శ్రీ పీఠంతో కృష్ణా పుష్కర యాత్ర
మా చిన్న తనంలో మా బావగారు కొమరగిరి వెంకటప్పారావు
గారు ‘ముముక్షువు’ అనే ఒక ఆధ్యాత్మిక పత్రిక తెప్పించేవారు. చాలా విషయాలు అర్ధం అయ్యీ
కానట్టుగా ఉండేవి. అర్ధం చేసుకోవాలనే
తాపత్రయం వున్నా, మనసు మరో వాటి మీదకు లాగేది. ఒకటి మాత్రం నిజం. ఈనాటికీ కొన్ని ఆధ్యాత్మిక అంశాల గురించి రాయగలుగుతున్నాను
అంటే అది ఆ పత్రిక పుణ్యమే.
ఇప్పుడు కూడా తెలుగునాట అనేక ఆధ్యాత్మిక పత్రికలు వెలువడుతున్నాయి.
పరిపూర్ణానంద స్వామి సంకల్ప బలంతో నెలనెలా శోభాయమానంగా ప్రచురితమవుతున్న ‘శ్రీ
పీఠం’ పత్రిక వీటిల్లో ఒకటి. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని తాజా సంచికలో అనేక
ఆసక్తికరమైన వ్యాసాలను పొందు పరిచారు.
పుష్కరాలు అనగానే తటాలున
గుర్తుకువచ్చేవి నదీ జలాల్లో పుణ్య స్నానాలు. ఆ పుణ్యస్నాన ఫలితాలతో పాటు పుష్కర వైశిష్ట్యాలను
అరటి పండు ఒలిచి చేతికి అందించేంత సులభశైలిలో పలు వ్యాసాలను ఈ సంచికలో
ప్రచురించారు. పుష్కర యాత్రీకులకు ఒక రకంగా ఇది కరదీపిక.
పుష్కర స్నానం సరే, అనుదిన స్నానాలను
గురించి పరిపూర్ణానంద స్వామి సూటిగా ఓ మాట సెలవిచ్చారు.
“ఉత్తమం నదీ స్నానంచ మధ్యమంతు తటాకే
అధమం కూప స్నానంచ భాండ స్నానేన నిష్పలం”
నదీ స్నానం ఉత్తమం. చెరువు స్నానం మధ్యమం.
ట్యాంకుల్లో, బిందెల్లో నిల్వవుంచిన నీతితో స్నానం చేయడం వల్ల ఏ ఫలితం వుండదని
అర్ధం.
అంటే ఈ ఆధునిక కాలంలో ఏదైతో చేయరాదో
అదే చేయాల్సి వస్తోంది. అంచేత పన్నెండేళ్ళకు ఓసారి వచ్చే నదీ పుష్కరాల్లో పుణ్య
స్నానాలు చేయడం మంచిది. పుష్కరాలు, కుంభమేళాల రూపంలో మన పూర్వీకులు ముందు చూపుతో
కల్పించిన బంగారు అవకాశం అనుకోవాలి. అందులో భాగమే ఆగష్టు పన్నెండున సూర్యోదయంతో మొదలవుతున్న కృష్ణా పుష్కరాలు.
పరిపూర్ణానంద స్వామి పుష్కర
యాత్రీకులకోసం ప్రస్తావించిన కొన్ని పసిడి పలుకులు ఈ ‘శ్రీ పీఠం’ ప్రత్యేక సంచికలో
వున్నాయి. గత గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన దుర్ఘటన నేపధ్యంలో అ
పలుకులను ఒక హెచ్చరికగా తీసుకోవాల్సి వుంటుంది.
“పుష్కర స్నానానికి ఒక ప్రత్యేక
ముహూర్తం అంటూ ఏమీ వుండదు. పుష్కర
దినాల్లో ఏరోజునైనా సరే, ఉదయం నుంచి మధ్యాన్నం లోపు ఎప్పుడు కృష్ణలో స్నానం చేసినా సరిపోతుంది అని స్వామి చెప్పారు.
“స్నాన సమయంలో సబ్బులు, షాంపూలు, ఆఖరికి
సున్నిపిండి వాడడం కూడా కూడదని ఆయన సెలవిస్తున్నారు. నదిలో మట్టి విసిరివేయడం,
పసుపు కుంకుమలు చల్లడం తగదని కూడా చెప్పారు.
మానవ నాగరికత మూడుపూవులు ఆరుకాయలుగా
విలసిల్లడానికి మూలకారణం అయిన నదీమతల్లులను గౌరవించి, పూజించి కృతజ్ఞతలు
తెలుపుకునే అవకాశాన్ని కల్పించడానికి కూడా ఈ పుష్కర సంప్రదాయాలు ఎంతగానో
తోడ్పడతాయి.
పరిపూర్ణానంద స్వామి అనుగ్రహ హితోక్తులతో
పాటు, ‘పుష్కర మహాత్యం’ గురించి బాచంపల్లి సంతోషకుమార శాస్త్రి, ‘పుష్కర విధుల’పై
అన్నదానం చిదంబర శాస్త్రి, ‘జలసంపద లక్ష్మీ నారాయణులే’ అంటూ ధూళిపాళ మహాదేవమణి, ‘నేను,
మీ కృష్ణమ్మను’ అనే పేరుతొ కృష్ణానది పుట్టుక
నుంచి సాగర సంగమం వరకు ఆ నదీమతల్లి పోకడలను వివరిస్తూ ప్రయాగ రామకృష్ణ రాసిన
సచిత్ర వ్యాసం, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ‘కృష్ణవేణీ౦ నమామ్యహం’, ఆచార్య
విజయశ్రీ కుప్పా రచించిన కృష్ణవేణి పుష్కర రాణి’, డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు
చారిత్రిక నగరం పేరుతొ వివరించిన బెజవాడ వైశిష్ట్యం, పురిఘెళ్ళ
వెంకటేశ్వర్లు రాసిన ‘కృష్ణాతీరంలో పొంగిన దేశభక్తీ’, ‘కృష్ణా తీరం పుణ్య
క్షేత్రాల నిలయం’, కృష్ణా పుష్కరాల ప్రధాన వేదిక బెజవాడ గురించి భండారు శ్రీనివాసరావు జ్ఞాపకాలు మొదలయిన విశేషాలతో కూడిన రచనలను ఈ సంచికలో
పొందుపరిచారు. చిత్రకారుడు, స్వామి వారి అనుగ్రహపాత్రుడు 'బ్నిం'.
ముందే చెప్పినట్టు పుష్కర యాత్రీకులకు ‘శ్రీ
పీఠం ప్రత్యేక సంచిక’ నిజంగా ఒక కరదీపిక.
“కృష్ణవేణీ౦ నమామ్యహం!!”
1 కామెంట్:
the water coming down in krishna or any other river would be mostly stored water from project or drainage water coming from uppper region villages or cities. i dont understand how people think that pushkara or anything good in that waters...
కామెంట్‌ను పోస్ట్ చేయండి