1, ఆగస్టు 2016, సోమవారం

వై.ఎస్.ఆర్. నవ్వుపై చంద్రబాబు కామెంటు



2005 డిసెంబరులో  దూరదర్సన్ నుంచి రిటైర్  అయిన తరువాత డాక్టర్ ఎన్ భాస్కర రావుగారి సంస్థ ‘సీ ఎం ఎస్’ తో కలిసి కొన్నాళ్ళు పనిచేసాను. వారి కార్యాలయంలో అనేక టీవీ సెట్లు ఉండేవి. ప్రతి దాంట్లో ఒక్కో ఛానల్ వచ్చేది.  వివిధ ఛానల్స్ కార్యక్రమాలు చూసి వాటిపై  వారం వారం ఓ రివ్యూ తయారు చేసేవాళ్ళం. ఇందులో ప్రకాష్, శశికళ, సుజాత, శివ సహకరించేవారు. పాత కాగితాలు సర్దుతుంటే ఆనాటి ఓ రిపోర్ట్ కళ్ళబడింది. అదే ఇది:
(ఏప్రిల్ 17, 2006)
కారణం ఏదైనా, ఈ వారం అన్ని ఛానళ్ళు కూడబలుక్కున్నట్టు రాజకీయాలతో పాటు ఇతర  అంశాలకు కూడా పెద్ద  పీటవేశాయి.
కలవని మనసులు, కలహాల కాపురాలు, పెద్దల పట్టుదలలు, యువతీ యువకుల తప్పటడుగుల కారణంగా విడాకుల సంఖ్య పెరుగుతోందని చెబుతూ ‘మూడు ముళ్ళ బంధం’ శీర్షిక లో ఈ టీవీ -2 రోజుకో కధనాన్ని ప్రసారం చేసింది. రేషన్ కార్డులకోసం వచ్చిన అమ్మాయిలను వేధిస్తున్న రేషన్ కీచకుడి భాగోతాన్ని కూడా బయట పెట్టిన ఆ ఛానల్ కు  అభినందనలు. అలాగే, రేషన్ కార్డులు కావాలనుకునే వాళ్ళు గర్భ సంచి పరీక్ష చేయించుకోవాలని మహాబూబ్ నగర్ జిల్లాలో సాగిన ఓ వ్యవహారాన్ని తేజ టీవీ అందించింది.
ఏప్రిల్ మొదట్లోనే ఎండలు బాగా  ముదిరిపోతూ  ఉండడానికి కారణాలను నిపుణుల చర్చద్వారా  ఈ టీవీ -2 అందిస్తే, ఎండల కారణంగా రాష్ట్రంలో పట్టపగలే కర్ఫ్యూ  వాతావరణం నెలకొంటోందని టీవీ -9 ఒక  కధనం ప్రసారం చేసింది.
రైతులకు ‘కెపాసిటీ’వుందా  అంటూ, కెపాసిటర్లు  బిగించుకోవడం వల్ల కలిగే  లాభ నష్టాలను గురించి   ఈ టీవీ -2 ఒక కార్యక్రమం  రూపొందించింది.
రంగుల కలలతో  దుబాయ్ వెడుతున్న యువకులు తిరిగి రాలేక ఆ ఎడారి దేశంలో పడుతున్న అవస్థలు గురించి ఒక పరిశోధనాత్మక కధనాన్ని టీవీ -9  ప్రసారం చేసింది. దుబాయ్  లో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరుగుతున్న నేపధ్యంలో ఇది ప్రసారం అయింది.
అలాగే ఆ ఛానల్ ఈ వారం మరో కొత్త  పుంత తొక్కింది. క్రీడా రంగ నిపుణులతో నిర్వహించే క్రికెట్  మ్యాచ్ విశ్లేషణ కార్యక్రమాన్ని  అసెంబ్లీలో  ప్రభుత్వ  చీఫ్  విప్  నల్లారి  కిరణ్  కుమార్  రెడ్డి తో  నిర్వహించింది.
షాద్ నగర్ సమీపంలో దొంగతనాలు జరిగితే పోలీసులకు పని ఉండదని చెబుతూ, దొంగను పట్టుకునే బాధ్యతను గ్రామస్తులు ఒక చెంబుకు అప్పగిస్తారని తేజ  ఛానల్ ప్రసారం చేసిన వార్త జనంలోని మూఢనమ్మకాలకు అద్దం పట్టింది.
మహబూబ్ నగర్  జిల్లాలో బర్డ్  ఫ్లూ  వదంతులు  వేగంగా  వ్యాప్తి చెందిన నేపధ్యంలో అక్కడి కోళ్ళ పెంపకందార్లు వాటికి సరిగా మేత పెట్టకపోవడంతో అవి తమలో తాము పొడుచు కుంటున్నాయని జీ టీవీ  ఒక ప్రత్యేక కధనం  అందించింది.
విజయనగరం జిల్లా అల్లువాని వలస గ్రామంలో ఇంటికో  వికలాంగుడు  ఉన్నాడని, రెండు చుక్కల మందు (పోలియో డ్రాప్స్) గురించి వారికి తెలియనే తెలియదని మా టీవీ ఒక కధనం ప్రసారం చేసింది.
ప్రకాశం జిల్లా పొదిలి గ్రామంలో 1999 ఏప్రిల్   20 వ తేదీన జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో చికిత్స పొందిన  30మంది రోగులు కళ్ళు పోగొట్టుకున్నారని , అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి అందిస్తానన్న సాయం ఇప్పటివరకు అందలేదని మా టీవీ  ‘రివైండ్’ పేరుతొ ప్రసారం చేసిన కార్యక్రమంలో వెల్లడించింది.
మగ పిల్లలపై మమకారంతో, మగ శిశువు కలిగే వరకు  గిరిజన తండాల్లోని ప్రజలు డజన్ల కొద్దీ ఆడపిల్లలను కంటున్నారని తెలియచేస్తూ పన్నెండు మంది ఆడపిల్లల్ని కన్నఒక మహిళ కధనాన్ని దూరదర్సన్ సప్తగిరి ప్రసారం చేసింది.
కొసమెరుపు:
‘ముఖ్యమంత్రి ఏం చేసినా ప్రతిపక్ష నాయకుడికి గిట్టకపోవడం అసహజమేమీ కాదు. కాకపొతే రాజశేఖర రెడ్డి స్వభావ సిద్ధంగా చిందించే మందహాసాలపై  చంద్రబాబునాయుడు చేసిన విమర్శలు దాదాపు అన్ని ఛానళ్ళకు ఈ వారం ముడి సరుకై కూర్చున్నాయి.
‘ముఖ్యమంత్రి నవ్వు, నటుడు నాగభూషణం నవ్వులాగా విలనీ మార్కు నవ్వు’ అంటూ చంద్రబాబు  విమర్శిస్తే , ‘అసలు నవ్వడమే తెలియని వాళ్ళు మరొకరు నవ్వితే బాధ పాడడం ఎందుకని’ వై.ఎస్.ఆర్. తిప్పికొట్టారు. చాలా  రోజుల తరువాత ఈ పాత ‘స్నేహితుల’ నడుమ చోటు చేసుకున్న ఈ ‘టిట్  ఫర్ టాట్’ జనాలను ఆహ్లాద పరచింది.”
ఇవీ ఈ  వారం  విశేషాలు. మరిన్ని సంగతులతో వచ్చేవారం    (ఏప్రిల్ 17, 2006)

                    

కామెంట్‌లు లేవు: