2, ఆగస్టు 2016, మంగళవారం

అభిమానులని నిరాశ పరుస్తున్న మోడీ


సూటిగా.....సుతిమెత్తగా.....భండారు శ్రీనివాసరావు
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 04-08-2016, THURSDAY)

ఆంధ్రప్రదేశ్  కొత్త  రాష్ట్రానికి ప్రత్యేక హోదా  ఇస్తామంటూ  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  గత సార్వత్రిక ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం రెండేళ్ళు దాటిపోయినా   నిలబెట్టుకోలేక పోయారని  ఆ వైపు  తెలుగునాట రచ్చ రచ్చ సాగుతోంది. రాజ్యసభలో కేవీపీ  ప్రైవేటు  బిల్లు పుణ్యమా అని అది  హస్తినకు కూడా  పాకింది. రాష్ట్రంలో విపక్షాల  బందులూ, అధికార పక్షం నిరసనలు షరా మామూలే  అన్నట్టు వార్తలకు ఎక్కాయి.
ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో  కేంద్ర మంత్రి జైట్లీ  సమాధానం  తరువాత చంద్రబాబునాయుడు నాయుడు మాట్లాడిన తీరు, ఆయన హావభావాల్లో తొంగిచూసిన రవంత అసహనం, ఆందోళన గమనిస్తే, ప్రత్యే హోదా విషయంలో ఆయన  పెద్దగా  ఆశలు పెట్టుకున్నట్టుగా  అనిపించడం లేదు. పైగా  ఈ యావత్  వ్యవహారాన్నీ, పరిణామాలను  రాజకీయ  అవకాశంగా మలచుకోవాలనే  ధోరణి వ్యక్తం అవుతోంది. సమస్యల్లో అవకాశాలను వెతుక్కోవడం ఆయనకు అలవాటే.
ఒక విషయం ఇక్కడ చెప్పుకోవాలి. చంద్రబాబునాయుడు  ఈనాడు అప్పాయింట్ మెంట్ తీసుకుని ఢిల్లీలో  కలుస్తున్న నాయకుల్లో అనేకమంది, గతంలో  ఆయన్ని కలుసుకోవడం కోసం ఢిల్లీ ఏపీ భవన్  ఆవరణలోని చెట్లకింద నిరీక్షించడం తెలిసిన వారికి ఈసంగతి బాగా అర్ధం అవుతుంది. అయితే  ఈనాడు  చంద్రబాబు చెబుతున్న అనేక విషయాలు గతంలో ఆయన నోట విన్నవే.
కానీ, ఇలా ఎన్నాళ్ళు? ఇంకా ఎన్నాళ్ళు ఇలా వివరణలు, సంజాయిషీలు ఇస్తూ పోవాలి?
క్రమేణా ఈ  పరిణామాలు బీజేపీ, టీడీపీ నడుమ దోస్తీ బీటలు వారడానికి  దారి తీస్తుంది అనే క్రమంలో సాగుతున్నాయి.  
గత రెండు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్న వారికి ఒక విషయంలో స్పష్టత వుంది. రాజకీయ పార్టీల నడుమ సఖ్యత కానీ, దోస్తీ కానీ, పొత్తు కానీ, దాన్ని పేరుతొ పిలుచుకున్నా అది తాత్కాలికమే. ఎందుకంటే, ఇటీవలి కాలంలో ఇటువంటి పొత్తులకు సిద్దాంతాలు, సూత్రాలు కాకుండా రాజకీయ అవసరాలు ప్రాతిపదిక అవుతున్నాయి. నిబద్ధత లోపించినప్పుడు స్నేహాలు చిరకాలం నిలబడడం కష్టం.
టీడీపీ, బీజేపీ స్నేహం ఎన్నాళ్ళు సాగుతుంది అనేది ప్రజలకు సంబంధించిన విషయం కాదు. అది వారి సమస్యాకాదు. అయితే పార్టీ పార్టీ అని కాకుండా అన్ని రాజకీయ పార్టీలు తమని విషయంలో వంచిస్తున్నాయేమో అనే భావన ప్రబలినప్పుడే అసలు కష్టాలు మొదలవుతాయి.  కష్టాలు ముందు మెడకు చుట్టుకునేది కూడా  ఈ రెండు  పాలక పక్షాలకే. ఎందుకంటే, ప్రత్యేక హోదా అనేది కొత్త రాష్ట్రానికి యెంత అవసరమో సాకల్యంగా వారికి  వివరించి చెప్పింది అవే కాబట్టి. అంశం ముదిరి పాకానపడి భావోద్వేగ స్వరూపాన్ని సంతరించుకున్నప్పుడు అసలు కధ మొదలవుతుంది.  అప్పుడు ప్రజలకు నచ్చచెప్పడం పార్టీలకే కాదు, బ్రహ్మ తరం కూడా కాదు.
ఆంధ్రప్రదేశ్ కు  ప్రత్యేక హోదా అనే అంశం ఇప్పటికే జనంలో బాగా పాకిపోయింది. అది సంజీవనా, కాదా!  మంత్రం దండమా కాదా! సర్వరోగ నివారిణా కాదా  అనే మీమాంసతో నిమిత్తం లేని దశకు వారు చేరుకుంటున్నారు. అగ్గికి ఆజ్యం పోసేవాళ్ళు ఎట్లాగు సిద్ధంగా వుంటారు. అలా అని వారిని తప్పుపట్టడం సరికాదు. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి.
పరిస్థితికి మీరంటే మీరు కారణం అంటూ ఒకరినొకరు దెప్పుకుంటుంటే  ప్రజలు నమ్ముతారని అనుకోవడం వుట్టి భ్రమ. కాకపోతే, ఆయా పార్టీల వీరాభిమానులు తమ పార్టీల వాదనకు అనుగుణంగా చెలరేగిపోతుండవచ్చు. అదంతా ప్రజాభిప్రాయం అనుకుంటే ఎవరిని వారు మోసం చేసుకోవడమే అవుతుంది.
రాజకీయ లబ్ది అనే కోణం ఒదిలిపెట్టి ఇప్పుడు జరగాల్సింది ఒక్కటే. ప్రజలకు వున్నది వున్నట్టు చెప్పడం. నిజాయితీతో చెప్పే చేదు నిజాలను సయితం స్వీకరించే సాధుగుణం ఇంకా జనంలో సజీవంగానే  వుంది.  కానీ, ప్రతిదీ రాజకీయకోణం నుంచి చూడడం మానేసి కనీసం ఒక్కసారయినా రాజకీయ నాయకులు నిబద్ధతతో ప్రజలముందుకు రావాలి.
పరిష్కార మార్గాలు మూడే మూడు.
ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా తనంత తానుగానే ప్రకటన చేయడం.
ప్రత్యేక హోదాకు ఏవయినా సహేతుకమైన కారణాలు అడ్డు పడుతుంటే వాటిని కేంద్రంలోని బీజేపీ పెద్దలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వయంగా  వివరించి, పరిహారంగా భారీ సాయాన్ని ప్రకటించి, నిధులను వెంటనే విడుదల చేయడం.
ఇవేవీ కుదరవు అనుకుంటే, టీడీపీ, బీజేపీ నాయకులు లేనిపోని  మాటలతో, వాగ్వాదాలతో  పొద్దుపుచ్చే వైఖరికి స్వస్తి చెప్పి రాజకీయ రణక్షేత్రంలో నేరుగా తలపడడం.
నిష్టూరమనిపించినా, టీడీపీ, బీజేపీలు మరో వాస్తవం గుర్తు పెట్టుకోవాలి.
ప్రత్యేక హోదా వల్ల కానీ, ప్రత్యేక ప్యాకేజీ వల్ల కానీ రాజధాని కూడా లేకుండా ఏర్పడ్డ కొత్త రాష్ట్రానికి మంచి మేలే జరుగుతుంది. అంతేకాకుండా, రాష్ట్రాన్ని పాలిస్తున్న తెలుగు దేశం పార్టీకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి  నిధుల కొరత నుంచి మంచి ఉపశమనం చిక్కుతుంది. చేయవలసిన పనులు సకాలంలో చేసి వచ్చే ఎన్నికలనాటికి  పార్టీని సంసిద్ధం చేసే రాజకీయ వెసులుబాటు లభిస్తుంది.  రీత్యా  ప్రధానమైన రాజకీయ లబ్ది చేకూరేది తెలుగు దేశం పార్టీకే. అల్లాగే, ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారనే ఆదరణ ప్రజల్లో దొరికేది భారతీయ జనతా పార్టీకి. కానీ, అటు వైసీపీకి కానీ, మరో వైపు  కాంగ్రెస్ కు కానీ ప్రస్తుతానికి  పెద్దగా  ఒనగూడే రాజకీయ ప్రయోజనం  ఏమీ వుండదు,  ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఒప్పించాం అని గొప్పలు  చెప్పుకోవడానికి తప్ప.
వాళ్ళు వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయాలను ఒదిలిపెట్టి, ప్రజలను భావోద్వేగాలకు గురిచేయడం వల్ల అసలే  ఇబ్బందుల్లో వున్న కొత్త రాష్ట్రానికి  మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టిన వాళ్ళు అవుతారు.
గతంలో  అనేక పర్యాయాలు  చెప్పిన  మాటనే  పునరుక్తి దోషం  అయినా  మళ్ళీ  మళ్ళీ  చెప్పాల్సి వస్తోంది.
“ప్రజల ప్రయోజనాలను   పార్టీ కాపాడుతుందో, పార్టీ ప్రయోజనాలను ప్రజలు  కాపాడతారు.
సరే! ఎన్నికలకు ముందు ఎన్నో చెబుతారు, అవన్నీ నిలుపుకోవాలంటే, రాజకీయ పార్టీలకే కాదు ఆ దేవ దేవుడికి కూడా సాధ్యం కాదు అంటూ మోడీ అభిమానులు సయితం సాంఘిక మాధ్యమాల్లో ఎదురు దాడులు చేస్తున్నారు. ఇదీ సరే అనుకుందాం. అనుకుంటూనే  ఓ రెండేళ్ళు వెనక్కి వెడదాం!
తనని నమ్మి బ్రహ్మాండమైన విజయం కట్టబెట్టిన దేశ ప్రజలకు ఏదో చేయాలనే తాపత్రయంతో నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తొలి రోజుల్లోనే అహరహం ఆలోచనలు చేస్తూ పోయారు. ఈ దేశ భవిష్యత్తు గురించి, దేశాన్ని ఎలా తీర్చి దిద్దాలి అనే విషయం గురించీ అనేక కలలు కంటూపోయారు. రాజకీయ నాయకులకి అది సహజం. కానీ విశేషం ఏమిటంటేమోడీ  కనే కలలు నిజం కావాలని ప్రజలు, ముఖ్యంగా చదువుకున్నవారు, యువతీ యువకులు  సయితం  కలలు కనడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఇది మరీ  స్పుటంగా కానవస్తోంది.  అంటే ఆయన మీద జాతి జనులు పెట్టుకుంటున్న ఆశలు ఏమేరకు పెరిగిపోతున్నాయో, కారణంగా ఆయన భుజస్కంధాల మీద బరువు బాధ్యతలు ఎలా పెరిగిపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమాత్రం తభావతు వచ్చినా ఆశల శిఖరం కూలిపోయి, ప్రస్తుతం వెల్లువెత్తుతున్న అభిమానం కాస్తా ఆగ్రహంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ నేపధ్యంలోనే  గతాన్ని  గుర్తు చేయడం, చేసుకోవడం. దానికే ఈ ప్రయత్నం.  
ఊళ్ళల్లో రోడ్డు పక్కన సిగరెట్లు వగయిరా అమ్మే పాన్ డబ్బాలు కనిపిస్తాయి. ఉదయంనుంచి రాత్రి పొద్దుపోయేదాకా బడ్డీ దుకాణాల వారు శ్రమిస్తూ వుండడం అందరికీ తెలిసిన విషయమే. కానీ, చిన్న దుకాణాల మీద దాదాపు పది పదిహేను ప్రభుత్వ శాఖల ఆజమాయిషీ ఉంటుందనేది చాలామందికి తెలియవి విషయం. మునిసిపల్ కార్పోరేషన్, పారిశుధ్య శాఖ, కార్మికశాఖ ఇలా జాబితా చాలా పెద్దది. ఇలాటి దుకాణాలు పెట్టుకునేవారు పెద్ద చదువులు చదివిన వారు అయివుండరు. కలిగిన వారు అయివుండే అవకాశం లేదు. అయినా ఇన్నిన్ని శాఖల ఆజమాయిషీ వారిపై అవసరమా? ప్రశ్న అతి సహజమైనది. మనలో చాలామంది మదిలో ప్రశ్న మొలకెత్తినా ఉసూరుమని నిట్టూర్చడం తప్ప  చేయగలిగింది ఏమీ వుండదు. అదృష్టవశాత్తు ప్రశ్న వేసింది, జవాబు అన్వేషించింది సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి మోడీ అవడం వల్ల పరిష్కారం దొరుకుతుందనే ఆశ ఆ నాడు కలిగిన మాట వాస్తవం.
ఆ ఆలోచనల నుంచి పుట్టినదే  'శ్రమయేవ జయతే' అనే నూతన  పధకం. ఇటు యువతకు, అటు శ్రామికులకు, మరో పక్క పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం, ఉత్సాహం కలిగించే  ఈ పధకాన్ని, భారతీయ జనతా పార్టీకి, ఒకప్పటి  మాతృ సంస్థ అయిన జన సంఘ్ నాయకుడు, కీర్తిశేషులు దీన దయాళ్ ఉపాధ్యాయ పేరిట  ప్రధాని మోడీ రెండేళ్ళ క్రితం 2014 లోనే  మొదలుపెట్టారు.
ఉప్త్పత్తి రంగం తీసుకున్నా, తయారీ రంగం తీసుకున్నా అక్కడ పరిస్తితులు సజావుగా సాగాలంటే అటు పెట్టుబడి పెట్టే యజమానులు, ఇటు శ్రమను పెట్టుబడిగా పెట్టే  శ్రామికులు, ఒక కాడికి రెండు ఎడ్లు మాదిరిగా సమన్వయంతో సాగాలి. ప్రభుత్వం అనేది వీరిద్దరి మీదా పెత్తనం చేసే పెత్తందారీ వ్యవస్థ కాకుండా దారి చూపే దిక్సూచి మాదిరిగా వ్యవహరించాలి. అప్పుడు మోడీ తన ప్రసంగంలో చెప్పింది అదే. ఏదయినా వ్యాపారం పెట్టాలన్నా, పరిశ్రమ స్తాపించాలన్నా, ఫాక్టరీ నెలకొల్పలన్నా అనేక రకాల ఫారాలు, అనేక రకాల దరఖాస్తులు, అనేక రకాల అనుమతులు. ఇన్నిన్ని  అవసరమా? అన్నది ఆయన వేసిన ప్రశ్న. అందుకే, ఒకే ఒక ధరఖాస్తుతో  అన్ని రకాల అనుమతులు, ఏక గవాక్ష విధానం ద్వారా కాలయాపన లేకుండా  మంజూరు చేయాలనేది ఆయన ఆలోచన.   
అయిన దానికీ, కాని దానికీ అధికారులు యజమానులను వేధిస్తున్నారని వారి నుంచి ఆరోపణలు కోకొల్లలుగా వస్తూ వుండడం కొత్తేమీ కాదు. అందుకే మొత్తం తనిఖీ వ్యవస్థను పారదర్శకం చేయాలని మోడీ తలపెట్టారు. కార్మిక శాఖకు చెందిన ఇన్స్పెక్టర్ ఏదయినా ఫాక్టరీకి వెళ్లి తనిఖీ చేయాలని అనుకుంటే తన ఇష్టం వచ్చిన ఫాక్టరీకి తన ఇష్టం వచ్చిన సమయంలో వెళ్లి తనిఖీ చేయడానికి కుదరదు.   ఇన్స్పెక్టర్  ఫాక్టరీకి వెళ్ళాలన్నది కంప్యూటర్ లో లాట్లు తీసి   నిర్ణయిస్తారు. అలా తనిఖీకి వెళ్ళిన అధికారి డెబ్బయ్ రెండు గంటల్లోగా  తన నివేదికను ఆన్ లైన్ లోనే పై అధికారికి పంపాల్సివుంటుంది. వ్యాపారాలు సులువుగా చేసుకోగల పరిస్తితి వుంటే, అవినీతికి ఆస్కారం తగ్గి, నాణ్యతలో పోటీపడడానికి  వీలుంటుంది అన్నది ప్రధాని మోడీ  ఆలోచన. పాలన గరిష్ట స్థాయిలో వుండి ప్రభుత్వ పెత్తనం కనిష్ట స్థాయిలో వుండాలని ఆయన మొదటినుంచీ చెబుతూ వస్తున్నదే.       
కార్మికులకు ప్రయోజనం వుండే మరో విధాన ప్రకటన కూడా  ప్రధాని అప్పుడే  చేసారు. అది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు సంబంధించినది. కార్మికులు, ఉద్యోగులు తమ సంస్థను లేదా కంపెనీని వొదిలి వెళ్ళాల్సిన  సందర్భాలు తటస్తించినప్పుడల్లా ఖాతాను బదిలీ చేసుకోవడం వారికి దుస్తరంగా  మారుతోంది. దీన్ని అధిగమించడానికి పీ.ఎఫ్. ఖాతా నెంబరు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే నెంబరు కేటాయించే విధానం అమల్లోకి తెస్తారు. ఖాతా వివరాలను వారు ఎప్పటికప్పుడు వారి మొబైల్ ఫోన్ల ద్వారా తెలుసుకోగల వెసులుబాటు కూడా  వుంటుంది.
ఇది నిజంగా ఆహ్వానించతగ్గ ఆలోచన. అభివృద్ధి చెందిన  దేశంలో అయినా పనివారికి సమాజంలో తగిన గౌరవ ప్రపత్తులు వుంటాయి. మన దగ్గర మాదిరిగా 'వైట్ కాలర్' ఉద్యోగాలు, 'కాలర్' మాసిన ఉద్యోగాలు అనే తేడాలు వుండవు. జీతాన్ని బట్టి కాకుండా పనికి గౌరవం లభించే విధానం రావాలనీ, అదే జీవన విధానం కావాలనీ కోరుకునే పాలకుల ప్రయత్నాలు హర్షణీయం.
చక్కటి ఆలోచన. చక్కటి పధకం.
అనుకుంటూనే రెండేళ్ళు  గడిచిపోయాయి. జరిగింది, సాధించింది ఏమిటంటే  చెప్పుకోవడానికి కొన్ని గణాంకాలు వుండవచ్చునేమో కానీ ఆశించిన స్థాయిలో ఈ పధకం అమలు జరిగిన దాఖలా  అయితే లేదు. నిజానికి ఇది ఎన్నికల వాగ్దానం కాదు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆలోచించి రూపొందించిన పధకం.
ఇన్నాళ్ళుగా రాజకీయ నాయకుల ఆలోచనలు అంతరిక్షంలోను,  ఆచరణ అధః పాతాళంలోను ఉండడమే ప్రజలకు తెలుసు. అందుకే వారు చెప్పే  మాటల  పట్ల, చేసే వాగ్దానాల పట్ల జనాలకు  అనేక సందేహాలు. అనేకానేక అనుమానాలు. కాబట్టి మాటలు చేతల్లో కనబడేలా అడుగులు పడినప్పుడే రాజకీయుల ఆలోచనలకు  విశ్వసనీయత లభిస్తుంది. సార్వజన ఆమోదం లభిస్తుంది.
ఇలాటి ఆలోచనలు మెండుగా చేస్తున్న ప్రధాని మోడీ 'అందరిలో ఒకరా, కొందరిలో ఒకరా' అనేది కాలమే తేలుస్తుందని ఆనాడు  ఇదే పత్రికలో రాయడం జరిగింది. రెండేళ్ళు గడిచిపోయిన తరువాత తిరిగి చూసుకున్నప్పుడు, మోడీ సయితం అందరిలో ఒకరని అనుకుంటే తప్పేమిటి అనే అభిప్రాయం కలుగుతోంది.
విదియనాడు కనబడని చంద్రుడు తదియనాడు తానే కనబడతాడని సామెత. జనాలకు ఇందులో నమ్మకం మెండు. మోడీ మాట నిలబెట్టుకుంటారు అనే నమ్మకంలోనే వారున్నారు.
సహనావతు సహనావతు అనే బోధనల నడుమ  పెరిగిన జాతి కనుక  ప్రజల్లో సహనం పాలు ఎక్కువే.  కొంతకాలం వేచి చూడడం వల్ల పోయేదేమీ వుండదనే వారి నమ్మకం.
అయితే,  అది కొంతకాలమే సుమా! ఎల్లకాలం కాదు.
పాలకులు ఈ వాస్తవం గమనంలో పెట్టుకోవాలి. (03-08-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595             


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మనకు అడ్డుపడుతున్నది జయలలిత. ఆమె కు మన ఎంపీలకంటే ఎక్కువకాబట్టి మోడి మనకు ప్రత్యేకహోదా ఇవ్వడు. బాబు మింగలేక కక్కలేక పోతున్న పరిస్థితిలో ఉన్నాడు.

సహనావవతు = సహ + నౌ + అవతు ; సహనం అన్న పదం లేదు అందులో.

Jai Gottimukkala చెప్పారు...

PM Modi has fans not only all over India but also abroad. The "abhimanulu" you refer to are only a minuscule part of his total fans.