంటింటికీ వెళ్లి పంచి పెట్టింది. విషయంలో వయస్సులో చిన్నదయినా తను పడ్డ శ్రమదమాదులు ప్రసంశనీయం. మళ్ళీ మనమధ్యకు నాన్న వచ్చారంటూ  చిరంజీవి వాణి తన ముందు మాటగా నుడివిన మాటలు:
చిన్నప్పుడు తాతయ్య తద్దినానికి కంభంపాడు వెళ్ళినప్పుడు నాన్న వరండాలో కూర్చుని మాట్లాడుతుంటే వూళ్ళో ఎంతో మంది వినడానికి వచ్చేవారు. నాన్న ఎవరి అభిరుచికి తగ్గట్టు అంశం వారితో ముచ్చటి పెడుతుంటే వినేవాళ్ళు అయస్కాంతంలా అతుక్కుపోయి వింటూ వుండేవాళ్ళు. నాన్న మాట్లాడే మాటల్లో రెండు విషయాలు చోటు చేసుకునేవి కావు. అవే: ఆత్మస్తుతి, పరనింద.
ఆదర్శాల నయాగరాల కన్నా, ఆచరణల హిమబిందువు మిన్న అని నమ్మిన మరువలేని, మరపురాని వ్యక్తి నాన్న. నాన్న దశావతారాలు పుస్తకంతో మళ్ళీ మన మధ్యకు వచ్చాడు.
చిన్ని పొత్తానికి ముఖచిత్ర అలంకరణ చేసింది రాంపా 
అయిదుగురు ముఖ్యమంత్రులకు  పీఆర్ ఓ గా పనిచేసి, ఉమ్మడి రాష్ట్రంలో  పౌరసంబంధాల శాఖ డైరెక్టర్  గా,  ఫిలిం  డెవలప్  మెంట్  కార్పొరేషన్  మేనేజింగ్  డైరెక్టర్  గా  పనిచేసిన మా పెద్దన్నయ్యకు  అనేకరంగాల వారితో  సన్నిహిత  పరిచయం వుండేది. చాలామంది ఆయనకు తెలుసు, ఆయనకూ చాలామంది తెలుసు. కానీ,  ఆయన ఈ లోకంలో లేరన్న సంగతి వారిలో చాలామందికి తెలవదు. ఇప్పటికీ  నేను సచివాలయానికి వెడితే లిఫ్ట్  బాయ్  నుంచి  పెద్ద అధికారుల వరకు అడుగుతుంటారు, మీ  అన్నగారు ఎలావున్నారని? అంత నిశ్శబ్దంగా ఆయన దాటిపోయారు. ఆయన లేరన్న  భావం  మా ఇంట్లో ఎవ్వరికీ లేదు కాబట్టి నిజం చెప్పలేకా, అబద్ధం ఆడలేకా  ఒక నవ్వు నవ్వి  తప్పుకుంటూ వుంటాను. 
“ఎన్నడయినా చూసారా 
ఆయన మొహంలో చిరునవ్వు చెరగడం 
ఎప్పుడయినా గమనించారా 
అన్ని బాధలుఅందరి వ్యధలు
గుండెల్లో దాచుకోవడం 
బాధ్యతలన్నీ మోసీ మోసీ 
చిన్ని గుండె అలసిపోయింది
అంతులేని దూరాలకు  
అన్నయ్యని తీసుకుపోయింది
అనాయాస మరణం 
దేవుడిచ్చే అభయం  
నిజమయిన భక్తుడు కనుకే 
అన్నయ్యకు దక్కిందా వరం                       

( మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు పుట్టపర్తిలో 2006 ఆగస్టు 21 నాడు  ఆకస్మికంగా మరణించినప్పుడు  రాసిన అశ్రుగీతిక  - భండారు శ్రీనివాసరావు)    

      




కామెంట్‌లు లేవు: