రామచంద్ర మూర్తికి కాలు నిలవడం లేదు. అమెరికానుంచి గోపీ పిల్లలూ వస్తున్నారన్న కబురు తెలిసినప్పటి నుంచి ఆకాశంలో తేలిపోతున్నట్టుగా వుంది. అప్పటికప్పుడు పెన్షన్ డబ్బులు బ్యాంకు నుంచి తీసి రెండో గదిలో ఏసీ పెట్టించాడు. పిల్లలకు సౌకర్యంగా వుండాలని బాత్ రూమ్ లో వెస్ట్రన్ టాయిలెట్ పెట్టించాడు. ప్రతి గదిలో దోమలు రాకుండా కిటికీలకి మెష్ పెట్టించాడు. భార్య మహాలక్ష్మి అంటూనే వుంది, ‘వాడేమన్న పరాయి వాడా, ఇక్కడపుట్టి ఇక్కడ పెరిగి వెళ్ళిన వాడేనాయే. అంతా మీ చాదస్తం’ అని. కానీ రామచంద్రమూర్తి చెవిన పెట్టలేదు. ‘అప్పుడు వేరు, ఇప్పుడు వేరు, పరాయి దేశంలో కొత్త సౌకర్యాలకు అలవాటు పడి వస్తే ఇబ్బంది లేకుండా చూడ్డం మన ధర్మం’ అని నచ్చచెప్పాడు. ఈ లోగా అమెరికా నుంచి వాళ్ళు వచ్చే రోజు దగ్గర పడింది. ఆయన హడావిడి మరింత పెరిగింది.
అక్కడ అమెరికాలో
విమానం ఎక్కబోయేముందు గోపీ, భార్యాపిల్లలతో మరోసారి
చెబుతున్నాడు.
‘చూడండి మనం చాలా
ఏళ్ళ తరువాత బామ్మా తాతయ్యల దగ్గరికి వెడుతున్నాం. అక్కడ అన్నీ ఇక్కడి మాదిరిగా
వుండవు. ఎలా వున్నా మనందరం సర్దుకు పోవాలి. వున్న మూడు నాలుగు వారాలు మనకేం
ఇబ్బంది లేనట్టు గడిపి రావాలి. అది వసతిగా లేదు, ఇది లేదు అని సణగొద్దు. ఇండియాలో టాయిలెట్లు మన మాదిరిగా వుండవు. అయినా సరే నాలుగు
రోజులు సర్దుకు పోదాం. అంతేకాని బామ్మను తాతయ్యను ఇబ్బంది పెట్టవద్దు. మనం వచ్చామన్న
సంతోషం వాళ్లకు కలిగించాలి. వున్నన్నాళ్ళు పూర్తిగా వాళ్ళతోనే గడపాలి. సినిమాలు, షికార్లు ఏవయినా మళ్ళీ తిరిగి వచ్చిన తరువాతే సుమా!’
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి