1, మార్చి 2022, మంగళవారం

రాజకీయ చెణుకులు – భండారు శ్రీనివాసరావు


ప్రస్తుతం రాజకీయ నాయకులు విసురుకుంటున్న విమర్శనాస్త్రాల్లో ‘వినకూడని మాటలు’ వినబడుతున్నాయి. గతంలో ఈ విసుర్లు ఎలా ఉండేవో చెప్పడానికే ఈ ప్రయత్నం.
రాజకీయాల్లో వుండేవాళ్ళల్లో కూడా హాస్యపు పాలు ఎక్కువే. అయితే ఇటీవలి కాలంలో అది తక్కువైపోతూ అసహనపు పాలు ఎక్కువవుతోంది. కొన్ని పాత ముచ్చట్లు గుర్తు చేసుకుందాం.

లోక్ సభలో భారత ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి చర్చ నడుస్తోంది.
ఒక ప్రతిపక్ష సభ్యుడు ఇలా అన్నారు.
“మన దేశంలో తయారయ్యే మోటారు కారులో శబ్దం చేయని భాగం ఏదైనా ఉన్నదంటే అది కారు హారన్ మాత్రమే”

సరోజినీనాయుడు మహాత్మా గాంధీ గురించి ఘాటుగా వ్యాఖ్యానించింది.
“ఈ గాంధీగారి నిరాడంబరత్వం ఏమో కానీ ఆయన్ని ఇలా సాదాసీదాగా వుంచడానికి మనం ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆయన గారు ఈ సంగతి ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో!”
సర్దార్ పటేల్ ని కూడా ఆమె వదిలి పెట్టలేదు.
“ ఈ ఉక్కు మనిషికి అగ్రికల్చర్ తప్ప అసలు కల్చర్ అంటే ఎంతమాత్రం తెలియదు”

ప్రతిపక్ష సభ్యుడు పిలూ మోడీ మంచి హాస్య చతురత కలవాడు. భారీ కాయానికి తగ్గట్టే హాస్యం కూడా అదే మోతాదులో వుండేది. ఆ రోజుల్లో ప్రధాని ఇందిరాగాంధీ, ఏ సమస్య వచ్చినా, మొండిగా దాన్ని అమెరికా గూఢచారిసంస్థ సీఐఏ తో ముడిపెట్టి మాట్లాడుతూ వుండేవారు. అది విని వినీ చిర్రెత్తుకొచ్చిన పిలూ మోడీ “నేను సీఐఏ ఏజంటును’ అని రాసి వున్న బ్యాడ్జీని ఇందిరాగాంధీకి కనిపించేలా తన చొక్కాకు తగిలించుకుని సభకు వచ్చి అందర్నీ నివ్వెర పరిచారు.

1950 ప్రాంతాల్లో పీ. గోవింద మీనన్ ట్రావెన్ కూర్, కొచిన్ రాష్ట్రానికి (తరువాత కేరళ రాష్ట్రంగా పేరు మారింది) ముఖ్యమంత్రి. టీ.వీ.థామస్ ప్రతిపక్ష నాయకుడు.
తను కూర్చున్న స్థానాన్ని చూపిస్తూ ముఖ్యమంత్రి అన్నారు. “నా ఈ (ముఖ్యమంత్రి) కుర్చీలో కూర్చోవడానికి ప్రతిపక్ష నాయకుడు చాలా ఆత్రుత పడుతున్నారు. అది ఆయనకు ఈ జన్మలో సాధ్యం అయ్యేపని కాదని నేను చెప్పదలచుకున్నాను. ఈ కుర్చీ ఎక్కాలంటే ఆయన మళ్ళీ మనిషి పుటక కాదు, నల్లి జన్మ ఎత్తాలి.”

బ్రిటిష్ ప్రధానిగా రామ్సే మెక్ డోనాల్డ్ కి మెతక మనిషి అనే పేరు. ప్రతిపక్షంలో వున్న విన్ స్టన్ చర్చిల్ ఆయన్ని గురించి ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు.
"ఈ మెక్ డోనాల్డ్ ఎలాటి వాడంటే గొర్రె తోలు కప్పుకున్న మరో గొర్రె”

1978 లో మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ నుంచి ఇందిరా కాంగ్రెస్ కు వలసలు మొదలయ్యాయి. ఎన్నికలు ముగియగానే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఆయన వైపు మళ్లిపోతున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న భాట్టం శ్రీరామ మూర్తి ఓ ఘాటు వ్యాఖ్య చేసారు.
'చెన్నారెడ్డి గారి ఆకర్షణ శక్తి అమోఘం. ఎన్నికల్లో గెలిచిన వాళ్లు జమాఖర్చులు కూడా ఇంకా దాఖలు చేయలేదు. దానికి ముందే పరకాయ ప్రవేశాలా! ఈ తంతు చూస్తూ వుంటే మంగళ సూత్రాలతో, మధు పర్కాలతో పెళ్లి పీటల మీదనుంచి లేచిపోతున్నట్టుగా వుంది'
ఈ వ్యాఖ్య శాసన సభలో దుమారం రగిలించింది.
పార్టీ మారిన వాళ్ళలో మహిళా సభ్యులు కూడా వున్నారు. ‘లేచిపోవడం’ అనే పదానికి అభ్యంతరం తెలిపారు. అది సభలో వాడతగిన పదమా కాదా అన్న దానిపై కొలిక్కిరాని చర్చ విస్తృతంగా జరిగింది.

తోకతపా:
పార్టీ మార్పిళ్ళపై ఇంతటి ఘాటు వ్యాఖ్య చేసిన భాట్టం శ్రీరామ్మూర్తి కూడా తరువాత కాంగ్రెస్ లో చేరిపోయారు.

కామెంట్‌లు లేవు: