పత్రికల్లో ప్రకటనల ఖర్చు లేదు. నటీనటుల పారితోషికాల భారీ భారాలు లేవు. ధియేటర్లు దొరకవన్న బాధ లేదు. తీయడం వదలడం. అదేమిటో, కరోనా కూడా ఈ సినిమా నిర్మాణాలకు అడ్డంకి కాలేదు.
మధ్యాన్నం
భోజనం చేయగానే పిల్లలు ఆహానో ఓహోనో ఏదో ఒక ప్లాట్ ఫారం మీద ఓ ఓటీటీ సినిమా
పెడతారు. ఈ సినిమాల కోసమే పుట్టారు అన్నట్టు
కొందరు గడ్డపు హీరోలు. ఒక చేతిలో సిగరెట్టూ, మరో చేతిలో మందు గ్లాసు. “ధూమపాము, మద్యపానము ఆరోగ్యానికి హానికరం” అనే చట్టబద్ధ హెచ్చరికను సినిమా నడిచినంత సేపు వేసుకోవాల్సిన
దుస్థితి. ఏమైనా సరే, హీరోయిన్ ను పెళ్ళాడడమే హీరోయిజం అనే తరహాలో ఏదో
పగబట్టినట్టు ఆమెను భౌతికంగా, మానసికంగా హింసించడం,
పూటుగా తాగి, ఆమె ఇంటిమీదకు వెళ్లి తలితండ్రులతో నానా గొడవ పడడం. కన్నవారిని హేళన
చేయడం. ఆ హీరోకి తోడు ఓ చిన్న స్నేహితుల ముఠా. దాదాపు ప్రతి సినిమాలో ఇవే సీన్లు
రిపీట్.
ఆడపిల్లలు
క్లబ్బుల్లో అర్ధరాత్రి దాకా తాగడాలు. ఆపైన వారిపై దౌర్జన్యాలు ఇవన్నీ వీటిల్లో చూస్తుంటే కంపరంగా అనిపిస్తోంది.
వెనక
అనేవాళ్ళు వివిధ భారతిలో మంచి పాటలు వినాలంటే చేపలు పట్టేవాడికి వుండేంత ఓపిక
వుండాలని. ఎంతో వేచి చూస్తేనే గాలానికి ఓ
మంచి చేప పడేదిట. అలాగే ఓపికతో వినగా
వినగా రేడియోలో ఒక మంచి పాట వినబడుతుందట. ఈ ఓటీటీలో కూడా అంతే! ఎప్పుడో ఓసారి తగులుతుంది ఓ మంచి చిత్రం మళయాళం సినిమా డబ్బింగు రూపంలో.
ఇప్పటిదాకా ఓ పాతిక ముప్పయి ఇలాంటి సినిమాలు చూసివుంటాను.
అయితే అన్ని సినిమాలు కలిపి ఓ అరగంట కూడా చూసి ఉండను. పది నిమిషాలు చూడగానే విసుగుపుట్టి
తర్వాత నా పనేదో నేను చూసుకుంటాను.
వీటిల్లో
కనీసం ఓ పాతిక చిత్రాల మీద ఫేస్ బుక్ లో ఓసారి చూడొచ్చు అనే కితాబులు కనిపించాయి.
అది
ఆశ్చర్యం.
‘ఈ
సినిమాలు మీ తరం కోసం కాదులే అంకుల్. మీ ముందు తరం వాళ్ళు మెచ్చిన సినిమాలు
మీరెన్ని చూసారు?’
అని అడిగాడు ఓ బంధువుల అబ్బాయి.
ఆ
అబ్బాయి చెప్పింది మాత్రం పచ్చి నిజం.
తరం
మారినప్పుడు అభిరుచులు కూడా మారతాయి.
(23-07-2021)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి