(Published in ANDHRAPRABHA daily on 17-03-2022, Thursday)
1985 నవంబరు
నుంచి 1990 ఫిబ్రవరి
వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్ భవన్ వెలుపల నడిచే రాజకీయాలకు ధీటుగా
గవర్నర్ నివాసంలోను నడిచిన రాజకీయ సందడి గురించి ఆ రోజుల్లో పత్రికల్లో అనేక
కధనాలు వెలువడుతుండేవి. దానికి ప్రధాన కారణం అప్పట్లో గవర్నరుగా పనిచేసిన కుముద్
బెన్ జోషి.
తన ఎనభయ్ ఎనిమిదో ఏట కుముద్ బెన్ జోషి
స్వరాష్ట్రం అయిన గుజరాత్ లోని స్వగ్రామంలో
మార్చి పద్నాలుగో తేదీ సోమవారం నాడు కన్ను
మూశారు. ఒకప్పుడు పత్రికల వార్తలకు ప్రధాన వనరు అయిన కుముద్ బెన్ చనిపోయిన వార్త
పత్రికలకు అంతగా పట్టినట్టు లేదు. లోపల పేజీల్లో ఓ చిన్న వార్తగా వచ్చింది. ఆమె మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర
మోడీ సంతాపం వ్యక్తం చేయడంవల్ల, ఏపీ మాజీ గవర్నర్ మరణ వార్త తెలుగు రాష్ట్రాల
ప్రజలకు తెలిసిందని అనుకోవాలి. సహజమే.
అధికారానికి,
ఆరోగ్యానికి దూరమై ఇప్పటికే అనేక సంవత్సరాలు దొర్లిపోయాయి. అలాంటి వ్యక్తులను
గురించి పట్టించుకునే తీరిక ఓపిక ఈనాటి వేగ ప్రపంచానికి ఉంటుందని ఆశించడం అత్యాశే
అవుతుంది. అంచేతే తళుక్కు మంటేనే తారలు, మిణుక్కు మంటే చుక్కలు అనేది.
గవర్నర్ల పాత్ర గురించి ఈనాడు జరుగుతున్న చర్చ
ఏనాడో అంటే ముప్పయ్ ఏడేళ్ల క్రితమే జరిగిందని ఈనాటి యువ తరానికి తెలిసే అవకాశం
ఉంటుందని అనుకోను. ఆ రోజుల్లో ఇరవై నాలుగ్గంటల టీవీ వార్తాప్రసారాలు ఉన్నట్టయితే
మీడియాకు అనుక్షణం పండగలాగా గడిచిపోయేది. రాజ్ భవన్ రాజకీయాలు ఆరోజుల్లో అంతటి సంచలనాత్మకంగా సాగేవి.
ఇందుకు ప్రధాన కారణం కేంద్రంలో రాజీవ్ గాంధి
నాయకత్వంలో జాతీయ పార్టీ కాంగ్రెస్
ప్రభుత్వం,
రాష్ట్రంలో ఎన్టీఆర్ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీ
టీడీపీ ప్రభుత్వం. రెండూ ఉత్తర దక్షిణ ధ్రువాలు. పొసగని విధానాలు. మాదే
పైచేయి అనే ఆధిపత్య ధోరణి.
గవర్నర్ కుముద్ బెన్ జోషి యాభయ్ ఏడేళ్ల వయసులోనే
ఈ పదవిలోకి వచ్చారు. గవర్నర్ పదవికి ఇది చిన్న వయసు కిందే లెక్క. అప్పటికే ఆవిడ
చురుకైన కాంగ్రెస్ నాయకురాలు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మూడు
సార్లు రాజ్యసభ సభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆవిడకు వుంది.
ఓ రిపబ్లిక్ దినోత్సవం రోజున గవర్నర్ సాంప్రదాయక
ప్రసంగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడని రీతిలో మాట్లాడడం ఆనాటి
ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఇరవై నిమిషాల పాటు సాగిన హిందీ
ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలను అమలు
చేయడం సాధ్యం కాదని జోషీ కుండ బద్దలు కొట్టారు. కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న
సాయాన్ని ఆ ప్రసంగంలో ఓ పక్క ప్రముఖంగా
ప్రస్తావిస్తూ,
మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న
సంక్షేమ పధకాల పట్ల చిన్న చూపు ప్రదర్సించడాన్ని తెలుగుదేశం ప్రభుత్వం
జీర్ణించుకోలేక పోయింది. నిరసన వ్యక్తం చేస్తూ మంత్రివర్గం తీర్మానం కూడా చేసింది.
ఈ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ కు పంపాలని మంత్రివర్గం ముఖ్యమంత్రిని కోరింది.
గవర్నర్ తీరు పట్ల కొందరు బాహాటంగానే అసంతృప్తి,
ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అటవీ శాఖ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు, సహకార
శాఖ మంత్రి ఎన్. యతిరాజారావు ప్రభ్రుతులు గవర్నర్ పదవికి ఉన్న ప్రతిష్టను జోషి దిగజార్చారని. ఆవిడ కాంగ్రెస్ ఏజెంటుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాజ్
భవన్ గాంధి భవన్ (రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం) గా తయారైందని ఆక్షేపించారు.
కుముద్ బెన్ జోషి గవర్నర్ హోదాలో రాష్ట్రంలోని
ఇరవై మూడు జిల్లాల్లో అనేక మార్లు విస్తృతంగా పర్యటించారు. అనేక కార్యక్రమాల్లో
పాల్గొనే వాళ్ళు. రాష్ట్రంలో కాంగ్రెస్
పార్టీని పటిష్టం చేయడం అనే రాజకీయ ప్రయోజనం కోసమే గవర్నర్ ఇలా అనేక
కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని టీడీపీ
మంత్రులు ఆరోపించేవారు. రాజ్ భవన్ పై పెట్టే
వ్యయం పెరుగుతూ వుండడం పట్ల వారు అడపాదడపా
ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు. అప్పటికే గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకిస్తూ వచ్చిన
ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సైతం జోషీ తీరు పట్ల అసహనం పెంచుకున్నారు.
కుముద్ బెన్ జోషి గవర్నర్ హోదాలో స్థానిక
పత్రికలకు ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. టీడీపీ నాయకులు తనపై చేస్తున్న విమర్శలు,
ఆరోపణలు ఆధార రహితం అని కొట్టి వేసేవారు. వాటికి జవాబు ఇవ్వడం గవర్నర్ గా తన
హోదాను తగ్గించుకోవడమే అవుతుందని, వాటిని తాను లెక్కపెట్టనని ఘాటుగా చెప్పేవారు.
అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన
శారదా ముఖర్జీ తన పదవీ కాలంలో తన అధ్యక్షతన చేతన అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు
చేశారు. కుముద్ బెన్ జోషి ఈ సంస్థకు మరిన్ని జవసత్వాలు కల్పించడమే కాకుండా, నీసా
అనే మరో సంస్థను నెలకొల్పారు. అచేతనావస్థలో ఉన్న రెడ్ క్రాస్ సంస్థకు కొత్త ఊపిరి
పోశారు. చేతన ఆధ్వర్యంలో తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రబలంగా ఉన్న జోగినీ
వ్యవస్థను నిర్మూలించే దిశగా ప్రయత్నాలు చేశారు. కొన్ని జోగినీ జంటలను రాజ్ భవన్
కు ఆహ్వానించి దర్బారు హాలులో ఆ జంటలకు పెళ్ళిళ్ళు చేశారు. రాజ్ భవన్ లో సాగుతున్న
ఈ కార్యక్రమాల పట్ల నాటి మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్య ప్రకంపనలు
సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు నడుమ అగాధాన్ని మరింత పెంచింది.
ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ పదవిని దుర్వినియోగం
చేసిన వ్యక్తిగా రాం లాల్ ముద్ర వేయించుకుంటే, కుముద్ బెన్ వివాదాస్పద గవర్నర్ గా పేరు
తెచ్చుకున్నారు.
ఆవిడ చేసిన ప్రయత్నాల ఫలితం అని చెప్పలేము. కాని
తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశాన్ని ఓడించి అధికారానికి రావడం కాకతాళీయం కావచ్చు.
తోకటపా:
గవర్నర్ కు ముఖ్యమంత్రికి అసలు పొసగదని, నిప్పులో ఉప్పు బాపతు అని జనం బాహాటంగా చెప్పుకుంటున్న సమయంలో జరిగిన
సంఘటన ఇది. నగరం నుంచి గండి పేటకు పోయే దారిలో గవర్నర్ తన అధ్యక్షతన ఉన్న స్వచ్చంద సంస్థల భూమిలో ఒక వృద్ధాశ్రమం
కట్టాలని తలపెట్టారు. దానికి సరైన తెలుగు పేరు సూచించాలని గవర్నర్ అడిగిన వ్యక్తి
ఎవరో తెలుసా! సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. బదులుగా ఎన్టీఆర్ సూచించిన పేరు ఏమిటో తెలుసా! వయోధిక ఆశ్రమం.
(16-03-2022)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి