1932 లో పుట్టారు అంటే
ఇప్పుడు ఆయన వయసు 88. నిజామాబాదు జిల్లా ఆర్మూరులో పుట్టిన జి.ఎస్.వరదాచారి గారు నాకు తెలిసినంత
వరకు అత్యంత వయోధికుడైన పాత్రికేయులు. ఈనాటి జర్నలిస్టులకు దిక్కూ, దిక్సూచి ఆయనే. ఆ
వయసులో ఆయన చురుకుదనం చూసి వయసే సిగ్గుతో పక్కకు తప్పుకుంది. డెబ్బయ్ అయిదేళ్ళు
వచ్చిన తరువాత కాబోలు అయన కంప్యూటర్ మీద
తెలుగు టైప్ చేయడం అభ్యసించి ’జ్ఞాపకాల వరద’ అనే పేరుతొ తన
జీవితానుభవాలను గ్రంధస్తం చేశారు. నేను సభ్యుడిగా
ఉన్న వయోధిక పాత్రికేయ సంఘానికి ఫౌండర్ ప్రెసిడెంట్. ఆయన జ్ఞాపకాల సమాహారం నుంచి
వెలికి తీసిన వాడని సుమమే ఈ పోస్టు.
ప్రస్తుతం
పంజాగుట్ట చట్నీస్ దగ్గర (కొత్తగా అక్కడ ఓ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది)
హైదరాబాదులో మొట్టమొదటి జర్నలిస్టుల కాలనీ నిర్మాణం అయింది. కాసు బ్రహ్మానందరెడ్డి
ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆ స్థలాన్ని మార్కెట్ రేటు ప్రకారం గజం అయిదు రూపాయల
వెల నిర్ణయించి ప్రభుత్వం కేటాయించింది. మొత్తం నలభయ్ రెండు ప్లాట్లు.
విస్తీర్ణాన్నిబట్టి ఒక్కొక్కరు 1750 నుంచి 2000 వేల రూపాయలు
కట్టాలి. అంత మొత్తం ఒకేసారి చెల్లించే స్తోమత చాలామందికి లేదు. మళ్ళీ ప్రభుత్వం
దగ్గరికి పరిగెత్తక తప్పలేదు. పన్నెండు అర్ధ సంవత్సర వాయిదాలలో కట్టడానికి
అంగీకరించింది. (అయినా కాలనీలో మూడు ప్లాట్లు మిగిలాయి. గోరాశాస్త్రిని అడిగితే ‘
ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఓనింగ్ ప్రాపర్టీ’ అన్నారు. గండూరి కృష్ణ ప్రవేశ రుసుము కట్టే
పరిస్తితి లేదంటే సొసైటీ ఆయనకు కొంత ఋణం కూడా ఇచ్చింది. చివరకు ఆయన ఇల్లు
కట్టుకోలేక ప్లాటును వాపసు ఇచ్చారు).
1968 ఏప్రిల్ మూడో
తేదీన బ్రహ్మానందరెడ్డి వచ్చి శంకుస్థాపన చేసారు.
జర్నలిస్టులు ఒక
సహకార సంఘంగా ఏర్పడి నిర్మించుకున్న మొట్టమొదటి కాలనీ పూర్తయింది. ఇక
ప్రారంభోత్సవం తరువాయి.
ప్రతి సంవత్సరం
వచ్చినట్టే నాటి రాష్ట్రపతి వీవీ గిరి గారు శీతాకాలపు విడిది కోసం హైదరాబాదు వచ్చి
వున్నారు. ఆయన చేత కాలనీ ప్రారంభోత్సవం చేయిస్తే ఎలా ఉంటుందని అందరం అనుకున్నాము.
కట్టగట్టుకుని బొలారం వెళ్ళాము. రాష్ట్రపతి మేనల్లుడు అయిన సింహం, పూర్తిపేరు
దిగుమర్తి నరసింహారావు కూడా సొసైటీ సభ్యుడు. ఈ కాలనీలో ఆయనకు ప్లాటు లేదు. ఐనా, నేను మాట్లాడి
పెడతానన్నాడు. అలాగే ప్రస్తావించాడు. అప్పుడు గిరి అన్న మాటలలో ధ్వనించిన ఆప్యాయత
నేను మరచిపోలేను.
“ఒరేయ్! నేను
రాష్ట్రపతిని రా! నా కార్యక్రమాలన్నీ మూడు నెలల ముందే నిర్ణయమైపోతాయి. నా చేతులలో
వుండదు. ఇప్పుడు కుదరదు. జర్నలిస్టు కాలనీ అంటున్నారు. నేను మళ్ళీ వస్తాను. తప్పక
ప్రారంభిస్తాను” అన్నారాయన.
కొన్నాళ్ళ తరవాత
కొంతమంది సైనికాధికారులు వచ్చి కాలనీ వున్న ప్రదేశాన్ని పరిశీలించి వెళ్ళారు.
మరికొన్నాళ్లకు రాష్ట్రపతి 1971 ఏప్రిల్ ఆరో తేదీన
ప్రారంభిస్తారని వర్తమానం అందింది. అప్పుడు సొసైటీకి పొత్తూరు వెంకటేశ్వర రావు
అధ్యక్షుడు. ఆర్. శ్రీనివాసన్ కార్యదర్శి. కాలనీకి సుప్రసిద్ధ సంపాదకుడు కోటంరాజు రామారావు పేరు పెట్టాలని నిర్ణయించాము.
అనుకున్నవిధంగానే
రాష్ట్రపతి వచ్చి కాలనీని ప్రారంభించారు. జర్నలిస్టులకు కొన్ని పట్టణాలలో ప్రభుత్వ
గృహాలు కేటాయించిన దృష్టాంతాలు ఉన్నాయి. కానీ వారే ఒక సొసైటీగా ఏర్పడి
నిర్మించుకున్న మొదటి కాలనీ ఇదే అని రాష్ట్రపతి అభినందించారు.
సభ ముగియగానే
రాష్ట్రపతి వెళ్ళిపోయారు. మా ఇంట్లో ఏర్పాటు చేసిన అల్పాహారానికి ముఖ్యమంత్రి
బ్రహ్మానందరెడ్డి, రెవెన్యూ మంత్రి వీబీ రాజు, ఇతర
ఉన్నతాధికారులు వచ్చారు”
(జ్ఞాపకాల వరద, రచన” డాక్టర్
జీ.ఎస్. వరదాచారి, ఎమెస్కో ప్రచురణ, వెల: Rs.150/- ప్రతులకు: ఎమెస్కో బుక్స్)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి