“డాట్టరు గారూ! మీ ఫీజు సరే కానీ మీరు రాసిన ఈ మందులు ఎక్కడ దొరుకుతాయండీ?”
“అదే మరి కాలేది.
అవతల అంత మంది పేషెంట్లు వుంటే ఏవిటీ చచ్చు, చొప్పదంటు ప్రశ్న?”
“అలా కోపం
చేసుకోకండి. మీరు పెద్దమనసుతో వింటానంటే చెబుతా!”
“అదేదో తొందరగా
చెప్పి ఏడవ్వయ్యా మగడా!”
“మొన్నీమధ్య మా చిన
బామ్మర్దిగాడి మూడో బామ్మర్ధికి ఒంట్లో నలతగా వుంటే మీ దగ్గరికే పంపించాకదండీ.
మీరేమో మంచిగా చూసి మాత్తర్లు అవీ రాసిచ్చారు కదండీ. ఆడేమో ఆ చీటీ అట్టుకుని
వూళ్ళో సగం మందుల షాపులు చుట్టేశాడండీ! కానేమోనండీ ఒక్క చోట దొరికితే ఒట్టండీ.
ఒకడేమో అదే మందు గోలీలు వేరే కంపెనీవి వున్నాయంటాడు. మీరు కోప్పడతారనుకుని
వేరే షాపుకు వెళ్ళాడండీ. ఆడేమో వందా నూటయాభయ్యా అని అడిగాడుటండీ. వందలూ, ఏలూ మాత్తర్లు
నాకెందుకయ్యా, నీలాగా దుకాణం వుందనుకున్నావా అన్నాట్ట మా వోడు. దుకాణపోడు పెద్దగా నవ్వి, ‘అదికాదయ్యా బాబూ పవరు, మాత్తర్ల పవరు
యెంత నూరా నూట యాభయ్ ఎంజీలా’ అని అడిగాట్ట. ‘ఆ పవర్లు మీ డాట్టారు రాయలేదు ముందు
పోయి కనుక్కో. తర్వాత వచ్చి మందు కొనుక్కో’ అన్నాట్టండీ. ఫీజు వంద అంటే ఇచ్చాము
కానీ ఈ మాత్తర్లకు కూడా ఇంత ఇసయం వుందా అని మా ఓడు తెగ మనాది పడిపోయి, ఆ మాత్తర్ల
కోసం తిరిగి తిరిగి చివరికి కొననేలేదు. వాడనేలేదు. కానండీ, డాట్టరు బాబూ, మీ చేయి వాసి మహా గొప్పది కదండీ, అంచేతండీ, ఆడికండీ
జరం చేత్తో తీసేసినట్టు తగ్గిపోయిందండీ! ఏ గోలీ వేయకుండానే’
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి