12, మార్చి 2022, శనివారం

శభాష్ ప్రకాష్! – భండారు శ్రీనివాసరావు

 

"సొంత లాభం కొంత మానుకు పొరుగు వానికి తోడుపడవోయ్‌" అన్న గురజాడ వారి మాటను ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు ఈ ప్రకాష్.
ఇంతకీ ఈ ప్రకాష్ ఎవరంటే!
ముందు ఓ కధ చెప్పుకోవాలి.
ఒకాయన ఒక రోజు స్కూటరు మీద వెడుతుంటే టైరులో గాలి తగ్గినట్టు అనిపించి రోడ్డుపక్కన ఓ టైర్ పంక్చర్ షాపు ముందు ఆగాడు. ఈ ఒకాయన్ని చూడగానే ఆ మెకానిక్కు లేచివచ్చి, ‘మీరలా ఆ స్టూలు మీద కూర్చోండి, నిమిషంలో మీ బండి పని నేను చూస్తాను’ అన్నాడు మర్యాదగా.
ఎందుకో ఏమిటో కానీ, నాలుగయిదు చిన్న రోడ్లు పెద్దరోడ్డులో కలిసే ఆ చౌరాస్తాలో వున్నట్టుండి ట్రాఫిక్ జామ్ అయింది. కార్లూ, స్కూటర్లూ, మోటారు సైకిళ్ళు, సిటీ బస్సులు నడిపేవాళ్ళు ఎవరికి వాళ్ళు ముందుకు పోవాలని తొందర పడడంతో అవన్నీ ఎక్కడికి అక్కడ అడ్డదిడ్డంగా నిలిచి పోయి, ఆ ప్రాంతం అంతా హారన్లతో మారుమోగుతోంది. ఆ ఒకాయన అటు నుంచి ఇటు చూపు మరల్చి చూస్తే, ‘ఒక్క నిమిషం’ అన్న ఆ మెకానిక్కు పత్తాలేడు. ఆ ఒకాయనకు కోపం ముక్కు మీద నుంచి నోటివరకు వచ్చి, ఆ నోరు ఆయొక్క మెకానిక్కును నానా మాటలు అనడానికి సిద్ధం అయ్యేలోగా ఒక దృశ్యం అతగాడి కంటబడింది. అది చూస్తూనే తెరుచుకోబోతున్న అతడి నోరు టక్కున మూసుకుంది. ఆ వెంటనే ఆశ్చర్యంతో మళ్ళీ తెరుచుకుంది. ఇంతకీ ఆ దృశ్యం ఏమిటంటే ...
గాలి పంపు పక్కన పడేసి, చేతిలో ఒక బెత్తం లాంటిది పట్టుకుని ఆ మెకానిక్కు, పద్మ వ్యూహంలో చొరపడ్డ అభిమన్యుడిలా, చిక్కుముడిలా చిక్కుపడ్డ ఆ వాహనాల మధ్యకు దూరిపోయి, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత భుజానికి ఎత్తుకున్నాడు. పది ట్రాఫిక్ సిగ్నల్స్, పదిమంది ట్రాఫిక్ పోలీసులు చేసే పని అతడు చిటికెలో చేసి, అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ ను చక్కదిద్ది, మళ్ళీ వచ్చి తన పనిలో మునిగిపోయాడు.
తొందరగానే పని ముగిసినందుకు సంతోషపడుతూ ఆ ఒకాయన తనలో తను అనుకున్నాడు.
“ఇంకా నయం! తొందరపడి ఈ ‘పెద్దమనిషి’ పై మాట తూలాను కాదు.
చూసారా! మంచితనం మనుషుల్ని ఎలా పెద్దవాళ్ళను చేస్తుందో.
‘నమస్తే! తెలంగాణా’లో ఈ ప్రకాష్ గురించి ‘శభాష్ ప్రకాష్’ అనే కధనం (పిల్ల పత్రికలో, సిటీ ఎడిషన్ కు తెలుగు అనువాదం అన్నమాట) వచ్చింది.
మంత్రులు, ముఖ్యమంత్రులు ఇలాటివారితో పక్కన నిలబడి సెల్ఫీలు దిగడం అనే మోజు లేని నేను, ఈ ప్రకాష్ పక్కన ఒక ఫోటో తీయించుకుంటే ఎలా వుంటుంది అని మనసు పడ్డ మాట మాత్రం నిజం.
ఇలాటి రోడ్డు సైడు హీరోల గురించి రాసిన ‘నమస్తే! తెలంగాణా’ పత్రిక్కి ధన్యవాదాలు.
పొతే మనలో మాటగా ఇంకో మాట. కవులు, కళాకారులు, ఇలా అనేక రంగాల్లో వారిని గుర్తించి వారిలోని ప్రతిభకు గుర్తింపుగా పురస్కారాలు అందించే ప్రభుత్వాలు, ఇటువంటి వారిని కూడా ఏదో ఒక పేరుతొ పౌర పురస్కారం అందిస్తే యెంత బాగుంటుంది?
అత్యాశ అయితే కాదు కదా!
తోకటపా: ప్రతి రోజూ సాయంత్రం మా ఇంటి పక్కనే ఉన్న చౌరాస్తాలో (ఛే రాస్తా అనాలేమో, అంత గందరగోళంగా వుంటుంది) ఈ దృశ్యం నాకంట పడుతూనే వుంటుంది. ట్రాఫిక్ సర్దుబాటు చేయడానికి అపసోపాలు పడే పోలీసులు ప్రకాష్ స్వచ్చంద సేవకు ముచ్చట పడి, రాత్రి వేళల్లో ఎరుపు, పచ్చ రంగులు స్పుటంగా కనబడే ఓ రేడియం చేతి కర్ర లాంటిది అతడికి బహుకరించారు కూడా)

కామెంట్‌లు లేవు: