మిత్రుడు, పాత్రికేయుడు ఇటీవలే ఆకస్మికంగా మరణించిన విద్యారణ్య సంస్మరణ సభ ఈరోజు ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఎంతో బలమైన ఆత్మీయ బంధం లేనిదే అంతమంది అటువంటి సభలకు రారు. చిన్న వయసులోనే చనిపోయాడు అనే బాధ మినహాయిస్తే తన జీవితకాలంలో సంపాదించుకున్న మంచి పేరే అంతమందిని అక్కడకు చేర్చింది. ఒక్క పాత్రికేయ రంగం నుంచే కాదు అనేక రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులు హాజరై విద్యారణ్య దివ్య స్మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ విషయంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం తీసుకున్న చొరవ హర్షణీయం.
అక్కడ
ప్రసంగించిన వారి పలుకులు వింటుంటే నాకు తెలిసిన విద్యారణ్యలో నాకు తెలియని ఇన్ని
కోణాలు దాగున్నాయా అనిపించింది. హర్యానా గవర్నర్
శ్రీ బండారు దత్తాత్రేయ తదితరులు విద్యారణ్య గురించి సొంత అనుభవాలు
చెబుతుంటే విద్యారణ్య ఎవరన్నది నాకు బోధపడింది.
విద్యారణ్యతో
మూడు దశాబ్దాలకు పైగా పరిచయం. ముందు అంధ్రపత్రిక విలేకరిగా ఉన్నప్పటి నుంచి. మా
మధ్య వృత్తిలో పోటీ లేదు కానీ, చేసే పనిలో
కొంత సారూప్యత వుంది. నేను సాయంత్రం
ఆరుంబావు వార్తల సమయానికి అప్పటికి పోగుచేసిన
వార్తలు అందివ్వాలి. విద్యారణ్య పరిస్థితి ఉడ్డుగుడుచుకున్నట్టు వుండేది. డాక్ (సాయంత్రం) ఎడిషన్ కల్లా ఏదైనా బ్యానర్
వార్త పట్టుకోవాలి. ఆ తాపత్రయంలో అతడు ఉండేవాడు.
రేడియోలో
ఏదైనా వార్త మిస్ కాకుండా వుండాలంటే విద్యారణ్య లాంటి మితృలు వుండాలి. ఎప్పుడు ఏ
వార్త వివరాలు అడిగినా విసుక్కోకుండా వివరంగా చెప్పేవాడు. రీజినల్ న్యూస్ యూనిట్ లో విద్యారణ్య వేలు
దూర్చని విభాగం లేదు. రేడియో సిబ్బంది బయట
గేటు దగ్గర సెంట్రీ నుంచి అందరూ విద్యారణ్యని చప్పున పోల్చుకునేవారు. అక్కడ
పనిచేసే నాకు అలాంటి భాగ్యం లేదు. చాలాసార్లు మా గేటు దగ్గర కాపలా మనిషి నన్ను ఆపి, లోపల ఎవరితో మీకు పని, వివరాలు రాయండని గౌరవించిన అనుభవాలు కోకొల్లలు. ఎందుకంటే నేను ఆఫీసుకు వెళ్ళే
సందర్భాలు చాలా తక్కువ. బయట తిరగడాలు బాగా ఎక్కువ.
ఎన్ని
మాట్లాడినా ఎన్ని చెప్పినా ఒకటి మాత్రం వాస్తవం. విద్యారణ్య మా మధ్య లేడు. ఇక
ఉండడు.
మరో నిజం ఏమిటంటే విద్యారణ్య ఇక నుంచి మా మనసుల్లోనే ఉంటాడు.
(27-03-2022)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి