13, ఆగస్టు 2016, శనివారం

ఇంతయితే అంతే మరి


చలసాని శ్రీనివాస్  గారు ఒక ఇంగ్లీష్ పోస్ట్  పెట్టారు. దానికి స్వేచ్చానువాదం అన్నమాట:
పూర్వపు రోజుల్లో డబ్బు చెలామణీ  లేని కాలంలో బార్టర్ విధానంలో వ్యవహారాలు నడిచేవి. అంటే దగ్గర వున్న ధాన్యమో మరొకటో ఇచ్చి కావాల్సిన సరుకులు కొనుక్కునే వారు.
అలాంటి రోజుల్లో ఒక పల్లెటూరుమనిషి ఇంట్లో తయారు చేసిన నెయ్యిని  పొలిమేరల్లో వున్న చిన్న బస్తీలో షావుకారుకు అమ్మి ఇంటికి కావాల్సిన వస్తువులు తెచ్చుకునేవాడు.
కొన్నాల్టి తరువాత అ షావుకారుకు నెయ్యి తూకంలో కొంత తేడా కనబడింది. వెంటనే తూకం వేసి చూశాడు.  అనుమానించినట్టుగానే వుండాల్సిన తూకంలో తగ్గుదల వుంది. పల్లెటూరు మనిషిని నిలదీశాడు. నమ్మి నెయ్యి కొంటుంటే ఇలా చేయడం తగునా అని ప్రశ్నించాడు. పల్లెటూరువాడు నివ్వెరపోయాడు. తేరుకుని ఇలా చెప్పాడు.
“అయ్యా నాది పొరబాటే. నెయ్యి తూకం వేసే కాటా మా ఇంట్లోలేదు. కొనగలిగే శక్తీ లేదు. అంచేత నెయ్యికి  బదులుగా నాకు మీరిస్తున్న సరుకుల తూకాన్ని బట్టే నెయ్యి కొలిచి తెస్తున్నాను”
తూకం తేడా ఎందుకు వస్తున్నదో షావుకారుకు చిటికెలో బోధపడింది.

దాంతో, కన్నంలో తేలు కుట్టిన దొంగలా నోరుమూసుకున్నాడు.       

కామెంట్‌లు లేవు: