7, మార్చి 2022, సోమవారం

మహిళా దినోత్సవం – భండారు శ్రీనివాసరావు

 మార్చి ఎనిమిదో తేదీ అంటే రేపు అంతర్జాతీయ మహిళాదినోత్సవం.

ఇళ్ళల్లో తల్లిని, భార్యని, అక్కచెల్లెళ్ళని, కుమార్తెలను గౌరవించి, మన్నించి, లాలించి, ఆదరించి,  ప్రేమించడం నేర్చుకుంటే ప్రపంచంలోని ఆడంగులు అందరూ సంతసిస్తారు . 

తొంభయ్యవ దశకం చివర్లో నేను మాస్కోలో వున్నప్పుడు అక్కడి ప్రజలు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే వేడుక ఇది. ఆ రోజున మగవాళ్లు అందరూ ఆడవారికి చిన్నా పెద్దా కానుకలిచ్చి సంతోషపెట్టడం ఆనవాయితీ. అయితే పువ్వులు కానుకగా ఇస్తే వాళ్లు అమితంగా సంతోషించేవాళ్లు. అదేమిటో విచిత్రం అనిపించేది. పూలు పెట్టుకునే తలకట్లు కావు వారివి. అయినా గులాబీ పువ్వు కాడ చేతికి ఇస్తే ముక్కూ మొఖం తెలియని మహిళలు కూడా ఆదరంగా అక్కున చేర్చుకుని (హగ్ చేసుకుని) కృతజ్ఞత తెలిపే వారు. చలి (మంచు) దేశం కాబట్టి పూలు తేలిగ్గా దొరకవు. అంచేత ఆ రోజున పూల కాడలకు చాలా గిరాకీ. పైగా ఖరీదు. ఒక్కో కాడ ఒక రూబులు. అంటే దానితో ఒక రోజంతా తిండీ తిప్పలు తెమిలిపోతాయి. ఈ పూకాడల కానుక ఇచ్చేటప్పుడు ఓ నియమం పాటించాలి. ఆ కాడలు బేసి సంఖ్యలో వుండాలి. అంటే మూడు, అయిదు, ఏడు ఇలాగన్న మాట. సరి సంఖ్యలో ఇస్తే మొహం చిన్నబుచ్చుకుంటారు.

పొతే మనకు సంబంధించి  మనసులోని ఓ మాట.

మహిళా దినోత్సవం ఒక్క రోజన్నా ఆడవారిపై వేధింపుల వార్తలు రాకుండా వుంటే బాగుండు’

దురాశ అని తెలిసీ ఆశ పడడం అంటే ఇదే!



(07-03-2022)

 

కామెంట్‌లు లేవు: