21, మార్చి 2022, సోమవారం

గరికపాటి - భండారు శ్రీనివాసరావు

 “గరికపాటి నరసింహారావును మాట్లాడుతున్నాను, భండారు శ్రీనివాసరావు గారేనా!”

నిన్న అంటే మార్చి ఇరవై సాయంత్రం ఫోన్ రిసీవ్ చేసుకోగానే వినబడ్డ మాట. నా చెవులని నేనే నమ్మలేకపోయాను ఒక క్షణం.
ముఖ పరిచయం వుండదు, కానీ కొందరు వ్యక్త్లులు బాగా పరిచయం వున్నవారిలా కనబడతారు. ఆధ్యాత్మిక ప్రబోధనలు చేసే గరికపాటి వంటి వారు సదా ఇళ్ళల్లో ఏదో ఒక టీవీలో ఏదో ఒక సమయంలో కనబడుతూనే వుంటారు. వారి స్వరం వినబడుతూనే వుంటుంది. గరికపాటి వారి సుస్వరం చిరపరిచితమే కనుక క్షణంలోనే తేరుకున్నాను.
“నేను ప్రస్తుతం ఢిల్లీలో వున్నాను. రేపు సాయంత్రం ఫంక్షన్ చూసుకుని హైదరాబాదు వస్తాను” అన్నారు ఆయనే. నిజమే! సోమవారం నాడు వారు పద్మశ్రీ అవార్డ్ తీసుకోబోతున్న సంగతి చటాలున గుర్తుకు వచ్చింది.
స్వయంగా
అభినందనలు
నేరుగా చెప్పే అవకాశాన్ని చక్కగా వాడుకున్నాను.
క్లుప్తంగా ధన్యవాదాలు చెప్పి ఆయన సంభాషణ కొనసాగించారు.
“అది అలా వుంచండి. నేను ఫోన్ చేసిన ఉద్దేశ్యం వేరే వుంది. ఉదయం ఫ్లయిట్ లో ఢిల్లీ వస్తుంటే తెలుగు పత్రికలు కనిపించాయి. ఆంధ్రప్రభ తీసుకుని తిరగేస్తుంటే మీరు రాసిన పురుషుల్లో పుణ్య పురుషులు కనిపించింది. ఆసక్తిగా చదివాను. ఒక్క చప్పిడి వెంగయ్య గారు మినహా మీరు పేర్కొన్న మిగిలిన నలుగురితో నాకు వ్యక్తిగత పరిచయం వుంది.
“ఎనభయ్ ఎనిమిదిలో వావిలాల గోపాల కృష్ణయ్య గారి గురించి ఒక సభలో పరిచయం చేసే బాధ్యత నా మీద పడింది. వారిని గురించి పెద్దగా తెలియదు. అసెంబ్లీకి మొదటిసారి ఎప్పుడు ఎన్నికయ్యారు, ఎప్పటిదాకా కొనసాగారు, ఎక్కడ పుట్టారు వంటి సంగతులు తెలుసు. కానీ ఒక పెద్దమనిషిని పరిచయం చేసేటప్పుడు ఈ వివరాలు సరిపోవు. అందుకే వారినే అడిగి తెలుసుకుందామని వావిలాల వారిని కలుసుకుని వారినే అడిగాను.
ఆయన అదోమాదిరిగా నవ్వి నా గురించి ఏమీ తెలియనప్పుడు ఎలా పరిచయం చేస్తావు అని ఎదురు ప్రశ్నించారు. ఏం జవాబు చెప్పాలో అర్ధం కాలేదు. నా మొహం చూసి ఆయనే అర్ధం చేసుకుని చెప్పారు. “సరే! నా గురించి మొదట ఎలా తెలిసింది, నా పేరు ఎప్పుడైనా విన్నావా! అని.
తటాలున గుర్తుకు వచ్చింది. రేడియోలో విన్నాను. అదే చెప్పాను.
“చిన్నప్పటి నుంచి నాకు రేడియో వినడం అలవాటు. రేడియో వార్తల్లో తరచుగా మీ పేరు, మరో సభ్యుడు సీ.వీ. కె. రావు గారి పేరు వినబడుతుండేవి. మీ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు గురించి ప్రస్తావిస్తూ వుండేవారు.”
అప్పుడు వావిలాల వారు ఇలా అన్నారు.
“మరి ఇకనేం! ఇవే చెప్పు. ఇంతకంటే పరిచయం చేసేది ఏముంటుంది కనుక. ఎప్పుడు పుట్టామో, ఎప్పుడు గెలిచామో ఎవరికీ కావాలి. ప్రజలకు ఏమి చేశామో, ఏమి చేద్దామనుకున్నామో అది ముఖ్యం” అని భుజం తట్టి పంపించారు. ఆయన చెప్పిన విషయం నాకు తరువాత జీవితంలో అనుభవానికి వచ్చింది. టీవీ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు స్టూడియోలో మోడరేటర్ అడుగుతాడు, మీ గురించి ఎలా పరిచయం చేయాలని. ఏమీ తెలియకుండా ఎలా పరిచయం చేస్తావని వావిలాల వారు గతంలో అన్న మాటలు గుర్తుకు వస్తాయి” అన్నారు గరికపాటి వారు.
అనుకోకుండా గరికపాటివారు రేడియో ప్రస్తావన తీసుకురావడం, ఆయన పేర్కొన్న వావిలాల, సీ.వీ. కె. రావుల ప్రకటనలు వార్తల రూపంలో ప్రసారం అయిన కాలంలో నేను రేడియో విలేకరిగా వుండడం కాకతాళీయం కావచ్చు కాని మనసుకు సంతోషం అనిపించింది.
“మనం ఒకసారి కలుద్దాం” అన్నారు ముగింపులో.
ఇది మరీ సంతోషం కలిగించింది.

NOTE: Courtesy Image Owner




(21-03-2022)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఆయన గరికిపాటి ... అన్నారా లేక గరికపాటి ... అన్నారాండీ ఓపెనింగ్ కాల్ లో ?