24, జులై 2021, శనివారం

పేరెంట్స్ డే

 (ఈ పదాన్ని తెనిగించడం నాకు మంచిగా అనిపించలేదు. అందుకే అలానే ఉంచేశాను)


“చూస్తుండండి. ఏనాటికో ఓనాడు మనవాడు మనం గర్వపడేలా గొప్పవాడు అవుతాడు” అంటుంది తల్లి.
“నాకూ వాడు ప్రయోజకుడు కావాలనే వుంది. కానీ వాడి తరహా చూస్తుంటే నమ్మకం కుదరడంలేదు” అది తండ్రి అభిప్రాయం.
వీరి అంచనాలు నిజం కావచ్చు, కాకపోవచ్చు.
కానీ.. ఆ తల్లిది ఆకాంక్షతో కూడిన అతివిశ్వాసం, ఆ తండ్రిది అపనమ్మకంతో కూడిన అభిలాష . ఇద్దరిదీ ఒకటే కోరిక, తమ పిల్లలు ప్రయోజకులు కావాలనే. తేడా అల్లా భావవ్యక్తీకరణలో. కల్మషం, కల్తీలేని ప్రేమ కన్నవారిది.
పిల్లలు పిల్లలుగా వున్నప్పుడు అనేకమంది తలితండ్రులది ఇదే పరిస్తితి. పిల్లలందరు పెద్దవాళ్ళు అవుతారు. కొద్దిమందే నిజంగా గొప్పవాళ్ళు కాగలుగుతారు. జీవితంలో బాగా ఎదిగొచ్చిన అనేకమంది సినీ నటులు, ఇతర రంగాల ప్రముఖులు పత్రికలకి ఇచ్చే ఇంటర్వ్యూలలో ఒక మాట చెబుతుంటారు, ‘తలితండ్రులు కష్టపడితే ఇలా పైకి వచ్చాం, కానీ మా ఎదుగుదలను మా కన్నవాళ్ళు కళ్ళారా చూడలేకపోయారనే బాధ మాత్రం మిగిలింది” అని.
తలితండ్రుల ప్రేమకు గుర్తింపుగా వారి పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఒక దినాన్ని కేటాయించారు.
మన దేశంలో ఈ ఏడాది, 2021 జులైలో వచ్చే ఆఖరి ఆదివారం పేరెంట్స్ డే. అంటే జులై, 25.
“ప్రపంచవ్యాప్తంగా తలితండ్రులను ఆదరించండి, ప్రేమించండి” అనేది ఈ ఏడాది పేరెంట్స్ డే నినాదం.
మన మేలుకోరే శ్రేయోభిలాషులు చాలామంది వుంటారు. కానీ మనం ఈ భూమి మీదకు రాకముందునుంచి మనల్ని మనసారా ప్రేమించేది, మనం బాగుండాలని కోరుకునేది మన తలితండ్రులు మాత్రమే.
(25-07-2021)

కామెంట్‌లు లేవు: