19, మార్చి 2022, శనివారం

పురుషులలో పుణ్య పురుషులు – భండారు శ్రీనివాసరావు

 

(Published in ANDHRAPRABHA daily on 20-03-2022, SUNDAY, TODAY)

ప్రజా ప్రతినిధులలో కూడా పుణ్య పురుషులు వుంటారు. అందర్నీ ఒకే గాటన కట్టాల్సిన అవసరం లేదు.

ఇప్పటి సంగతి నాకు తెలియదు. వున్నారేమో! కానీ నేను విలేకరిగా పనిచేసే రోజుల్లో కొంతమంది ఇలాంటి వారు తటస్థపడ్డారు. ప్రస్తుతానికి ఓ అయిదుగురు గురించి చెప్పుకుందాం.

బత్తిన సుబ్బారావు గోదావరి జిల్లానుంచి శాసన సభకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఒకానొక కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అతి పేద దళిత కుటుంబం నుంచి మంత్రి స్థాయికి ఎదిగినా ఆయన ఆర్ధిక పరిస్తితిలో ఏమార్పూ లేదు. ఆయన తల్లిగారు కూలీపని చేసుకుని జీవనం గడిపేవారు. రాజ్యసభ ఎన్నికల్లో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా డబ్బు తీసుకుంటారని ప్రచారం సాగే రోజుల్లో, అనారోగ్యానికి గురై, నిమ్స్ ఆసుపత్రిలో వుండి కూడా వీల్ చైర్ మీద వెళ్లి పైసా తీసుకోకుండా ఓటు వేసి వచ్చారు. చివరకు ఎంతటి గర్భదారిద్య్రంలో కూరుకు పోయారంటే చనిపోయినప్పుడు దహనం చేయడానికి డబ్బులు లేని దౌర్భాగ్య స్తితి.

ఈ విషయాన్ని అప్పటి బీజేపీ శాసనసభ్యులు శ్రీ వేమా, మరికొందరు గోదావరి జిల్లాల సభ్యులు అసెంబ్లీలో ప్రస్తావిస్తే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి ప్రభుత్వం తరపున కొంత ఆర్ధిక సాయం ప్రకటించారు.

అలాగే, ప్రకాశం జిల్లాకు చెందిన చప్పిడి వెంగయ్య. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అభ్యర్ధిగా 1994 లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలా సింపుల్ గా వుండేవారు.

‘ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫలితం వుండడం లేదు, కనీసం ఈసారయినా నా పేరు సరిగా రాయండయ్యా’ అని అసెంబ్లీ కవరేజ్ కి వెళ్ళే పాత్రికేయులతో అనేవారు సరదాగా. ఆయన పేరు చప్పిడి వెంగయ్య. వెంగయ్య అయివుండదు, అది వెంకయ్య అయివుంటుందని  హైదరాబాదు రిపోర్టర్లు  తామే తీర్మానించుకుని, చప్పిడి వెంకయ్య అని రాసేవారు.

వెంగయ్య గారి ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేయడానికి హైదరాబాదు నుంచి ఒక ఆంగ్ల దినపత్రిక తరపున సుశీల్ కుమార్ అనే విలేకరి  ప్రకాశం జిల్లాకు వెళ్ళారు. వెంగయ్య గారి ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు. రెండే గదులు. టీవీ కాదుకదా, కనీసం రేడియో కూడా లేదు. కాలినడకనే ప్రచారం. అయినా గెలిచారు. కాదు ప్రజలు గెలిపించారు. సుశీల్ ఆ రోజుల్లో  చప్పిడి వెంగయ్య గురించి  తన పత్రికలో రాసిన వార్త చాలా సంచలనాన్ని సృష్టించింది.

మరోసారి ఎన్నికల్లో పార్టీ ఫండ్ స్వయంగా అందచేయడానికి ఒక మంత్రిగారు వెళ్ళారు. కానీ ఆయన పైసా కూడా తీసుకోలేదు. చిత్రం! ఆ ఎన్నికల్లో ఓడిపోయారు’

నేను హైదరాబాదులో రేడియో విలేకరిగా చేరిన కొత్తల్లో వావిలాల గోపాలకృష్ణయ్య గారితో పరిచయం ఏర్పడింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, మద్యపాన వ్యతిరేకోద్యమ నేతగా ఆయన పలు పర్యాయాలు రేడియో స్టేషన్ కు వచ్చేవారు. నీరు కావి రంగు ఖద్దరు దుస్తులు, ముతక ధోవతి, ముడతలు పడ్డ అంగీ.  భుజం మీదుగా వేలాడుతూ ఒక గుడ్డ సంచి. దూరం నుంచే చూసి చెప్పొచ్చు ఆ వచ్చేది వావిలాల వారని. ఇక ఆ చేతి సంచిలో వుండేవి నాలుగయిదు వేపపుల్లలు, మరో జత ఉతికిన దుస్తులు, నాలుగయిదు పుస్తకాలు, నోటుబుక్కు. 1955 నుంచి 1967 వరకు ఆయన ఇండిపెండెంటుగా గెలుస్తూ వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఆయన కాలినడకనే తిరిగేవారు. యెంత దూరమైనా కాలి నడకే. వూరు దాటి సుదూర ప్రాంతాలు  వెళ్ళాల్సివస్తే ఆర్టీసీ బస్సు లేదా సెకండు క్లాసు రైలు. ఒకసారి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వున్నప్పుడు నాగార్జున సాగర్ వెళ్ళారు. గెస్టు హౌస్ లో దిగిన వావిలాల వారిని మర్యాద పూర్వకంగా కలుసుకునే నిమిత్తం జిల్లా కలెక్టర్ వెళ్లి గదిలో చూస్తె ఆయన లేరు. బయటకు వచ్చి వాకబు చేస్తే ఆ సమయానికి వావిలాల గెస్టు హౌస్ దగ్గర కృష్ణా నదిలో స్నానం చేసి బట్టలు ఉతుక్కుంటూ కానవచ్చారు. ‘అదేమిట’ని కలెక్టర్ ఆశ్చర్యంతో అడిగితే, ‘వున్నవి రెండే జతలు, ఏరోజుకారోజే ఉతుక్కోవడం తనకు అలవాట’ ని చెప్పారు.

 

రాజ్యసభకు ఎన్నికయిన శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ చాలా సౌమ్యులు. రేడియో విలేకరిగా నాకు పరిచయం వుంది. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన రోజుల్లో కూడా ఆయన నిరాడంబరంగా వుండడం నాకు తెలుసు.

రాజ్యసభకు ఎన్నిక అయిన అనంతరం సుభాష్ చంద్ర బోస్ మాట్లాడుతూ తనని రాజకీయాల్లో ప్రోత్సహించిన వారిని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి సందర్భాలలో ఎవరయినా సరే, ముందు తమ పార్టీ నాయకుడిని పొగడ్తలతో ముంచెత్తిన తర్వాతనే ఇతరులను తలుచుకుంటారు.

కానీ ఆయన ముందుగా తలచుకున్నది రాయవరం మునసబు  ఉండవిల్లి సత్యనారాయణ మూర్తి గారిని. ఆయన  ఎవరన్నది ఈ తరం వారికి తెలియదు. ఆయనే తనకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పించారన్నారు. ఒకానొక కాలంలో రాయవరం మునసబు అంటే జిల్లా మొత్తానికి తెలిసిన పేరు. ఆయన జిల్లా దాటి రాజకీయాలు చేసింది లేదు. కానీ రాష్ట్ర రాజధాని వరకు ఆయన ఎవరో తెలుసు.

సరే! ఈ విధేయతలు అనేవి పార్టీ వ్యవహారాలు. అవి పక్కన పెడదాం. మరి ఆయన నిరాడంబరత్వం. దాన్ని గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి.

 

గతంలో ఓసారి మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు (అప్పుడు శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంక్ చైర్మన్)  మా వదినెతో కలిసి వైజాగ్ నుంచి హైదరాబాదు రైల్లో వస్తున్నారు. ఇద్దరికీ ఏసీ సెకండ్ క్లాసులో అప్పర్ బెర్తులు దొరికాయి. కింద బెర్తులు ఖాళీగా వుంటే ఇవ్వాల్సిందని టీసీని అడిగారు. రాజమండ్రిలో మంత్రి సుభాష్ చంద్ర బోస్ కోసం రిజర్వ్ అయ్యాయి, లాభం లేదు అన్నాడాయన. మంత్రి గారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వుంటుంది కదా, ఈ సెకండ్ ఏసీ ఎందుకు అనేది మా అన్నయ్య అనుమానం.

రాజమండ్రి వచ్చేసరికి తొమ్మిది దాటింది. మంత్రిగారు భార్యతో కలిసి బోగీలోకి వచ్చారు. సామాన్లు సర్దుకున్న తరువాత ఆయన మా అన్నయ్యని అడిగారట. మీ మిసెస్ పైకి ఎక్కి పడుకోవడం కష్టం, ఆవిడ, మా ఆవిడ కింద బెర్తుల్లో పడుకుంటారు, మనం పైన సర్డుకుందాం అన్నారట ఆ మంత్రిగారు. ఇది విని మా అన్నయ్య ఎంతో ఆశ్చర్యపోయారు.

మంత్రిగారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వున్న మాట నిజమే. కానీ మా మేడం గారు ఆయనతో ప్రయాణం చేస్తే మాత్రం సెకండ్ ఏసీ బుక్ చేయమంటారు”

మర్నాడు ఉదయం సికిందరాబాదులో రైలు దిగిన తర్వాత మంత్రిగారి పియ్యే ఈ మాట చెప్పి మా అన్నగారి అనుమానం తీర్చారు.

మరో ఉదంతం చెప్పుకుందాం.

ఓ మంత్రిగారు ఆఫీసులో రివ్యూ మీటింగులో వుండగా ఇంటర్ కం మోగింది.

అవతల పియ్యే.

సార్! ఇంటి నుంచి ఫోన్, మేడం గారు లైన్లో వున్నారు’

మంత్రిగారు విసుగ్గా ఫోన్ తీసుకున్నారు. మరింత విసుగ్గా అన్నారు.

ఎన్ని సార్లు చెప్పాను, ఆఫీసులో మీటింగులో వున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని. ఇంతకీ ఏమిటంత అర్జంటు పని’

‘........’

కారు పపించాలా! ఎందుకు ఈమీటింగు కాగానే నేనే ఇంటికి వస్తున్నాను. ఈ అరగంటలో కొంపలేం మునగవ్. డ్రైవర్ అటూ ఇటూ రెండు సార్లు తిరగడం దండగ. నేను వచ్చాక వెడుదువ్ కాని’

ఆరోజు మంత్రి ఛాంబర్లో దివాలా తీసిన ప్రూడెన్షియల్ సహకార పట్టణ బ్యాంకు గురించిన మీటింగ్ జరుగుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులయిన సహకార శాఖ కార్యదర్శి శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సహకార శాఖ రిజిస్ట్రార్ శ్రీ గార్గ్, అందులో పాల్గొంటున్నారు.

నిజానికి మంత్రులు ఇంటి పనులకోసం అధికారిక వాహనాలను వాడుకోవడం అనేది సామాన్యంగా జరిగే విషయమే. అలాటి వాటిని చాలా సాధారణ విషయంగా తీసుకోవడానికి జనం అలవాటుపడ్డారు. ప్రతి మంత్రికీ ఆయన శాఖ కిందికి వచ్చే కార్పొరేషన్ వాళ్ళే వాహనాలు ఒకటో రెండో అదనంగా సమకూర్చడం అనేది బహిరంగ రహస్యమే. మరి ఇదేమిటి ఈ మంత్రిగారు భార్య కారు కావాలంటే ఇలా విసుక్కుంటున్నారు?

ఆయన అంతే! ఆయన మంత్రే కాని అందరివంటి వాడు కాదు. ఆయన పేరే చిక్కాల రామచంద్రరావు. అనేకమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవులు నిర్వహించారు. మంత్రి అయిన తర్వాత కూడా ఆయన తన సొంత అంబాసిడర్ కారునే వాడేవారు. ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్ వాడుకునేవారు.

సింపుల్ గా వుండడం ఆయనకు ఇష్టం. మంత్రిగా వున్నప్పుడు ఈ ఇష్టాన్ని మహబాగా తీర్చుకున్నారు.



(19-03-2022)

 

 

 

కామెంట్‌లు లేవు: