అనగనగా ఒక నయా నయీం. అడ్డదారుల్లో సంపాదించిన మొత్తంలో ఒక పెద్ద మొత్తాన్ని ఒకడి దగ్గర
దాచిపెట్టాడు. ఏళ్ళు గడుస్తున్నా డబ్బు సంగతి మాట్లాడకపోవడంతో ఏం చెయ్యాలన్న ఆలోచనలో పడ్డాడు
నయీం. మరో చిక్కేమిటంటే ఇచ్చిన డబ్బుకు లెక్కాపత్రం లేకపోగా,ఆ డబ్బు దాచినవాడికి పుట్టచెవుడు.
యెంత గట్టిగా అరచి భయపెడదామన్నా ఒక్క ముక్క వినపడదు.
డబ్బు వసూలుకి నయీం ఓరోజు స్వయంగా కదిలాడు. చెవిటి వాళ్ళతో సంభాషించడానికి
వీలయ్యే సైగల భాష తెలిసిన ఒక లాయర్ని తన వెంటతీసుకు వెళ్ళాడు. వెడుతూ వెడుతూ వెంట ఏకే ఫార్టీ సెవెన్ కూడా వెంటబెట్టుకు వెళ్ళాడు.
పోగానే అడిగాడు డబ్బు ఎక్కడ వుందో
చెప్పమని. ఆ మాట వినబడక అతగాడు అదే విషయం అదే మొహం పెట్టి మరీ చెప్పాడు. వెంటవచ్చిన దుబాసీ వకీలు అదే మాటనయీం చెవిలో ఊదాడు. నయీం కి ఒళ్లుమండింది. తానే
స్వయంగా వచ్చి అడుగుతున్నా లెక్కపెట్టని అతడి వ్యవహారం అతడికి సుతరామూ నచ్చలేదు.
మరో మాట లేకుండా ఏకే ఫార్టీ సెవెన్ తీసి గురిపెట్టాడు.
‘డబ్బు ఎక్కడ దాచిందీ చెప్పకపోతే
పిట్టను కాల్చినట్టు కాల్చేస్తాన’ని హెచ్చరించాడు.
లాయరు అదే విషయం అవతలవాడికి అర్ధం
అయ్యేట్టు సైగలతో చెప్పాడు.
‘ఉత్త పుణ్యానికి ప్రాణాలు పోగొట్టుకోకు,
వీడు మానవరూపంలో వున్నరాక్షసుడు. అన్నంత
పని చేస్తాడు’ అని హెచ్చరించాడు.
‘కాస్త ఆగండి. డబ్బు ఎక్కడ దాచిపెట్టింది
చెబుతాను. ఇక్కడికి మూడో ఇంట్లో మా బావమరది ఉంటాడు. డబ్బు అంతా నల్ల రంగు
సూటుకేసులో పెట్టి పెరట్లో కొబ్బరి చెట్టు దగ్గర గొయ్యి తవ్వి పాతిపెట్టాను. ఆ
సంగతి మా బావమరదికి కాదుకదా మూడోకంటికి కూడా
తెలవదు ” అన్నాడు.
“ఏమంటున్నాడు వాడు, డబ్బు దాచిన చోటు గురించి ఏమైనా చెప్పాడా”
అడిగాడు నయీం లాయర్ని.
‘అబ్బే ఎక్కడండీ, మొండిముండావాడులా వున్నాడు. భయపడకపోగా దమ్ముంటే కాల్చి చంపమని ఎదురు సవాలు చేస్తున్నాడు, మీ పని
కానివ్వండి మరి.’ అన్నాడు లాయరు నయీంతో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి