30, సెప్టెంబర్ 2021, గురువారం

రేడియో రాంబాబు – భండారు శ్రీనివాసరావు

 నవ్వు ముందు కనబడుతుంది. తర్వాత ఆయన కనబడతాడు.


ఆయనే పేరే రాంబాబు. సీతా రాంబాబు. చెన్నూరి సీతారాంబాబు. ఆఫీసు రికార్డ్స్ లో వేరే పొడుగు పేరు ఏమైనా ఉందేమో తెలవదు. వున్నా ఆయన అందరికీ రాంబాబే. నాకయితే నవ్వుల రేడు.

నవ్వుకు రిటైర్ మెంట్ ఉంటుందా! వుండదు. వుండకూడదు.

అంచేత ఈరోజు రేడియోలో రాంబాబు గారికి ఇస్తున్న వీడ్కోలు ఓ లాంఛనం మాత్రమే. ఆయన చిరుదరహాసం మాత్రం పర్మనెంట్.

రాంబాబు గారి మందహాస వదనం చూడడానికి ఈరోజు పుట్టిల్లు రేడియోకి వెళ్ళాలనే వుంది. ఎలా కుదురుతుందో ఏమో!

రాంబాబు గారికి ముందస్తు  శుభాకాంక్షలు.

భండారు శ్రీనివాసరావు

(30-09-2021)

29, సెప్టెంబర్ 2021, బుధవారం

నోటికి తాళం


పెదవి దాటిన మాట పృధివి దాటుతుందంటారు.
అందుకే ఏదయినా ఒక మాట అనేముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని పెద్దలంటారు.
దీనికి ఉదాహరణగా ఇంగ్లీష్ లో ఓ కధ నెట్ సంచారం చేస్తోంది.
అదేమిటంటే-
అనగనగా ఒక పెద్దమనిషి. వూళ్ళో నలుగురి గురించీ నాలుగు రకాలుగా వ్యాఖ్యానాలు చేయడం ఆయనకో అలవాటు. నిజమో కాదో నిర్ధారణ చేసుకోకుండా అందరి మీదా నీలాపనిందలు మోపడం ఆయనకో హాబీ. అందులో భాగంగా, ‘పక్కింటి కుర్రాడు దొంగ’ అంటూ తేలిగ్గా అతడిపై ఓ నెపం మోపాడు. అంతటితో ఆగకుండా వైనవైనాలుగా ప్రచారాలు చేసి ‘ఆ కుర్రవాడు నిజంగానే నిజం దొంగ’ అని నలుగురు నమ్మేలా చేసాడు. పోలీసులు కూడా అది నిజమని నమ్మి ఆ కుర్రాడిని పట్టుకుని జైల్లో వేసారు. శిక్ష అనుభవించి తిరిగొచ్చిన తరువాత ఆ కుర్రాడు సదరు పెద్దమనిషిపై పరువునష్టం దావా వేసి కోర్టుకు లాగాడు.
పోతే, న్యాయమూర్తి ముందు ఆ పెద్దమనిషి మాట మార్చాడు. తానేదో ఉబుసుపోకకు అన్న మాటలే కాని ఆ కుర్రాడు దొంగ కాదన్నాడు. అతడిని బాధ పెట్టే ఉద్దేశ్యం లేదన్నాడు.
జడ్జి అంతా విని, అతగాడికి ఓ కాగితం ఇచ్చి ఆ కుర్రాడిని గురించి లోగడ అన్న మాటలన్నీ దానిమీద రాయమన్నాడు. ఆ కాగితాన్ని ముక్కలుగా చించి ఇంటికి వెళ్ళే దారిలో విసిరేసి మర్నాడు కోర్టుకు రమ్మన్నాడు.
ఆ పెద్దమనిషి న్యాయమూర్తి చెప్పినట్టే చేసి మరునాడు కోర్టులో జడ్జి ముందు బోనులో నిలబడ్డాడు.
న్యాయమూర్తి తీర్పుచెప్పబోయేముందు, విసిరేసిన కాగితం ముక్కలు తనకు చూపించమన్నాడు. ‘ఇంకా అవెక్కడున్నాయి. ఎప్పుడో గాలికి కొట్టుకుపోయాయి’ అని పెద్దమనిషి జవాబు చెప్పాడు.
అప్పుడు న్యాయమూర్తి ఇలా అన్నాడు.
‘వేళాకోళంగా అనే మాటలు కూడా చింపిపారేసిన కాగితం ముక్కలు లాంటివే. గాలికి కొట్టుకుపోయిన వాటిని తిరిగి తేలేనట్టే చెడుపు చేసే మాటల్ని కూడా. అవి అవతలి వ్యక్తికి చేసే అపకారాన్ని గురించి కాసేపు ముందే ఆలోచిస్తే అలాటి మాటలు అనడానికి కాస్త సంకోచిస్తాము. ఏదో మాటే కదా! అన్నంతమాత్రానికే ఏమవుతుంది అనుకుంటే ఒక్కోసారి ఇలాగే అవుతుంది. ఎదుటివాడిని గురించి మంచి చెప్పలేనిపరిస్తితే వుంటే అప్పుడు కనీసం అసలేమీ చెప్పకపోవడం మంచిది.
‘మన నాలికకి మనమే యజమానులం. మనం చెప్పినట్టే అది మాట్లాడాలి. అది మాట్లాడినట్టల్లా మనం తలాడించకూడదు. ఆడిస్తే ఇలాగే తల దించుకోవాల్సిన పరిస్తితి ఎదురవుతుంది.’
ముగించాడు న్యాయమూర్తి మందలింపుగా.
నీతి: నోటికి ఇలా తాళం వేసుకోలేకపోయినా నాలుకను సంభాలించుకోవడం ఉత్తమం.
NOTE: Courtesy Image Owner



28, సెప్టెంబర్ 2021, మంగళవారం

ఆడుతూ పాడుతూ ఉద్యోగం – భండారు శ్రీనివాసరావు

 ఆలిండియా రేడియోలో ఉద్యోగాన్ని ఆడుతూ పాడుతూనే కాదు ఓ ఆటలా కూడా చేశాను. అవన్నీ ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తుంది, చిన్నతనమూ అనిపిస్తుంది.

జలగం వెంగళరావు గారు కేంద్ర మంత్రిగా వున్నప్పుడు నా మేనల్లుడు దుర్గాప్రసాద్ తో కలిసి హైదరాబాదు, ద్వారకాపురి కాలనీలో వారి ఇంటికి వెళ్లాను. లోకయ్య( వెంగళరావు గారి నమ్మిన బంటు) మమ్మల్ని చూడగానే లోపలకు తీసుకు వెళ్ళాడు.  వెంగళరావు గారు అప్పుడే బ్రేక్ ఫాస్ట్ చేయబోతూ మమ్మల్ని కూడా తనతో కూర్చోబెట్టుకున్నారు.  ఈ లోపల ఉద్యోగధర్మంగా ఏదో అడగడం ఆయన చెప్పడం జరిగింది. నేను వారి ఇంటినుంచే ఎస్టీడీ ఫోనులో మాట్లాడి విజయవాడ ఆలిండియా రేడియోకి చెప్పాను. న్యూస్ ఎడిటర్ ఆర్వీవీ కృష్ణారావు గారు రిసీవ్ చేసుకున్నారు. మేము టిఫిన్ చేస్తుండగానే రేడియోలో ఉదయం ప్రాంతీయ వార్తలు మొదలయ్యాయి. మొదటి హెడ్ లైన్ వెంగళరావు గారి వార్తతోనే మొదలయింది. అది విని ఆయనగారు ఆశ్చర్యంగా,  ‘అరె! అప్పుడే ఎలా వచ్చింది, నేనింకా సాయంత్రం వార్తలు అనుకున్నా’ అన్నారు.

మదన్ మోహన్ గారు ఆరోగ్యశాఖ మంత్రి. రాజ్ భవన్ రోడ్డులో ఓ ప్రభుత్వ భవనంలో వుండేవారు. మంచి ఆతిథ్యానికి పెట్టింది పేరు. అలా ఒకరోజు ఆయన ఇంట్లో కాలక్షేపం చేస్తుండగా రేడియోలో వివిధభారతిలో శ్రోతలు కోరిన పాటలు వేస్తున్నారు. నేను పిల్లల పేర్లు అడిగి తరువాతి పాటలో ఆ పేర్లు చెప్పాల్సిందని మా డ్యూటీ రూముకు ఫోన్ చేసి చెప్పాను. మదన్ మోహన్ గారింట్లో ఓ చక్కటి పెంపుడు కుక్క వుంది. దాని పేరు పింకీ అనుకుంటా. ఆ పేరు కూడా చెప్పాను. వెంటనే ఆ పేర్లన్నీ రేడియోలో వచ్చాయి. మదన్ మోహన్ గారు ఆ రోజు ఎంత సంతోషపడ్డారో, తన పెంపుడు కుక్క పేరు కూడా రేడియోలో వచ్చినందుకు.



(28-09-2021)

27, సెప్టెంబర్ 2021, సోమవారం

మీరేమిట్లు? – భండారు శ్రీనివాసరావు

‘నాన్నా మనమేమిట్లు?’ అన్నాడు మా పెద్ద కొడుకు సందీప్ ఓ రోజు స్కూలు నుంచి రాగానే.

ముందు ఆ ప్రశ్న అర్ధం కాలేదు. కాసేపటి తర్వాత చిన్నప్పుడు ఈ మాట మా బామ్మగారి నోటంట విన్న సంగతి గుర్తుకువచ్చింది. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి రాగానే వారిని ‘ఏమిట్లు’ అని అడిగేది. నాకు ముందు అర్ధం అవకపోయినా అర్ధం అవడం మొదలయినప్పటి నుంచి ఆ మాట వినగానే చిరాకేసేది. (ఏమిట్లు అంటే మీరెవరు? ఏం కులం?)
మా ఇద్దరు పిల్లల్నీ చిక్కడపల్లిలో మా ఇంటికి రిక్షా దూరంలో హిమాయత్ నగర్ సెంట్ ఆంథోనీ స్కూల్లో చేర్పించాను. మొదటి రోజే నాకూ ఆ స్కూలు ప్రిన్సిపాల్ గ్రిగరీ రెడ్డి గారికీ మాట తేడా వచ్చింది.
‘మీరెన్నయినా చెప్పండి ఆ కాలమ్ (Column) నేను పూర్తి చేసేది లేదు’ అనేశాను.
‘అలా ఎలా కుదురుతుంది. అది రూలు’ అన్నారాయన ఇంకా గట్టిగా.
‘అన్నీ రూలు ప్రకారమే చేస్తున్నారా’ అన్నాను ఒకింత వెటకారంగా.
‘చూడండి. మీరు రేడియో జర్నలిస్టు అని మీ ఇద్దరు పిల్లలకీ డొనేషన్ తీసుకోలేదు. మిగిలిన వారి దగ్గర తీసుకోకపోతే స్కూలు నడపలేము’
‘అప్లికేషన్ లో పిల్లవాడి కులం రాస్తేనే స్కూలు నడుస్తుందా?
ఇండియన్ అని మాత్రమే రాస్తాను, కావాలంటే రెలిజియన్ రాస్తాను. అంతేగాని కులం పేరు రాయను’
చెప్పి వచ్చేశాను.
ఆ తర్వాత ఏమీ కాలేదు. ఆయన ఆ ప్రసక్తి లేకుండానే ఇద్దరు పిల్లల్ని చేర్చుకున్నాడు.
ఇప్పుడు మళ్ళీ మావాడి మాటలతో ఆ గతం గుర్తుకువచ్చింది.
‘ఎవరు అడిగారు’ అన్నాను మా వాడితో.
‘నా క్లాస్ మేట్స్ అడుగుతున్నారు’
‘తెలవదని చెప్పు’
‘సరే’ అని వెళ్ళిపోయాడు.
అప్పటినుంచి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి వాళ్ళంతట వాళ్ళు తెలుసుకునే దాకా వారి కులం ఏమిటో తెలవకుండా వారి చిన్నతనం గడిచింది.




(NOTE: COURTESY IMAGE OWNER)


26, సెప్టెంబర్ 2021, ఆదివారం

క్షణం తీరికలేని మనిషికి దొరికిన మధుర క్షణాలు. - భండారు శ్రీనివాసరావు

  


తోట్లవల్లూరును మరచిపోలేను – డాక్టర్ నోరి దత్తాత్రేయుడు  

(కేన్సర్ చికిత్సలో ప్రపంచ ప్రఖ్యాత  కీర్తి గడించిన  డాక్టర్ నోరి దత్తాత్రేయుడు 2016 లో ఒకరోజు కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో పర్యటించి తన చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాను చిన్నప్పుడు నివసించిన ఇంటిని సాంబశివరావు అనే ఆసామీ  కొనుగోలు చేసి అక్కడే కొత్తగా  నిర్మించుకున్న ఇంటికి వెళ్లి అంతా  కలయ తిరిగిచూసారు. ‘ఇక్కడో బావి వుండాలే!’ అని ఆ ఇంట్లోవారిని వాకబు చేశారు.   పమిడిముక్కల మండలం ఘంటాడలో తాను జన్మించినా, కుటుంబ సభ్యులతో చిన్నతనంలో  గడిపిన తోట్లవల్లూరును జీవితంలో మరచిపోలేనని చెప్పారు. తనకు నామకరణం చేసిన కలగా పూర్ణచంద్ర శాస్త్రి ఇంటివద్ద కొద్దిసేపు గడిపి వేణుగోపాలస్వామి ఆలయంలో  అర్చకులు ప్రసాదంగా ఇచ్చిన చిట్టి గారెలు తిని దాదాపు యాభై అరవై  ఏళ్ళ నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.

ఈ నేపధ్యంలో నా రేడియో సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు గారు నోరి దత్తాత్రేయుడు గారెతో తన చిన్నతనం ముచ్చట్లు గుర్తుచేసుకున్నారు. అలాగే, అమెరికాలో ఉంటున్న నెప్పల్లి  ప్రసాద్ గారి అబ్బాయి పెళ్ళిలో జరిగిన సంఘటన సినిమా రీలులా ఆయన కళ్ళముందు కదలాడింది.

ప్రసాద్ గారు అమెరికాలో పేరుమోసిన చార్టర్డ్ అక్కౌంటెంట్. వారి ఆహ్వానం మేరకు కృష్ణారావు గారు ఆ పెళ్ళికి వెళ్లారు. అక్కడ ఆయనకు  వూహించని అతిధి తారసపడ్డారు. ఆయనే నోరి దత్తాత్రేయుడు గారు. ఆయన హస్తవాసికి తిరుగులేదు. క్షణం తీరికలేని వైద్యులు. కేన్సర్ రక్కసి పీచమడిచే పనిలో పడి దేశదేశాలు తిరుగుతుంటారు.  దత్తాత్రేయుడి గారికి  నెప్పల్లి ప్రసాద్ గారు  అత్యంత ఆత్మీయులు. అందుకే వారి కుమారుడి వివాహానికి అమెరికానుంచి రెక్కలు కట్టుకుని వచ్చారు. వారిని పెళ్ళిలో చూడగానే కృష్ణారావు గారికి చిన్నప్పటి తోట్లవల్లూరు సంగతులు మదిలో మెదిలాయి. దత్తాత్రేయుడు గారి కుటుంబం, కృష్ణారావు గారి కుటుంబం యాభయ్ , అరవై ఏళ్ళనాడు ఆ వూళ్ళో ఒకే ఇంట్లో నివాసం వుండేవి. చిరకాలం నాటి  బాల్య మిత్రుడు అన్నేళ్ల తరువాత   తారసపడగానే కృష్ణారావు గారు ఆయనతో మాటలు కలిపారు. మాటల మధ్యలో తోట్లవల్లూరు సంగతి ఎత్తారు. పెళ్ళిలో నలుగురి మధ్యవున్న కారణంగానో యేమో ఆయన  నుంచి వెంటనే  స్పందన కాన రాలేదు. అయినా కృష్ణారావు గారు నిరుత్సాహ పడలేదు. పెళ్ళయిన తరువాతో అంతకు  ముందో కాని, భోజనాల సమయంలో  మరోసారి దత్తాత్రేయుడు  గారితో ముచ్చటించే వీలు చిక్కించు కున్నారు. చిన్నప్పటి సంగతులు కొన్ని  గుర్తు చేశారు. ఈ సారి ఆయన గుర్తుపట్టినట్టే అనిపించింది.

“ఎన్నో ఏళ్ళయింది తోట్లవల్లూరు వెళ్లి. మేము అమ్మేసిన ఇల్లెలా వుంది? వూరెలా వుంది ?” అని అడిగారు.

‘వీలయితే ఈసారి కలసివెడదాం’ అని కూడా అన్నారు.  

“కోట పోయింది. చదువుకున్న స్కూలు అలాగే వుంది. మనం ఆడుకున్న గుడీ అలానే వుంది. పక్కన కృష్ణానది అందరి  జ్ఞాపకాలను వొడిలో దాచుకుని అలాగే పారుతోంది.” బదులు చెప్పారు.

అంతటితో ఆగలేదు. చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలు, మసలిన మనుషులు అన్నింటినీ  గుర్తుచేశారు.

“వేణుగోపాలస్వామి ఆలయం, గుళ్ళో ప్రసాదంగా పెట్టే చిట్టిగారెలు, కట్టు పొంగలి రుచి, వాళ్లు వున్న ఇల్లు, ఇంటి ముందు గిలక బావి, దొడ్లో బాదం చెట్టు” ఇలా ఒకటేమిటి గుర్తుకొచ్చినవన్నీ పూసగుచ్చినట్టు చెప్పేశారు కృష్ణారావు గారు.

కృష్ణారావు గారి నాన్న గారు రాయసం గంగన్న పంతులు గారు. దేవాదాయ శాఖలో ఉద్యోగి. చిన్న చిన్న దేవాలయాలను పర్యవేక్షించే అధికారి. బదిలీ మీద కుటుంబాన్ని వెంట తీసుకుని తోట్లవల్లూరు వెళ్లారు.

ఆ వూళ్ళో నోరి సత్యనారాయణ గారింట్లో ఓ వాటా అద్దెకు తీసుకున్నారు.

సత్యనారాయణ గారికి   నలుగురు కుమారులు. పెద్దబ్బాయి  నోరి రాధాకృష్ణ మూర్తి గారు. ఐ.పి.ఎస్. అధికారి. పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ గానో ఆ పై పదవిలోనో రిటైర్ అయ్యారు. పోలీసు ఉద్యోగంలో చేరక మునుపు ఆయన బందరు కాలేజీలో లెక్చరరుగా పనిచేసేవారు.

రెండో కుమారుడు ఎన్.మధురబాబు గారు. స్టేట్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ చేశారు. ఇందిరాగాంధీ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామీణ బ్యాంకుల  వ్యవస్థలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొల్పిన మొట్టమొదటి గ్రామీణ  బ్యాంక్ – నాగార్జున గ్రామీణ బ్యాంక్ కు మొదటి  చైర్మన్ గా పనిచేసి సమర్ధుడయిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జ్యోతిష శాస్త్రంలో కూడా దిట్ట, మూడో కుమారుడు రామతీర్ధ కాగా, కనిష్ట  కుమారుడు నోరి దత్తాత్రేయుడు గారు. చిన్నప్పుడు ‘దత్తు’ అని పిలిచేవాళ్ళు.

కొత్త వూరిలో కృష్ణారావుగారికి కొత్త స్నేహితులు లభించారు. ఆటపాటలతో కాలక్షేపం చేసేవారు. ‘అమ్మా నాన్నా ఏదయినా పనిమీద బెజవాడ  వెళ్ళాల్సి వస్తే ఆ నాలుగు రోజులు తన భోజనం పడకా కూడా నోరి  వారింట్లోనే’ అని కృష్ణారావు గారు నాతో  ఈ విషయాలు చెబుతూ గుర్తు చేసుకున్నారు.   

వారి తండ్రిగారి అకాల మరణం తరువాత నోరి వారి మకాం బందరుకు మారిపోయింది.

కృష్ణారావు గారు మాత్రం తండ్రిగారి  ఉద్యోగరీత్యా  తోట్లవల్లూరులోనే మరికొంత కాలం గడిపారు.

ఆ నాటి రోజులు గురించీ, అప్పటి వాతావరణం గురించీ ఆయన మాటల్లోనే.              

‘నదికి ఆనుకునే కాలవ. బెజవాడ నుంచి లాంచీలు తిరుగుతుండేవి. శివ కామేశ్వరి, శివ పార్వతి, గంగ వాటి పేర్లు.         

‘నోరి వారి కుటుంబం యావత్తూ కుసుమ హరనాధ బాబా భక్తులు.  ఇంట్లో  రోజూ భజనలు. పూజలు. తండ్రి చని పోయిన తరువాత వారి కుటుంబం బందరు వెళ్ళగానే ఆ వాటాలోకి అప్పయ్య శాస్త్రి గారు అద్దెకు దిగారు.

‘తోట్లవల్లూరులో వాళ్లు వున్న ఇల్లు బాగా పెద్దదేమీ కాదు. ఉత్తర ముఖంగావున్న ఆ ఇంటి ముందు గిలక బావి. దొడ్లో బాదం చెట్టు. కుడి పక్క  తాడికొండ వారి నివాసం. ఆ ఇంట్లోనే రామమందిరం. దాపునే తోట్లవల్లూరు కరణం గారయిన అడిదం వారి ఇల్లు. మరోపక్క గోవిందరాజుల వాళ్లు వుండేవాళ్ళు. పోతే,  శివలెంక వీరేశలింగం గారి  ఇల్లు కూడా పక్కనే. వీరేశలింగం గారు పేరు మోసిన  పెద్ద జ్యోతిష్కులు. సినీ నటుడు   ముదిగొండ లింగమూర్తి గారి  వియ్యంకులు. మద్రాసునుంచి భానుమతి వంటి ప్రముఖ సినీ  కళాకారులు కూడా ఆయనను కలవడానికి తోట్లవల్లూరు వచ్చేవాళ్ళు. వీరేశలింగం గారి  అబ్బాయి ఎస్.వి.ఎం. శాస్త్రి గారు  దక్షిణ  మధ్య రైల్వేలో ఉన్నతాధికారిగా పనిచేశారు. తోట్లవల్లూరులోని శివాలయానికి శివలెంక వారు అనువంశిక ధర్మ కర్తలు.

‘వూళ్ళో వున్న పెద్దగుడి వేణుగోపాలస్వామిది. ఆ గుడికి తగ్గట్టు  పెద్ద గాలి గోపురం. దాని మీద పావురాళ్ళు. వాటి రక్తం పూస్తే పక్షవాతం వంటి రోగాలు నయమవుతాయని చెప్పుకునే వాళ్లు. అది బొమ్మదేవరపల్లి  జమీందారులు కట్టించిన గుడి కావడం వల్ల వైభోగానికి  తక్కువలేదు. పూజలు, పునస్కారాలు, ప్రసాదాల వితరణ ఘనంగానే  జరిగేవి. తిరునక్షత్రం నాడు పులిహోర చేసేవాళ్ళు. పర్లాంగు దూరంలో  కృష్ణానది. ధనుర్మాసంలో ఆలయ అర్చకులు ఆ బావినుంచి మంగళ వాయిద్యాలతో తీర్ధపు బిందెలు తెచ్చేవాళ్లు. మా  పిల్లల  ఆటలన్నీ గుళ్ళో పొగడ చెట్టు కిందనే.

‘మా వీధి లోనే పోస్టాఫీసు. అన్నంభొట్లవాళ్లు టపా పని చూసేవారు. ఉయ్యూరు నుంచి ప్రతిరోజూ ఒక భారీ మనిషి  (పోస్టల్ రన్నర్) తపాలా సంచీ మోసుకుంటూ అయిదుమైళ్లు గబగబా నడుచుకుంటూ  తోట్లవల్లూరు వస్తుండేవాడు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ, చేతిలో వున్న పొడుగుపాటి బల్లేన్ని నేల మీద పోటు  పొడుచుకుంటూ  అతగాడు నడిచివస్తుంటే ఆ బల్లెం పైన కట్టిన మువ్వలు అదోరకం శబ్దం  చేస్తుండేవి.

‘తోట్లవల్లూరు  జమీందారులు బొమ్మదేవర వంశీకులు వేణుగోపాలస్వామి దేవాలయానికి అనువంశిక ధర్మకర్తలే కాదు,  దానికి కర్తా కర్మా క్రియా అన్నీ వాళ్ళే.  జమీందార్ల దగ్గర ఏనుగుల్ని సంరక్షించే నాగయ్య అనే వ్యక్తి తరువాతి రోజుల్లో ఈ గుడి వ్యవహారాలూ కనిపెట్టి  చూసేవాడు. కృష్ణారావు గారి తండ్రి రాయసం గంగన్న పంతులు గారు ప్రభుత్వం తరపున అంటే దేవాదాయ శాఖ తరపున ఆలయం బాధ్యతలు  చూస్తుండే వారు. అప్పట్లో ఆయన నెల  జీతం  అరవై రూపాయలు. కరవుభత్యం కింద  ఇరవై రూపాయలు. పైన మరో అర్ధ రూపాయి. ఆ వూరి మొత్తంలో  నెలసరి అంత జీతం వచ్చేవాడు మరొకడు లేకపోవడం వల్ల అది చిన్న జీతంగా ఆయన ఎప్పుడూ భావించలేదు. కాకపొతే అంత జీతం అన్నది ఆయనకు వూళ్ళో ఒక ప్రత్యేకతను,అయాచిత  గౌరవాన్ని కట్టబెట్టింది.

‘ఆ రోజుల్లో బెజవాడ నుంచి  తోట్లవల్లూరుకు  ప్రైవేటు సర్వీసులవాళ్లు బస్సులు నడిపేవాళ్ళు. ఒకటి  రామాంజనేయ మోటార్ సర్వీస్, రెండోది గోపాలకృష్ణా ట్రాన్స్ పోర్ట్. బస్సులమీద ఆ  పేర్లు రాసివుండేవి. గోపాలకృష్ణా ట్రాన్స్ పోర్ట్  అని రాసి  పక్కనే ‘ఇన్ లిక్విడేషన్’ అని కూడా వుండేది. దాని అర్ధం ఇప్పటికీ తెలియదు. వీటిల్లో   రామాంజనేయా సర్వీసు బస్సు ఖచ్చితంగా  టైం ప్రకారం నడిచేది. ఒక బస్సు డ్రైవర్  పేరు సుబ్రహ్మణ్యం అని గుర్తు.

‘వెనుక బెజవాడ నుంచి  రావాలంటే చుట్టూ తిరిగి  రావాల్సివచ్చేది. ఇప్పుడు కృష్ణానది కరకట్ట మీదుగా హంసలదీవి దాకా రోడ్డు వేసారు. దాంతో  రాకపోకలు సులువయ్యాయి.

‘తోట్లవల్లూరులో  వున్న హైస్కూలే చుట్టుపక్కల వూళ్ళకు దిక్కు. వల్లూరిపాలెం నుంచి ఆడపిల్లలు  నడుచుకుంటూ స్కూలుకు వచ్చేవాళ్ళు. పక్కనున్న భద్రిరాజుపాలెం నుంచి కూడా చదువుకోవడానికి పిల్లలు  తోట్లవల్లూరు  రావడం గుర్తు.

‘వూళ్ళో గుర్రబ్బళ్లు  కూడా వుండేవి. ఒకరోజు బండి చక్రం కింద ఓ కుక్క పిల్ల నలిగి చనిపోవడం చూసిన పిల్లలకు ఆ రోజు అన్నం తినబుద్దికాలేదు.’

ఎలా సాగిపోయాయి కృష్ణారావు గారి పాత జ్ఞాపకాలు.

తోకటపా:

నోరి వారి కుటుంబంతో నాకూ ఓ బాదరాయణ సంబంధం వుంది. దత్తాత్రేయుడు గారి అన్నగార్లు రాధాకృష్ణ మూర్తిగారు, మధురబాబు గారు నా రేడియో విలేకరిత్వంలో బాగా పరిచయస్తులు. 1975 లో నేను రేడియోలో చేరడానికి మొదటిసారి హైదరాబాదు వచ్చినప్పుడు నాకు మొట్టమొదట పరిచయం అయిన ఐ.పి.ఎస్. అధికారి నోరి రాధ కృష్ణమూర్తి గారు. తర్వాత కేంద్రప్రభుత్వం గ్రామీణ బ్యాంకు వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు దేశంలో మొట్టమొదటి గ్రామీణ బ్యాంకును తెలంగాణా ప్రాంతంలోని ఖమ్మం, వరంగల్ జిల్లాలకు కలిపి ఖమ్మం ప్రధాన కార్యాలయంగా నెలకొల్పారు. దానికి మొదటి చైర్మన్ నోరి మధురబాబు గారు. వీరిద్దరూ అన్నదమ్ములనీ, వీరి మరో తమ్ముడు    ప్రపంచ ప్రసిద్ధి పొందిన డాక్టర్ దత్తాత్రేయుడనీ చాలాకాలం వరకు తెలియదు. దత్తాత్రేయుడు గారు ఒకసారి హైదరాబాదు వచ్చినప్పుడు మూసారాం బాగ్ లోని  మధుర బాబు గారింటికి వచ్చారు. ఆయన్ని రేడియోకి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు వీరందరూ సోదరులని తెలిసింది.



   PHOTO: Courtesy Eenadu 

25, సెప్టెంబర్ 2021, శనివారం

నేనేనా !

 

మొన్న నా పోస్టు ఒకటి చూసి మీరేనా ఇది రాసింది అనే అర్ధం వచ్చేట్టు మురళీకృష్ణ గారు కామెంటు పెట్టారు. నిజమే. కొన్ని సార్లు జీవితంలో జరిగిన సంఘటనలను ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనమేనా ఇలా ప్రవర్తించింది అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళ సంగతేమో కానీ నా వృత్తి జీవితంలో నా వ్యవహార శైలి గురించి తదనంతర కాలంలో తరచి చూసుకున్నప్పుడు అలా అనిపించిన సందర్భాలు బోలెడు.
ఆరేళ్ల క్రితం ఒకరోజు అనుకోకుండా మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్, తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ పీ ఎస్ రామమోహన రావు గారిని కలుసుకోవడం జరిగింది. బహుశా దశాబ్దానికి పై చిలుకు మాటే వారిని కలిసి. ఎంతో ఆప్యాయంగా పలకరించి పాత సంగతులు గుర్తు చేసుకున్నారు. తన పక్కన వున్న పెద్దమనిషికి నన్ను పరిచయం చేస్తూ, ‘ఇతడు శ్రీనివాసరావు, హెల్మెట్ ఫేం ‘ అన్నారు సరదాగా.
అసలు సిసలు పోలీసు అధికారి పీ ఎస్ రామమోహన రావు గారితో కొన్ని మరచిపోలేని అనుభవాలు వున్నాయి. నేను మాస్కో వెళ్ళేటప్పుడు ఆయన డీజీపీ. అప్పటికే కొందరం జర్నలిస్టులం మొదలు పెట్టిన యాంటీ హెల్మెట్ ఉద్యమంతో సీనియర్ పోలీసు అధికారులు మా పట్ల మనస్తాపంతో వున్నారు. నన్ను అరెస్టు చేయడం, ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా దర్యాప్తు కోసం వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటుచేయడం, ఆ వెంటనే నా మాస్కో ప్రయాణం, మా నడుమ సత్సంబంధాలలో పైకి కనబడని తేడా తీసుకువచ్చాయి. మాస్కో వెళ్ళబోయేముందు డీజీపీ రామమోహన రావు గారిని ఆయన ఆఫీసుకు వెళ్ళి కలిసాను. చాలా ఆప్యాయంగా పలకరించి క్షేమ సంచారాలు కనుక్కుని వీడ్కోలు చెబుతూ ఒక మాట అన్నారు. ‘మాస్కోలో పోలీసులతో జాగ్రత్త. మన దగ్గరలా హెల్మెట్ల విషయంలోలా ఠలాయిస్తే అక్కడ కుదరదు.’
వయసు అలాటిది మరి. నేనూ అలానే జవాబు చెప్పాను. ‘మాస్కో చాలా చలి ప్రదేశం అని విన్నాను. మంచు కురిసే రోడ్లపై ‘టూ వీలర్స్ ఎలౌ చేయరనుకుంటాను’
రామమోహన రావుగారు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా వున్నప్పుడు ఖమ్మం బస్ స్టాండులో ఒక ఉద్యోగితో సీటు రిజర్వేషన్ విషయంలో పేచీ వచ్చింది. హైదరాబాదు రాగానే ఘాటుగా ఓ పిర్యాదు రాసి పంపించాను. మూడు రోజుల తరువాత అనుకుంటాను, అదే ఉద్యోగి మా మేనల్లుడిని వెంటబెట్టుకుని హైదరాబాదు వచ్చాడు.
‘ఏదో తెలియక చేసాడు, ఇప్పుడు ఎమ్డీ గారు నీ పిర్యాదు మీద ఇతడిని చాలా దూరం ట్రాన్సఫర్ చేశారు, నాకు బాగా తెలిసిన వాళ్లు. నువ్వే మళ్ళీ ఏదో సర్ది చెప్పి బదిలీ క్యాన్సిల్ చేయించు’ ఇదీ మా వాడి రాయబారం.
సరేనని ఆయన ఆఫీసుకు వెళ్ళి కలిసి విషయం చెప్పాను. అప్పుడాయన ఇలా అన్నారు.
‘మీరు కంప్లయింటు ఇచ్చారు. మీ మీద గౌరవం కొద్దీ విచారణ కూడా జరపకుండా బదిలీ చేసాను. అదీ నేను చేసిన పొరబాటు. ఇప్పుడు మీ మాట విని మరో పొరబాటు చేయడం ఇష్టం లేదు. బదిలీ క్యాన్సిల్ చేయడం చిటికెలో పని. కాని సంస్థలో డిసిప్లిన్ మాటేమిటి. ఎమ్డీ ట్రాన్స్ఫర్ చేస్తే నాకొక లెక్కా! ఒక్క రోజులో మళ్ళీ క్యాన్సిల్ చేయించుకున్నానని అందరితో చెప్పుకుంటాడు. క్రమశిక్షణ దెబ్బతింటుంది. ముందు పోయి వేసిన చోట జాయిన్ కమ్మని చెప్పండి. ఓ ఆరు నెలల తరువాత మళ్ళీ వెనక్కు వేస్తాను’
దట్ ఈజ్ రామ్మోహనరావు గారు!
తోకటపా: ఇప్పుడు మళ్ళీ ఓసారి మొదటి పేరా చదువుకోవాలన్నమాట.



23-09-2021

24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

దేవుడికి కులమేదీ? – భండారు శ్రీనివాసరావు

 గాలికి కులమేదీ అని శివాజీ గణేషన్  కర్ణుడిగా నటించిన ‘కర్ణ సినిమాలో ఓ పాట వుంది. అలాగే దేవుడికి ఏమైనా కులం ఉందా! లేదు అనేదే నా జవాబు

సుమారు అరవై ఏళ్ళ కిందటి మాట.

ఖమ్మం జిల్లా, వల్లభి గ్రామం. కారణం తెలవదు కానీ ఆ వూళ్ళో అగ్రవర్ణాలకు, దళితులకు నడుమ ఘర్షణలు తలెత్తాయి. దళితవాడకు చెందిన మగవాళ్ళు, పెద్ద పెద్ద ఖామందులు ఎవరూ వూళ్ళో వుండలేక బయట ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్తితి. మా పెద్ద బావగారు అయితరాజు రామారావు గారు ఆ ఊరుకు పెద్ద. ఆయన పూనికపై నాగపూరు నుంచి కాబోలు, వినోబా శిష్యులు బన్సాలీ గారు వల్లభి వచ్చి అనేక రోజులు అక్కడే మకాం వేశారు. ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనేలా రెండు వర్గాల నడుమ సయోధ్య కుదిర్చి వెళ్ళారు.

తరువాత మా బావగారు వూళ్ళో ఓ రామాలయం కట్టించారు. ఒక హరిజనుడిని (ఇప్పుడు ఈ మాట వాడడం లేదు, దళితుడు అంటున్నారు, ఆ రోజుల్లో పత్రికలు అన్నీ ‘రామాలయంలో హరిజన పూజారి’ అనే పేరుతొ ఒక విడ్డూరమైన వార్తగా ప్రచురించాయి) ఆ గుడిలో పూజారిగా నియమించారు.



(NOTE: COURTESY IMAGE OWNER)


 

23, సెప్టెంబర్ 2021, గురువారం

ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా! – భండారు శ్రీనివాసరావు

 ఒక కధ చెబుతాను. నిజానికి ఇది కధ కాదు, ప్రతి చోటా జరుగుతున్న కధే.

అనగనగా ఒక ఊరు. ఉన్నట్టుండి ఆ ఊరికి ఓ వ్యాపారి వచ్చి ఓ దుకాణం తెరిచాడు. దాన్నిండా రకరకాల స్టీలు సామాన్లు. ఒకటి కొంటే మరోటి ఉచితం అన్నాడు. ఇంకేం జనం ఎగబడ్డారు. కొన్ని రోజులకు పోలీసులు లాఠీలు ఝలిపించాల్సినంతగా క్యూ లైన్లు పెరిగిపోయాయి.

అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ వ్యాపారి కష్టమర్లతో నమ్మకంగా చెప్పాడు. ఉత్తర హిందూ స్థానం నుంచి తెచ్చిన సరుకు అంతా అయిపొయింది. మళ్ళీ స్టాక్ వస్తోందని కబురు వచ్చింది. అప్పటివరకు మీరు డబ్బులు చెల్లిస్తూ వుండండి. సరుకు రాగానే రసీదు చూపించి వస్తువులు తీసుకువెళ్ళండి అని. అంతకు ముందు కొనుక్కుని లాభ పడ్డవాళ్ళు, కొనుక్కోవాలని చూసి నిరాశ పడ్డవాళ్ళూ మళ్ళీ ఎగబడి డబ్బులు కట్టారు.

అలా కొంత కాలం గడిచిన తర్వాత అతడు గుడారం ఎత్తేశాడు. జనం లబోదిబో అన్నారు.

 ఒక విలేకరి వెళ్లి ఓ పోలీసు అధికారిని అడిగాడు, ఆ వ్యాపారి షాపు ఓపెన్ చేసి ఇలా ఒకటికి మరోటి ఫ్రీ అని ఆశ పెట్టినప్పుడే చర్య తీసుకుని వుంటే బాగుండేది కదా! అని.

ఆయన చిద్విలాసంగా ఒక నవ్వు విసిరేసి ఇలా అన్నాడు.

“నిజమే! మాకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కదా! చర్య తీసుకునేది”

అప్పటి స్టీలు సామాను నుంచి, పువ్వు మీ అదృష్టం చెప్పును, పన్నెండు బ్యాండ్ల రేడియో ఉచితం అనే లూధియానా ప్రకటనల నుంచి, గల్లీల్లో చీట్లు వేసేవారి నుంచి,  అర్ధ శాతం అధిక వడ్డీ ఎక్కువ ఇస్తామని భ్రమ పెట్టే ప్రైవేటు గిడిగిడి బ్యాంకుల నుంచి, అది కట్టిస్తాం, ఇది కట్టిస్తాం, ముందు డబ్బు కట్టండి అని  పత్రికల్లో ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పించే వారి నుంచి, ఇదిగో ఇప్పటి సైబర్ మోసాల వరకు పరిస్థితి ఇంతే! ఏమీ మారలేదు. జనమూ మారలేదు. అలాగే మోసపోతూనే వున్నారు. పోలీసులూ మారలేదు, అప్పటిలాగే కంప్లయింట్ ఎక్కడా అని అడుగుతూనే వున్నారు.

Prevention is better than cure అంటూ నీతి పాఠాలు చెప్పేవాళ్ళు చెబుతూనేవున్నారు.

పుణ్యభూమి కళ్ళు మూసుకుని చూస్తూనే వుంది, ఆశ చచ్చినా, దురాశ పుట్టినా ఆ మనిషి చచ్చినవాడితో సమానం అనే సూక్తిని మౌనంగా మననం చేసుకుంటూ.


NOTE: Courtesy Image Owner  


(23-09-2021)      




“….also spoke” – భండారు శ్రీనివాసరావు

 సాంస్కృతిక సభలు, సమావేశాలు కవర్ చేసే ఇంగ్లీష్ పత్రికావిలేకరులకు అలవాటయిన పదం.

వక్తల సంఖ్య భారీగా వుంటే అందరి పేర్లూ, వాళ్ళు చేసిన ప్రసంగాలు తమ రిపోర్టులో ప్రస్తావించడం కష్టం కనుక, పలానా పలానా వాళ్ళు కూడా మాట్లాడారు అనడానికి ఇలా క్లుప్తంగా రాసి సరిపుచ్చుతుంటారు. అలాంటిదే ఇది.
హిందూ పత్రికలో ఓ పేరా వస్తే చాలు అదే మహాప్రసాదం అని మహామహులే భావిస్తారు. అలాంటిది ఓ పుస్తకం గురించి ఆ పత్రికలో ఏకంగా ఓ సమీక్షే వచ్చింది. ఇక నేను అనగానెంత. అంచేత నేను కూడా, పైన చెప్పినట్టు “….also spoke” అన్నమాట.
ఇక విషయం ఏమిటంటే!
ఓ పుస్తకం గురించి ఈ నెల మొదట్లోనే చెప్పుకోవడం జరిగింది. ఆ పుస్తకాన్ని తెలంగాణా గవర్నర్ (శ్రీమతి) డాక్టర్ తమిళసై రాజ్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఆ పుస్తకం రాసింది దాసు కేశవ రావు గారనే పెద్ద మనిషి (1867- 1934). ఈ దాసు గారెకి ఓ మనుమడు. ఆయన పేరు కూడా దాసు కేశవరావే. ఈ చిన్న దాసుగారు నా ఈడువాడే కానీ నాకంటే చాలా పెద్దవాడు, గొప్పవాడున్నూ. హిందూ దినపత్రిక హైదరాబాదు ఎడిషన్ డిప్యూటి ఎడిటర్/ బ్యూరో చీఫ్ గా చేసిన సీనియర్ జర్నలిస్టు. ఆయనా నేనూ ఉద్యోగార్ధులమై, దాదాపు కొంచెం అటూ ఇటూగా ఒకేసారి హైదరాబాదు వచ్చాము. అప్పటినుంచి పరిచయం.
పుస్తకం గురించి ఇప్పటికే హిందూ పేపర్లో సమీక్ష వచ్చింది కాబట్టి రచయితను గురించి చెప్పుకుందాం.
జర్నలిస్ట్ దాసు కేశవరావు గారి కుటుంబం చాలా పెద్దది. సుప్రసిద్ధమైనది. దాసు గారి కుటుంబానికి మూల పురుషుడు, దేవీ భాగవతం కావ్యం సృష్టికర్త అయిన దాసు శ్రీరాములు (1846- 1908) గారి కుమారుడే మన కథానాయకుడు దాసు కేశవ రావు సీనియర్. (బొంబాయి మొదలయిన చోట్ల చాలా కాలం వుండబట్టేమో, ఆయన పేరుకి చివర పంత్ అని చేర్చినట్టున్నారు) వారి కుటుంబంలో దాదాపు అందరూ న్యాయవాది వృత్తిలో స్థిర పడినప్పటికీ, ఈయన గారి అభిప్రాయాలు విభిన్నం. మన ఒక్కరి కడుపు నింపుకోవడం కాదు, పదిమందికీ ఉపాధి కల్పించాలనే సదుద్దేశ్యంతో వ్యాపారాలు చేయాలని అప్పటి బొంబాయి, హైదరాబాదు, ట్రావెన్ కూర్ సంస్థానాల్లో రైల్వే కాంట్రాక్టులు అవీ చేసి పుష్కలంగా డబ్బు గడించారు. ఆ డబ్బుతో, సంపాదించిన అనుభవంతో బెజవాడకు వచ్చి అత్యంత అధునాతన ముద్రణా పరికరాలతో 1896లో వాణి ప్రెస్ ప్రారంభించారు. అప్పటికి బెజవాడ వాసులకు కరెంటు అంటే ఏమిటో తెలియదు. తన సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి, ఒక చిన్నపాటి విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసుకుని వాణి ప్రెస్ తో పాటు,ఇరవై ఒక్క గదుల తన రాజ ప్రసాదానికి కూడా విద్యుత్ కాంతుల సొగసులు అద్దారు. అలాగే బాపట్లలో తన కుమార్తె పెళ్లి చేసినప్పుడు, అక్కడే ఒక పవర్ హౌస్ నిర్మించి (ఇప్పుడు రంగారావు తోట అంటున్నారు) కళ్యాణ మండపం యావత్తూ విద్యుత్ వెలుగులు నింపారు. అయిదు రోజులపాటు రంగరంగవైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలని, ప్రత్యేకించి విద్యుత్ దీపాల తోరణాలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బండ్లు కట్టుకుని బాపట్ల వచ్చేవారని ఆ రోజుల్లో వైనవైనాలుగా చెప్పుకున్నారు.
తెలంగాణా గవర్నర్ డాక్టర్ (శ్రీమతి) తమిళ్ సై రాజభవన్ లో ఆవిష్కరించిన ఈ పుస్తకానికి నా ముందు మాట - ఇంగ్లీష్ పుస్తకం గురించి తెలుగులో పరిచయం- అనే పేరుతొ రాశాను.
"మూడు దశాబ్దాల క్రితం నాకు రేడియో మాస్కోలో ఉద్యోగం వచ్చింది. నేను నా కుటుంబాన్ని వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లాను. ఆ దేశంలో శాకాహారులకు భోజనానికి ఇబ్బంది అని ఎవరో చెప్పగా విని, కొన్ని నెలలకు సరిపడా ఉప్పూ కారాలు, పోపుగింజలు మొదలయిన తిండిసామానులు సూటుకేసుల నిండా సర్దుకుని పట్టుకు పోయాము.
మాస్కో షెర్మితోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు కానీ మా ఆవిడ తెచ్చిన ఇంగువ డబ్బా కొంత తంటా తెచ్చిపెట్టింది. ఇంగువని ఇంగ్లీషులో ఏమంటారో ఆ క్షణాన చప్పున గుర్తు రాలేదు. అది తినే వస్తువనీ, వంటల్లో వాడతామనీ ఎన్నో విధాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసాను. ఘాటయిన ఇంగువ వాసన, వారి అనుమానాలను మరింత పెంచింది. చివరకు ఇంగువ ముక్క నోటిలో వేసుకుని నమిలి చూపించి, అది వారనుకునే మాదక పదార్ధము కాదని రుజువు చేసుకున్న తర్వాతనే అక్కడ నుంచి బయలుదేరలిగాము.
ఈ బాపతు మాలాంటి వాళ్ళు ఉంటారని దాసు కేశవరావు పంత్ గారు ఊహించే అంతకు యాభయ్ ఏళ్ళకు పూర్వమే ఒక పుస్తకం రాశారు. ‘ఇది జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకుంటే ఇంగ్లీషులో చక్కగా మాట్లాడగలుగుతారు’ అని దానికిందనే ఓ ట్యాగ్ లైన్ కూడా వుంది. ఆంగ్లంలో పట్టు సాధించాలని కోరుకునే తెలుగువాళ్ళకు పనికొచ్చే చిన్న పుస్తకం అన్నమాట. ఈ పుస్తకం పేరు A Vade Mecum. లాటిన్ పదం. చిన్ని పుస్తకం అని అనడం ఎందుకంటే, జేబులో పెట్టుకోవడానికి వీలైన గైడు లాంటిది అని తెలుగులో ఆ లాటిన్ పదానికి నిఘంటు అర్ధం.
ఇంగ్లీష్ బాగా తెలిసినవాళ్ళకు కూడా కొన్ని కొన్ని ఆంగ్ల పదాల తెలుగు సమానార్ధకాలు చప్పున స్పురించవు. మరీ ముఖ్యంగా సామెతలు, కాయగూరలు వగైరా.
ఉదాహరణకు ‘He is at his wits end for dinner’ అనే వాక్యాన్ని అనువాదం చేయాల్సివస్తే అది ఏ రూపం సంతరించుకుంటుందో వర్తమాన వార్తాపత్రికల్లో వస్తున్న అనువాదాలను చూస్తే తెలిసిపోతుంది. నిజానికి మనవైపు బాగా ప్రాచుర్యంలో ఉన్న ‘వాడికి పూటకు ఠికానా లేదు’ అంటుండే దానికి అది ఇంగ్లీష్ సమానార్ధకం అని ఈ పుస్తకంలో వుంది. అలాగే ‘She is near her time’ అని ఎవరైనా అన్నారనుకోండి. మన తెలుగు అనువాదకులు హడావిడిగా ఎలా రాస్తారో తెలుసుకోవడం పెద్ద కష్టమే కాదు. కానీ దాసు కేశవరావు పంత్ గారు దీనికి తెలుగు సమానార్ధకాన్ని పట్టుకున్నారు. ‘ఆవిడకు పురిటి ఘడియలు దగ్గరపడ్డాయి’.
గందరగోళంలోకి నెట్టే మరో వాక్యం. ‘It rains cats and dogs’. ఎప్పుడో, ఎక్కడో చదివాను. పిడుగుల వర్షం లాగా ‘పిల్లులు, కుక్కల వాన’ అనే అనువాదాన్ని. దాసు కేశవ రావు పంత్ గారు ‘కుంభపోత’గా వర్షం కురవడం’ అని రాసారు. బహుశా కుండపోతను ఆయన ‘కుంభ’పోతగా రాసివుంటారు. కుంభం అన్నా కుండ అనే అర్ధం కదా!.
ఇప్పుడు ఏది తెలుసుకోవాలన్నా గూగులమ్మ వుంది కదా అనే వాళ్ళు ఉండొచ్చు. వారికి ఇటువంటి పొత్తాలతో ఒరిగేది ఏమిటి అనే ప్రశ్న ఎదురు కావచ్చు.
అయితే ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన అంశం వేరే. దాసు కేశవ రావు పంత్ అనే పెద్దమనిషి ఎప్పుడో ఎనభయ్ ఏళ్ల క్రితమే ఇటువంటి బృహత్తర ప్రయత్నం చేసారు అనే సంగతిని వర్తమాన సమాజంలో జీవిస్తున్న వారికి తెలియచెప్పడానికి కూడా ఈ ప్రచురణ ఉపయోగపడుతుంది. ఇది పందొమ్మిదో ప్రచురణకు నోచుకున్నది అంటేనే దీనికి లభించిన ఆదరణ, దీనికి ఉన్న విశిష్టత బోధపడతాయి.
ప్రచురణకర్తలయిన మా వయోధిక పాత్రికేయ సంఘం వారికి మనఃపూర్వక అభినందనలు.



(21-09-2021)

22, సెప్టెంబర్ 2021, బుధవారం

టీవీల ముచ్చట్లు - భండారు శ్రీనివాసరావు

 

రైట్ రైట్

గతంలో ప్రైవేటు బస్సులు ఉన్నకాలంలో డ్రైవర్ కండక్టర్ తోపాటు ఒకక్లీనర్ కుర్రాడు కూడా ఉండేవాడు. ఎక్కాల్సినవాళ్ళు ఎక్కిన తరువాత బస్సు డోరుపై గట్టిగా చరుస్తూ రైట్ రైట్ అని గట్టిగా అరుస్తూ ముందున్న డ్రైవర్ కు వెళ్ళవచ్చు అనే సంకేతం ఇచ్చేవాడు. రైట్ రైట్ అంటే కదలమని అర్ధం. ఇప్పుడు టీవీ చర్చల మధ్యమధ్యలో యాంకర్లు రైట్ రైట్ అంటూ వుంటారు. ఇక్కడ రైట్ అంటే, చెప్పింది చాలు, ఆపమని సంకేతం. డ్రైవర్లు క్లీనర్ కుర్రాడి మాట వినేవాళ్ళు కానీ చర్చల్లో పాల్గొనే వాళ్ళు యాంకర్ గోడు వినిపించుకుంటారా.

 

ఇంత సింపుల్ అని ఇన్నాళ్ళు తెలియదు

"మొన్నీమధ్య ఏమీ తోచక పాలక పక్షాన్నీ, దాని నాయకుడి విధానాలను చెరిగిపారేస్తూ పోస్టు పెట్టాను. అప్పుడు ఏం జరిగిందో తెలుసా నేనే నమ్మలేకపోతున్నాను"

"ఏమి జరిగిందేమిటి? పోలీసులు కేసు పెట్టారా కొంపతీసి"

"కాదు, అలా అయితే ఆశ్చర్యం ఎందుకు? ఎప్పుడూ లేనిది ఓ ఛానల్ వాళ్ళు చర్చకు రమ్మని ఫోను చేసి ఇంటికి కారు పంపారు"

"తర్వాత...."

"ఇదా ఇందులో కిటుకని మర్నాడు ప్రతిపక్ష నాయకుడిని కడిగి గాలిస్తూ మరో పోస్టు పెట్టాను. తెల్లారేసరికల్లా చర్చలకు రావాలని మరో ఛానల్ నుంచి ఫోను"

 

ఈ పరిస్తితి ఇక మారదా?

"నగరంలో వర్షాలు, వరదలవల్ల ఘోరమయిన పరిస్తితి ఏర్పడిన పరిస్తితి కనబడుతోంది. ఈ పరిస్తితి ఇక మారదా అని స్థానికులు అనుకుంటున్న పరిస్తితే అనీచోట్లా కానవస్తున్న పరిస్థితి వుంది. అధికారులు ఎవ్వరూ రాని పరిస్తితిలోనే మా ఛానల్ ముందుగా అక్కడికి చేరుకున్న పరిస్తితి అని బాధితులు,  తమ పరిస్తితి గురించి మా విలేకరితో తమ గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి మీరు చూస్తున్నారు........"

అహో! టీవీ భాషకు పట్టిన దురవస్థ. ఒకే పేరాలో ఇన్ని పరిస్తితులా!

 

ఇక, ఈ మధ్య వచ్చిన కొన్ని ‘పదాలకు’ సోషల్ మీడియాలో లభించిన ప్రాచుర్యం ఏ స్థాయిదో అందరికీ తెలిసిందే!

జాతకం అంటేనే మారడం

 

తండ్రి పోతూ పోతూ ఇద్దరు మగపిల్లలకి ఆస్తిలో చెరిసగం రాసి పోయాడు. ఊరిమద్యలో ఇల్లూ, స్థలం పంచుకుంటే పెద్దవాడికి నాలుగు రోడ్ల కూడలిలో మూల స్థలం, చిన్నవాడికి దాని వెనుక స్థలం దక్కాయి. వూరు పెరుగుతూ ఉండడంతో పెద్దవాడి అదృష్టం పండింది. రెండు రోడ్లని కలిపే జాగా కావడంతో రోడ్డుకు ఆనుకుని మడిగీలు కట్టాడు. అదీ అద్దెకు తీసుకున్న వారి డబ్బులతోనే.  మంచి కిరాయిలు నెల నెలా చేతికి అందేవి. తమ్ముడికి కూడా అంత స్థలం ఉందన్న మాటే కానీ కాణీ ఆమ్దానీ లేదు. అతడిది నష్ట  జాతకం అన్నారు ఇంట్లోవాళ్ళు, బయట వాళ్ళు. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళయ్యేసరికి వూరు కూడా బస్తీ అయింది. రోడ్ల వెడల్పు కార్యక్రమంలో పెద్దవాడి మడిగీలు యెగిరి పోయాయి. వుండే ఇల్లు కూడా అరకొరగా తయారయింది. చిన్నవాడి పిల్లలు తమ చిన్న ఇంటి పెరట్లో కూరగాయలు పండించడం మొదలెట్టారు. వాటి అమ్మకాలతో ఆదాయం పెరిగింది. ఇద్దరు అన్నదమ్ముల పరిస్తితి అటుదిటుగా మారింది. ఈలోగా బస్తీ నగరంగా తయారయింది.

కొన్నాళ్ళకు ఆ దారిలో ఫ్లయ్ ఓవర్ నిర్మాణం అన్నారు, వస్తుందో లేదో తెలియదు కానీ పెద్దవాడి ఇల్లు పూర్తిగా ఎగిరిపోయింది. నష్ట పరిహారం భారీగానే ముట్టచెప్పారు, కాకపొతే కిస్తీల్లో చెల్లింపులు. చెట్టు కొట్టేస్తే పక్షులు ఎగిరిపోయినట్టు పెద్దవాడి కుటుంబం వలస పోవాల్సివచ్చింది.  వెనకవున్న తమ్ముడి  ఇల్లు ఆ వంతెన కాంట్రాక్టర్ ఆఫీసుకు అవసరమైంది. కళ్ళు చెదిరే కిరాయికి తీసుకున్నారు. ఆ స్థలంలోనే వాళ్ళ డబ్బులతోనే పెద్ద భవనం కట్టారు. పని పూర్తికాగానే అది మీదే అన్నారు. నివాసం  వుండగా కిరాయి డబ్బులు అదనం.  చిన్నవాడి జాతకం అంత గొప్పది అన్నారు అదే ఇంట్లో వాళ్ళు, అదే బయట వాళ్ళు.

తరాలు మారేసరికి ఇనుము  వెండయింది, వెండి ఇనుమయింది.

 

‘అదే జాతకం అంటే!’ అన్నాయి అదే నోళ్ళు.

(2017)