16, జులై 2021, శుక్రవారం

కాలం చెల్లినవాటికి చెల్లుచీటీ – భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhraprabha dated 18-07-2021, SUNDAY)

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చక్కని మాట చెప్పారు.

కాలం చెల్లిన చట్టాలకు ఇకనైనా చెల్లు చీటీ రాయాలని.

భేషైన మాట. అందరి మనసులో వున్న మాట.

భారత శిక్షాస్మృతి లోని 124 -ఏ సెక్షన్ అనేది ఈనాటిది కాదు. దేశానికి స్వాతంత్రం రానప్పుడు, 1860 లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారి శిక్షాస్మృతిని అమల్లోకి తెచ్చింది. మొదట్లో దేశద్రోహ నేరానికి సంబంధించిన ఈ 124 -ఏ సెక్షన్ అనేది భారత శిక్షాస్మృతి (ఐ.పి.సి.) లో లేదు. తర్వాత పదేళ్లకు అంటే 1870లో ఈ నిబంధనను కొత్తగా చేర్చారు. జాతిపిత గాంధీజీ  పుట్టి ఆనాటికి ఏడాది మాత్రమే అయింది. తదనంతర కాలంలో అంటే స్వాతంత్ర ఉద్యమం తీవ్రంగా సాగుతున్న రోజుల్లో ఈ సెక్షన్ ను నాటి బ్రిటిష్ పాలకులు దుర్వినియోగం చేస్తున్న తీరుకు కినిసి, మహాత్మా గాంధి సయితం ఈ సెక్షన్ ను గట్టిగా వ్యతిరేకించారు. పౌరుల స్వేచ్ఛను అణచివేయడానికే దీన్ని రూపొందించారని ఆయన పలుమార్లు విమర్శించారు. గాంధీజీ ఒక్కరే కాదు, స్వాతంత్రానంతరం మొదటి ప్రధాని అయిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సయితం, ప్రధాని హోదాలోనే ఈ  125 -ఏ సెక్షన్ ను తప్పుబట్టారు.

”ఇది చాలా చెడ్డది. ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది” అని అనేవారు.

నెహ్రూ చనిపోయి ఏండ్లూపూండ్లు గడిచిన తర్వాత కూడా ఏ పాలకులు కూడా ఈ సెక్షన్ గురించి పట్టించుకోకపోవడంతో ఈ బ్రిటిష్ చట్టం 150 ఏళ్ళ నుంచి అమల్లోనే వుంది. ఉపయోగించిన సందర్భాలు, విచారణ జరిగి శిక్షలు పడిన సందర్భాలు తక్కువే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో ఇంకా రాజద్రోహ చట్టం ఏమిటి అనే ప్రశ్నకు సరయిన జవాబు ఇంకా దొరకలేదు.

గతంలో కూడా  124 -ఏ సెక్షన్ న్యాయస్థానాల దృష్టికి రాకపోలేదు. 1958 లోనే అలహాబాదు హైకోర్టు ఈ సెక్షన్ రాజ్యాంగ వ్యతిరేకమని అంటూ దాన్ని కొట్టివేసింది. దరిమిలా పంజాబు హైకోర్టు సయితం కొట్టివేసింది. అయితే సుప్రీంకోర్టు ఒక కేసును విచారిస్తూ ఈ రెండు హైకోర్టుల తీర్పులను పక్కన పెట్టింది. ఈ సెక్షన్ రాజ్యాంగపరంగా చెల్లుతుందని, అయితే అదొక మినహాయింపు మాత్రమేనని పేర్కొంది. కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది రాజద్రోహ నేరం కాదని స్పష్టం చేసింది. దాంతో ఈ చట్టానికి మళ్ళీ సంజీవని పుల్ల తాకించినట్టు అయింది.

ఇప్పుడు మళ్ళీ ఎడిటర్స్ గిల్డ్ తో పాటు ఒక మాజీ సైనికాధికారి ఈ అంశంపై వేసిన పిటీషన్లను సుప్రీం ధర్మాసనం గత గురువారం నాడు విచారణకు స్వీకరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడంతో ఈ అంశం మళ్ళీ దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. ఈ సందర్భంగా ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యలు మరింత తీవ్రమైన వాడివేడి చర్చలకు కారణమయ్యాయి.

“వలసవాద ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టం ఇంకా ఎన్నాళ్ళు? రాజద్రోహం సెక్షన్ ను ఎందుకు రద్దు చేయడం లేదు? స్వాతంత్రోద్యమ కాలంలో గాంధి, బాలగంగాధర్ తిలక్ వంటి నాయకుల నోళ్ళు నొక్కడానికినాటి ప్రభుత్వం ఈచట్టాన్ని వాడుకుంటే, ఈనాడు అదే చట్టాన్ని అధికారులు ఎడాపెడా వాడేస్తున్నారు” అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ అని వ్యాఖ్యానించారు.

సుప్రీం తన అభిప్రాయం తెలిపింది. అయితే దీనిమీద కేంద్రం ఏ చర్య తీసుకుంటుందో చూడాల్సివుంది. సుప్రీం సూచనలకు అనుగుణంగా 124 -ఏ సెక్షన్ ను రద్దు చేయాలని నిర్ణయిస్తే ఏ పేచీ వుండదు.

ఏ చట్టాన్ని  అయినా దాన్ని రద్దు చేసేంతవరకు అది చట్టం దృష్టిలో చెల్లుబాటు అయ్యే చట్టమే అని కొందరు న్యాయ కోవిదులు అంటున్నారు.

లోగడ కృష్ణయ్యర్ గారని ఓ న్యాయాధిపతి వుండేవారు. ఆయనది ఓ కొత్తదారి. పేరుకు ముందు జస్టిస్ అని తగిలించకపోయినా ఏమీ అనుకునేవారు కాదు. జడ్జీలకు, న్యాయవాదులకు మధ్య సాంప్రదాయ గౌరవవాచకాలు ఆయనకు గిట్టేవి కావు. న్యాయమూర్తులు  పొడుగుపాటి గౌన్లు, రోబ్స్ ధరించాలనే సాంప్రదాయాలు ఆయనకు నచ్చేవి కావు. అంతే కాదు, న్యాయ పీఠం మీద కూర్చున్న న్యాయమూర్తికి, కోర్టులో వాదించే న్యాయవాదులకు నడుమ దూరం పాటించడం, జడ్జీలు తమ ఆసనాలపై  కూర్చునేటప్పుడు, తిరిగి లేచేటప్పుడు  బంట్రోతులు వారు ఆసీనులు కావడానికి, లేవడానికి  వీలుగా వారి ఆసనాలను వెనక్కీ ముందుకు జరపడం అసలు ఇష్టపడేవారు కాదు. ‘లీగల్లీ స్పీకింగ్’  అనే పేరుతొ రాసిన పుస్తకంలో జస్టిస్ కృష్ణయ్యర్ ఈ అంశాలను పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో ఇటువంటి సమూల సంస్కరణలు రావాలని ఆయన కోరుకున్నారు కానీ ఆయన జీవిత కాలంలో నెరవేరలేదు.

ఇప్పుడు మళ్ళీ న్యాయ వ్యవస్థలో సంస్కరణలు గురించిన మాటలు వినబడుతున్నాయి. మంచిదే. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా పలుసందర్భాలలో ఈ విషయం ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఒక అడుగు అంటూ ముందుకు పడితే అది భారీ సంస్కరణలకు దోహదపడే అవకాశం వుంటుంది.

అచ్చంగా ఇలాంటిది కాకపోయినా కాలం చెల్లిన తర్వాత కూడా చెల్లుబాటులో ఉన్న కొన్ని అంశాలు మనకు చరిత్రలో దొరుకుతాయి.

వాటిల్లో కొన్ని.

ఉద్యోగం వుండదు కానీ ఉద్యోగం చేసే ఉద్యోగి ఉంటాడు. ఇదెక్కడి విరోధాభాసం అంటారా!

మనలో చాలామంది హైదరాబాదులోని ఆకాశవాణి కేంద్రాన్ని ఎప్పుడో ఒకప్పుడు సందర్శించే వుంటారు. రేడియో కేంద్రం సింహద్వారం పక్కనే ఓ స్తంభానికి వేలాడుతూ తళతళ మెరుస్తూ వుండే ఓ ఇత్తడి గంట కనిపిస్తుంది.

రేడియో స్టేషన్ లో ఈ ధర్మగంట అవసరం ఏమిటి? అనే ఆలోచన నిత్యం  నన్ను వేధిస్తూ వుండేది.(అక్కడ పనిచేసే రోజుల్లో)

విచారించగా తెలిసింది ఏమిటంటే ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తినప్పుడు, అదే సమయంలో  కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు అందరినీ అప్రమత్తం చేయడానికి ఆ గంటను మోగిస్తారని  తెలిసింది.  మూడు దశాబ్దాల నా ఉద్యోగపర్వంలో ఒక్కసారి కూడా ఆ గంట మోగించిన దాఖలా లేదు. ఆ గంటను శుభ్రంగా తుడిచి పదిలంగా కాపాడడానికి  ప్రత్యేకంగా ఓ ఉద్యోగి వుండేవాడేమో కూడా తెలియదు.

ఒకానొకకాలంలో, బహుశా స్వాతంత్రానికి పూర్వం అనుకుంటాను,  భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే ప్రభుత్వ వైద్యులకు రవాణా సదుపాయాలు సరిగా ఉండేవి కావు. రహదారులు అధ్వానంగా ఉండేవి. ఎటు పోవాలన్నా ఎడ్ల బండ్లే శరణ్యం. ఆ రోజుల్లో, అలాంటి ప్రాంతాల్లో  ప్రభుత్వ వైద్యులకు జీపు బదులు ఎడ్ల బండి ఏర్పాటు వుండేది. ఒక బండి, అది సర్కారు వాహనం కాబట్టి  జత ఎడ్లు,  వాటికి  గ్రాసం, బండిని నడపడానికి జీపు డ్రైవర్ మాదిరిగా ఒక పనివాడు, ఈ తతంగం అంతా నడవడానికి ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల చెల్లింపు  ఇలా సాగిపోయేది.

కొన్నేళ్ళ తరువాత ఆ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు కొద్దో గొప్పో మెరుగు పడడం వల్ల సర్కారీ విల్స్  జీపులు రంగ ప్రవేశం చేయడంతో, ఎడ్లబండ్ల అవసరం లేకుండాపోయింది. అయినా కూడా చాలా కాలంపాటు ఆ వ్యవస్థ రికార్డుల్లో కొనసాగేది అని చెప్పుకునేవారు. 1970 ప్రాంతాల్లో అక్కడ పనిచేయడానికి వెళ్ళిన ఒక డాక్టరు గారికి మనుషులకు  వైద్యం చేసే  దవాఖానాలో ఈ పశుగ్రాసం బిల్లులేమిటి అని అనుమానం వచ్చి ఆరా తీస్తే ఈ అసలు విషయం బయట పడింది.

మనలో చాలామంది పూర్వపు తహసీల్ కచేరీలు చూసి వుంటారు.  పంకాలు లేని ఆ కాలంలో తహసీల్ దొరగారు కూర్చొనే సీటు మీద ఒక పెద్ద గుడ్డ పంకా వుండేది. ఒక బంట్రోతు దొరవారు దాన్ని అటూఇటూ తాడుతో లాగుతూ వుంటే అయ్యవారు మెల్లగా వీచే ఆ చల్లగాలిలో సేద తీరుతూ రాచకార్యాలు చక్కబెడుతూ వుండేవారు.

తరవాత్తరవాత విద్యుత్ పంకాలు వచ్చాయి కానీ గుడ్డ పంకాలు లాగే కొలువు మాత్రం చాలాకాలం కొనసాగింది.

మన దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో అమలు చేసిన పంచవర్ష ప్రణాళికల ధర్మమా అని అన్ని స్థాయిల్లో రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలు పుట్టుకు వచ్చాయి. మా చిన్నతనంలో మా ఊరికి వి.ఎల్.డబ్ల్యు. అనే  ఉద్యిగి కొత్తగా వచ్చాడు. అప్పటిదాకా కరణం, మునసబు మాత్రమే ప్రభుత్వం అనుకునేవారు. అలాగే బ్లాకు డెవలప్మెంట్ ఆఫీసర్ (బీడీవో) ఉద్యోగం కూడా కొత్తగా వచ్చిందే. ఇప్పుడు అవే ఉద్యోగాలు  పాతపడి పేర్లు మారిపోయి వుంటాయి.

‘ఒక గుంతను తవ్వు. ఆ గుంతను పూడ్చు. గుంత తవ్విన వాడికి ఓ ఉద్యోగం, దాన్ని పూడ్చిన వాడికి మరో ఉద్యోగం” ఈ పద్దతిలో అనేక ఉద్యోగాలు. అయినా దేశంలో నిరుద్యోగ సమస్య అలాగే వుంది.

(EOM)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...


వచ్చిన కొత్త లో ఇలాగే జోష్ తో ఏదేదో మార్చేయాలనుకుంటారండి జస్టిస్లు.

ఆ తరువాత కళ్లలో నీళ్లొత్తేసుకుని ప్చ్ మాకు సరైన
మానవ వనరులు లేదే ఇల్లాంటివి చేయడానికని బోరుమంటూ ముక్కు చీదేసుకుంటారు.

రమణ గారి పై ఆశలెట్టేసుకోవచ్చంటారా?