(ఈరోజు వై.ఎస్. రాజశేఖరరెడ్డి జయంతి)
వై.ఎస్. జగన్ మోహన రెడ్డి తన పాదయాత్ర సందర్భంలో ప్రజలకు ఇచ్చిన
హామీలను నవరత్నాలుగా మలిచి రూపొందించిన మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలను
ఒక్కొక్కటిగా అమలులోకి తీసుకువచ్చే కార్యక్రమంలో ఆయన తలమునకలుగా
వున్నారు. ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి దృష్టికి,
వారి నాన్నగారు వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా
వున్నప్పుడు కన్న ఓ కలను గుర్తుచేయడానికే ఈ ప్రయత్నం. ఆయన మదిలో
రూపుదిద్దుకున్న ఓ బృహత్తర పధకం తుది రూపం దాల్చకముందే, ఆ పధకం ఫలితాలను
కళ్ళారా చూడకుండానే వై ఎస్, హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించారు. ఆయన మృతి
కారణంగా ఒక చక్కటి పధకం తుదికంటా అమలుకు నోచుకోలేదు.
దీనికి పూర్వరంగం గురించి చెప్పడం సముచితంగా వుంటుంది.
అప్పటికే, 108 అంబులెన్సులు రాష్ట్రాన్ని చుట్టిపెడుతున్నాయి. అత్యవసర
వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి అనిపించుకుంటున్నాయి.
నిజానికి ఈ సర్వీసులకు ప్రాచుర్యం కల్పించిన ఘనత రాజశేఖరరెడ్డి గారిదే. ఏ
పబ్లిక్ మీటింగ్ లోనయినా సరే - 'కుయ్ ...కుయ్' మని 108 అంబులెన్సు చేసే
సైరన్ ధ్వనిని అనుకరిస్తూ ఆ సర్వీసు ప్రాముఖ్యాన్ని ప్రజలకు
తెలియచేసేవారు.
ఆ రోజుల్లోనే, సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు సంబంధించి మరో
ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది. అదే 'ఫిక్సెడ్ డేట్ హెల్త్
సర్వీస్' (ఎఫ్.డీ.హెచ్.ఎస్). అంటే నిర్దేశిత దిన వైద్య సేవలు.
ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.
ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో
ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను
తీరుస్తున్నప్పటికీ, డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే
మిగిలిపోతున్నది. మన (ఉమ్మడి) రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటే, కేవలం పదిహేను
వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా
పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా
లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య
కేంద్రాలకు దూరంగా వున్న కుగ్రామాల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం
కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయాదాక్షిణ్యాల పైనా, వారిచ్చే
నాటుమందుల పైనా ఆధారపడాల్సిన దీనస్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు
లేకుండా కొండ ప్రాంతాలలో, అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి
తండాల్లో వుండే పేదవారికి రోగంరొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు
సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు.
అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటే ఎలాటి
వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ
పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా వారికి తెలియదు.
ఈ నేపధ్యంలో,
అప్పటికే, ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయి,
పనిచేస్తున్న 104 ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు హెచ్.ఎం.ఆర్.ఐ.
(హెల్త్ మానేజిమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) వారు ఈ సమస్యపై దృష్టి
సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని
వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య
కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు, నెల నెలా క్రమం
తప్పకుండా వెళ్లి, వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు
అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున
ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే, ఈ 104 సంచార వైద్య
వాహనం పేద పల్లెప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా
చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే,
ఒక్కొక్కరిపై పెట్టే ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే,
వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.
ఈ 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక
గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు
ఏ.ఎన్.ఎం. లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టేక్నీషియన్, ఒక
డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి
ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ
స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం
పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు. అవసరమని
భావిస్తే, 108 అంబులెన్సుకి ఫోన్ చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు.
రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు, ఇతర
పరీక్షలు నిర్వహిస్తారు.
'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకానికి సంబంధించిన మొత్తం వివరాలను పవర్
పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ముఖ్యమంత్రికి వివరించడానికి హెచ్.ఎం.ఆర్.ఐ
నిర్వాహకులు ఒకనాడు సచివాలయానికి వెళ్ళారు. సమావేశం మొదలయింది.
ఉన్నట్టుండి వై.ఎస్. వారిని ఒక ప్రశ్న అడిగారు. గ్రామాలకు వెళ్ళే ఈ
బండిలో డాక్టర్ ఉంటాడా? అని. పల్లెలకు వెళ్ళే వైద్యులు లేకపోబట్టే ఈ
పధకాన్ని రూపొందించామని నిర్వాహకులు బదులు చెప్పారు. స్వయంగా డాక్టర్
అయిన వై.ఎస్. రాజశేఖర రెడ్డికి ఆ విషయం తెలియదని అనుకోము. సందేహ నివృత్తి
కోసం అడిగివుంటారు. మూడు నాలుగు స్లయిడులు వేసారో లేదో, రాజశేఖరరెడ్డి
గారు ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు, హఠాత్తుగా 'అయాం సోల్డ్ '(ఫర్ థిస్
ఐడియా) అనేసారు.
అంతే!
దాదాపు ఏడాదికి నూరుకోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ప్రాజక్టును పది
నిమిషాల్లో ఖరారుచేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.
దటీజ్! రాజశేఖర రెడ్డి.
అయితే ఆయన కన్న స్వప్నం ఇంతటితో ఆగిపోలేదు. ప్రజారోగ్యానికి సంబంధించిన
అన్ని వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తేవాలన్నది ఆయన ధ్యేయం.
ఆ పధకానికి సంపూర్ణత్వం కలిగించాలనుకున్నారు. ఈ దిక్కుగా ఆలోచించారు.
గుండెజబ్బుల వంటి పెద్ద సమస్యలు ఎదురయితే చిన్నవాళ్ళు ఏమైపోవాలి? వాటికి
వైద్యం చేయించుకోగల వెసులుబాటు వారికి ఎలా కలిగించాలి. అంతే! మరో అపురూప
వ్యవస్థ ‘ఆరోగ్య శ్రీ’ కి అంకురార్పణ జరిగింది.
చిన్నా చితకా రోగాలకు వైద్య సలహా చాలు. అందుకోసం ఇరవై నాలుగ్గంటలూ
అందుబాటులో వుండే 104 ఉచిత కాల్ సెంటరు. రాష్ట్రంలో ఏమారు మూల ప్రాంతం
నుంచయినా సరే ఏ చిన్న ఆరోగ్య సమస్యకయినా ఈ కేంద్రంలో రాత్రింబగళ్ళు
అందుబాటులో వుండే నిపుణులయిన వైద్యులు సలహాలు అందిస్తారు. వ్యాధి నిదానం
కంటే నివారణ మేలు. అందుకోసం నిర్దేశితదిన వైద్య పరీక్షలు నిర్వహించే 104
సంచార వాహనం. అత్యవసర వైద్యసాయం కోసం 108 అంబులెన్సు . ఇక విధి వికటించి
పెద్ద రోగాల పాలుపడి ఎవరు కాపాడుతారా అని ఎదురు చూపులు చూసేవారి కోసం
ఆరోగ్యశ్రీ.
పైగా, ఇవన్నీ పూర్తిగా ఉచితం. అన్నీ ఒక్క గొడుగులో.
నిజానికి వై ఎస్ ఆర్ కల అంతటితో కూడా ఆగలేదు.
104 సంచార వాహనం వారు బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను
కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ వైద్యశాలకు
వెళ్ళినా ఆ రోగుల వివరాలన్నీ నిమిషాల్లో వైద్యులకు తెలిసిపోతాయి.
అప్పటివరకు ఏ మందులు ఎన్నాల్టి నుంచి తీసుకుంటున్నది డాక్టర్లకు
బోధపడుతుంది. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు.
గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు
సూచిస్తారు. తగు మందులు, పోషకాలు ఇస్తారు. నెలనెలా పరీక్షలు చేసి పురుడు
వచ్చే సమయాన్ని నిర్ధారిస్తారు. పురిటి ఘడియలు దగ్గర పడ్డప్పుడు 108 కి
తెలియచేసి వారిని దగ్గరలోని ప్రభుత్వ వైద్య శాలకు చేరుస్తారు. సుఖ ప్రసవం
తరువాత తగిన జాగ్రత్తలు చెప్పి, తిరిగి అంబులెన్సులో ఇంటికి చేరుస్తారు.
ఆ రోజుల్లో జరిగిన సమావేశాల్లో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనేవారు.
“కడుపుతో వున్న ఆడపిల్లలను పుట్టింటికి తీసుకువచ్చి, పురుడు పోయించి
తిరిగి తల్లీ బిడ్డను క్షేమంగా అత్తారింటికి పంపడం తలితండ్రుల బాధ్యత. ఇక
నుంచీ ప్రతి పేదింటి ఆడపిల్లకూ ప్రభుత్వమే పుట్టిల్లు. వాళ్ళ బాధ్యత
ప్రభుత్వానిదే”
ఇంతే కాదు.
104 కాల్ సెంటర్ కు ఇంకా విస్తృతమైన లక్ష్యాలు నిర్దేశించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య శాలలు, నర్సింగు హోములు, ప్రైవేటు
క్లినిక్కులు, ఔషధ దుకాణాలు, బ్లడ్ బ్యాంకులు ఇలా వైద్య రంగానికి
సంబంధించిన సమస్త సమాచారం సేకరించి ఒక్కచోటే నిక్షిప్తం చేసారు.
అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా రాష్ట్రంలో ఏమూలనుంచి ఫోను చేసినా వారు
వుండే ప్రదేశానికి ఈ సదుపాయాలు యెంత దూరంలో వున్నాయి, ఏ సమయాల్లో
పనిచేస్తాయి అనే వివరాలు తెలియచేయడానికి వీలుగా ఈ ఏర్పాటు. ఇక వైద్య
ఆరోగ్య శాఖ సహకారంతో ఏ ప్రాధమిక వైద్య కేంద్రంలో వైద్యుడు అందుబాటులో
ఉన్నదీ, సెలవు మీద వెళ్లిందీ ఆన్ లైన్లో తెలుసుకుని ఆ సమాచారాన్ని అటు
అవసరమైన రోగులకూ, ఇటు పర్యవేక్షణ జరిపే అధికారులకూ ఎప్పటికప్పుడు ఈ
కేంద్రం తెలియచేస్తూ వుంటుంది. అలాగే విద్యుత్ అధికారులతో సంప్రదించి ఏ
వూర్లో ఏ సమయంలో కరెంటు వుంటుందీ, ఏ వూరి ఆసుపత్రిలో ఎక్స్ రే మిషన్లు
పనిచేయడం లేదు మొదలయిన వివరాలను సంసిద్ధంగా వుంచుకుని అడిగిన వారికి
అడిగినట్టుగా సమాచారం అందించే వ్యవస్థకు రూపకల్పన చేసారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే నాణ్యత కలిగిన వైద్య చికిత్సలను కేవలం కలిగిన
వారికే కాదు, పేదసాదలకు కూడా అందుబాటులోకి తేవాలనేది మొత్తం ఈ పధకం
లక్ష్యం.
ఆయన హఠాత్ మరణం తరవాత రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు వేగంగా మారిపోయాయి.
కారణం ఎవరయినా జరగరానిది జరిగిపోయింది. మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా
నిలవాల్సిన ఓ అద్భుత పధకం కొందరి నిర్వాకాలకు నీరుకారిపోయింది. కొందరి
స్వార్ధాలకు బలయిపోయింది. కొందరి ఆహాలను చల్లార్చడానికి మాడిమసయిపోయింది.
రాజకీయ చదరంగంలో చిక్కుకుపోయి కొందరి ఎత్తులు పైఎత్తులకు
చిత్తయిపోయింది.
ఈ పధకం వల్ల లబ్ది పొందుతున్న వారు నిరుపేదలు. వారికి నోరూవాయీ లేదు.
కష్టం వచ్చినా చెప్పుకోలేరు. ఆ కష్టం తొలగినా చెప్పుకోలేరు. ఎందుకంటే
చెప్పుకోవడానికి వారికెవరూ లేరు. వారితరపున చెప్పేవారూ లేరు.
వారి గురించి రాసేవారు లేరు. కారణం వారిలో చాలా మంది నిరక్షరాస్యులు.
చదవడం రాని వారి గురించిన వార్తలు ఎవరికీ పట్టవు.
వారి గురించి బుల్లి తెరలపై చూపించేవారు లేరు. ఎందుకంటే అలాటి ఆధునిక
సౌకర్యాలకు దూరంగా ఎక్కడో బతుకులీడుస్తున్న బడుగులు వాళ్ళు.
కర్ణుడి చావుకు అన్నట్టుగా ఈ పధకం భ్రష్టుపట్టిపోవడానికి కూడా అనేక
కారణాలు వున్నాయి. అందులో ప్రధానమయింది వై ఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం.
ఆయన జీవించి వుంటే ఈ పధకం ఇలా నీరుకారిపోయి వుండేది కాదని గట్టిగా
చెప్పొచ్చు.
(ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)
LINK:
Clipping of Andhra Prabha Telugu Daily - Andhra Pradesh Main (prabhanews.com)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి