19, మార్చి 2022, శనివారం

సంతకం ఖరీదు అయిదు రూపాయలు – భండారు శ్రీనివాసరావు

 ఇంచుమించుగా యాభయ్ ఏళ్ళ కిందటి సంగతి. గుంటూరు జిల్లా రేపల్లెలో ఎం కాం చదివిన ఓ కుర్రాడికి ఉద్యోగ నిమిత్తం ఒక గెజిటెడ్ అధికారి సంతకం కావాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లోనే ఒక వాటాలో తహసీల్దార్ అద్దెకు ఉంటున్నాడు. కుర్రాడి అన్నయ్య విషయం చెబితే, ‘దానిదేముంది ఆఫీసుకు పంప’మన్నాడు. ఆ తహసీల్దార్ రోజూ ఆఫీసుకు వెళ్ళే తీరు ఆ కుర్రాడికి చూడ ముచ్చటగా వుండేది. ఓ బిళ్ళ బంట్రోతు ఓ కర్ర పట్టుకుని అక్కడ ఎవరూ లేకపోయినా ‘జరగండి, పక్కకి జరగండి అయ్యగారు వస్తున్నారు’ అంటూ అరుస్తూ ముందు వెళ్ళేవాడు. అతడి వెనక తహసీల్దారు. ఆయన వెనుక దస్త్రాల పెట్టె మోసుకుంటూ మరో బంట్రోతు. వాహనం వుండేది కాదు. ఆఫీసుకు నడిచి వెడుతున్నా కూడా ఈ వైభోగం అంతా వుండేది. ఇదలా ఉంచితే..

అన్నయ్య చెప్పిన ప్రకారం ఆ కుర్రాడు తహసీల్ కచేరీకి వెళ్ళాడు. గది ముందు బిళ్ళ బంట్రోతు తానే అధికారిలా హడావిడి చేస్తున్నాడు. రోజూ ఇంట్లో చూసే మనిషే అయినా, ‘ఎవరు మీరు ఏం కావాల’ని గద్దించి అడిగాడు. కుర్రాడు తహసీల్దారుని కలవాలని చెప్పాడు. ‘ఆయనకు తీరికలేదు, అయిదు రూపాయలు అవుతుంది ఉన్నాయా’ అన్నాడు. అయిదు కాగితం చేతిలో పడగానే లోపలకు పంపాడు.
తహసీల్ దారు కుర్రాడిని తెలియనట్లే మాట్లాడాడు. వచ్చిన విషయం చెబితే కాగితాలు తీసుకుని పైకీ కిందికీ ఓసారి చూసాడు. ‘ఢిల్లీలో ఉద్యోగమా ఎంతిస్తార’ని అడిగాడు. ‘బేసిక్ 230 అని రాసి వుంది’ అని కుర్రాడు చెప్పాడు. అది వింటూనే ‘సరి సరి నా జీతమే నూట ముప్పయి. నేను సంతకం పెట్టాలా వెళ్ళు వెళ్ళు’ అన్నాడు.
కుర్రాడు బయటకు వచ్చాడు. బంట్రోతు ‘పనయిందా’ అన్నాడు. లేదన్నాడు కుర్రాడు. ‘లోపలకు పంపినందుకు మూడు, సంతకం పెడితే స్టాంప్ కొట్టినందుకు రెండు. అంచేత ఇదిగో ఈ రెండు రూపాయలు తీసుకుని బయటకు నడవ’మన్నాడు బిళ్ళ బంట్రోతు.
నిజానికి ఆ రోజుల్లో తహసీల్దారు గెజిటెడ్ కాదు. కానీ ఉద్యోగ హోదా రీత్యా సంతకం చేస్తే చెల్లుతుంది. పొతే ఆ వూళ్ళో మరో గెజిటెడ్ అధికారి వున్నాడు. పశువుల డాక్టరు. అక్కడ బంట్రోతుల హడావిడి లేదు, ఆవులు, గేదెల రొద తప్ప.
నేరుగా వెళ్లి కలిశాడు. ‘అయిదు రూపాయలు ఇచ్చుకోవాలి, తెలుసుకదా’ అన్నాడు.
కుర్రాడు డబ్బులు తీసి ఆయన చేతికే ఇచ్చాడు. అధికారి తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఆ చేత్తోనే సంతకం చేసి, తనే స్టాంప్ వేసి ఇచ్చాడు. అక్కడ అన్నీ ఆయనే.
తదనంతర కాలంలో ఆ ఉద్యోగంలో చేరి హైదరాబాదు ఆలిండియా రేడియో డైరెక్టరుగా పదవీవిరమణ చేసిన వేమూరి విశ్వనాధ శాస్త్రి గారు మాటల మధ్యలో గుర్తు చేసుకున్న ‘స్వకీయం’ ఇది.’

(శ్రీ వీ.వీ. శాస్త్రి)
కామెంట్‌లు లేవు: